రైతులకు ఊరట.. పాత రూ.500 నోట్లతో విత్తనాలు కొనుక్కోవచ్చు : ఆర్బీఐ
భారత రిజర్వు బ్యాంకు ఓ మంచి సమాచారాన్ని వెల్లడించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్టు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన బ్యాంకు కస్టమర్లకు ఉన్న కష్టాలు తొలగించే చర్యల్లో భాగంగా కొంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టి
భారత రిజర్వు బ్యాంకు ఓ మంచి సమాచారాన్ని వెల్లడించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్టు, క్యాష్ క్రెడిట్ ఖాతాలు కలిగిన బ్యాంకు కస్టమర్లకు ఉన్న కష్టాలు తొలగించే చర్యల్లో భాగంగా కొంత ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, ఈ తరహా బ్యాంకు ఖాతాలు కలిగిన కష్టమర్లు నగదు విత్‌డ్రా పరిమితిని వారంలో రూ.50 వేలకు పెంచింది. అయితే, వీరికి రూ.2 వేల నోట్లు మాత్రమే ఇస్తారు.
కనీసం మూడు నెలల నుంచి ఈ ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ.50 వేలు తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టంచేసింది. అలాగే, రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు చేసిన పాత రూ.500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు కొనుగోలు చేయొచ్చని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ యూనివర్సిటీలు, ఐసీఏఆర్ సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు మంగళవారం నుంచి రూ.2.5 లక్షల విత్ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ నగదు లేకపోవడంతో ఇప్పటివరకు ఇది అమలు కాలేదని పేర్కొంది.