Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్మలమ్మకు ఉద్వాసన తప్పదా? కొత్త విత్తమంత్రిగా ఆయనేనా?

నిర్మలమ్మకు ఉద్వాసన తప్పదా? కొత్త విత్తమంత్రిగా ఆయనేనా?
, గురువారం, 4 జూన్ 2020 (16:54 IST)
కేంద్ర ఆర్థిక మంత్రిగా తమిళనాడు ఆడపడుచు.. తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కొనసాగుతున్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ తర్వాత దేశ రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన తొలి మహిళగా ఈమె రికార్డు సృష్టించారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె అద్భుతమైన పనితీరును కల్పించారనే ప్రచారం సాగుతోంది. 
 
అయితే, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తయింది. ఈ యేడాది కాలంలో పనితీరు సరిగ్గాలేని మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం కల్పించే దిశగా ప్రధాని యోచిస్తున్నట్టు కేంద్ర వర్గాల సమాచారం. 
 
ఈ మేరకు ప్రధాని తన సన్నిహిత సహచరులతో కలిసి కేంద్ర మంత్రుల పనితీరుపై, మంత్రిత్వ శాఖలపై సమీక్ష జరిపినట్టు తెలిసింది. మంత్రిత్వ శాఖలను ఎనిమిది క్లస్టర్లుగా విభజించి, వాటి పురోగతిపై చర్చించారని సమాచారం. దీంతో మంత్రివర్గంలో చేరికలు, తొలగింపులతోపాటు మంత్రిత్వ శాఖల మార్పులుకూడా ఉండవచ్చని భావిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఆర్థిక అంశాలతో సంబంధం ఉన్న మంత్రుల మార్పు తప్పదని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మార్పు తప్పేలా లేదంటున్నారు. ఆమె స్థానంలో బ్రిక్స్‌ కూటమి బ్యాంక్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్న కేవీ కామత్‌కు ఆర్థిక శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది.
 
ఆర్థిక శాఖతో పాటు మరికొన్ని శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలున్నట్లు చెప్పుకుంటున్నారు. ఉన్నతస్థాయి వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కూటమి బ్యాంక్‌ ఛైర్మన్‌గా ఉన్న కేవీ కామత్‌ కేంద్రమంత్రివర్గంలో చేరతారని, ఆయనకు ఆర్థిక శాఖ అప్పగించడం ఖాయమైందని తెలుస్తోంది. 
 
ఆయనతో పాటు.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్‌దాస్‌ గుప్తాకు కూడా మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారైందని సమాచారం. స్వపన్‌దాస్‌ గుప్తాకు మానవ వనరుల అభివృద్ధి శాఖలో సహాయమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరితో పాటు.. కేంద్రమంత్రివర్గంలో కొత్తగా తీసుకునే వారిలో మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 8 నుంచి హోటల్స్ - రెస్టారెంట్లు : మంత్రి అవంతి