ఆధార్ పాన్ లింకింగ్‌కు సంబంధించి ఇప్పటికే గడువు ముగిసినా.. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల 31వరకు గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ గడువును మరోమారు పొడిగించే ప్రసక్తే లేదని తేల్చేసిన సీబీడీటీ.. 31లోగా ఆధార్ కార్డుకు పాన్ కార్డును లింక్ చేయని వారిపై రూ.10 వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుకోవాలంటే పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయించడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయినా ఇంకా చాలా మంది పాన్-ఆధార్ లింక్ ప్రక్రియను పూర్తి చేయలేదు.
ముఖ్యంగా పన్ను కట్టే వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకోసం గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా గడువు తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో సోమవారం సీబీడీటీ నుంచి జరిమానా హెచ్చరికలు జారీ అయ్యాయి.
గడువు లోగా పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 234H ప్రకారం రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లని పాన్ కార్డ్ ఉపయోగించినట్టైతే రూ.10,000 జరిమానా చెల్లించాలి.