దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి ఇపుడు ఎలక్ట్రిక్ కార్ల తయారీలోకి అడుగుపెట్టింది. తాజాగా మరో కార్ల తయారీ కంపెనీ టయోటాతో కలిసి అత్యాధునిక సౌకర్యాలతో ఓ కారును తయారు చేసింది. ఈ కారుకు ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసేలా కారును డిజైన్ చేశారు.
దేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే కంపెనీల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే పలు కంపెనీలు ఈ తరహా కార్లను తయారు చేస్తున్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కానుండటంతో మారుతి సుజుకి కూడా ఈ తరహా కార్ల తయారీపై దృష్టిసారించింది.
ఇందులోభాగంగా ఎంతో ఆకర్షణీయమైన డిజైన్‌తో తాజాగా తయారు చేసిన కారును పరిశీలిస్తే, ఇప్పటివరకు దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్ల కంటే అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ కారును విదేశాలకు సైతం ఎగుమతి చేయాలని భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఈ కారును డిజైన్ చేసినట్టు ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
48 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. అదేవిధంగా 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో నడిచే కారుకు చార్జింగ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బ్యాటరీలను గుజరాత్ రాష్ట్రంలో తయారు చేస్తుంది. ఇవి డీడీఎస్జీ లిథియం అయాన్ బ్యాటరీలు. ఈ బ్యాటరీలను కారులో వినియోగించనున్నారు. ఈ కారు ధర మార్కెట్‌లో రూ.13 నుంచి రూ.15 లక్షల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.