పాన్ కార్డు నంబరు - ఆధార్ కార్డు నంబర్లను అనుసంధానం చేసే ప్రక్రియ గడువు తేదీని కేంద్రం మరోమారు పొడగించింది. నిజానికి ఈ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. దీన్ని మరో మూడు నెలలు పెంచుతూ జూన్ 30వ తేదీ వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది.
పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలియజేసింది. నిర్దేశిత గడువులోగా పాన్ - ఆధార్ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై ఒకటో తేదీ నుంచి పాన్ నిరుపయోగంగా మారనుంది.
కాగా, దేశంలో పాన్ కార్డును కలిగిన ప్రతి వ్యక్తి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన గడువు ముగిసింది. రూ.1000 అపరాధ రుసుముతో మార్చి 31లోపు అనుసంధానానికి చివరి అవకాశం ఇచ్చింది.
తాజాగా ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది. చెల్లుబాటులో లేని పాన్‌తో బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల్లాంటివి తెరవలేరు. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకూ నిబంధనలు అడ్డువస్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు. ఇప్పటికే 51 కోట్ల పాన్‌లు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయని సీబీడీటీ పేర్కొంది.