అటు రుతుపవన వర్షాలు... ఇటు డిస్కౌంట్ల వర్షాలు.. రిటైలర్లకు జీఎస్టీ షాక్
ముంచుకొస్తున్న జీఎస్టీ భూతాన్ని ఎలా తట్టుకోవాలో తెలీక మల్లగుల్లాలు పడుతున్న రిటైలర్లు దేశవ్యాప్తంగా భారీ డిస్కౌంట్లకు తెర లేపారు. జూలై 1 నుంచి దేశమంతా ఒకే విధమైన వస్తుసేవల పన్నును అమలు చేయనుండటంతో పేరుకు పోయిన కోట్లాది రూపాయల సరుకును వదిలించుకోవడానిక
ముంచుకొస్తున్న జీఎస్టీ భూతాన్ని ఎలా తట్టుకోవాలో తెలీక మల్లగుల్లాలు పడుతున్న రిటైలర్లు దేశవ్యాప్తంగా భారీ డిస్కౌంట్లకు తెర లేపారు. జూలై 1 నుంచి దేశమంతా ఒకే విధమైన వస్తుసేవల పన్నును అమలు చేయనుండటంతో పేరుకు పోయిన కోట్లాది రూపాయల సరుకును వదిలించుకోవడానికి రిటైలర్లు నానా తంటాలు పడుతున్నారు. పలు లార్జ్ కన్సూమర్ ఎలక్ట్రానిక్ రిటైలర్ చైన్స్ రూ.100 కోట్లకుపైగా చొప్పున పాత సరుకును కలిగి ఉన్నాయని అంచనా. దీంతో నష్టాలకు గురైనా సరే.. పాత స్టాక్‌ను వదిలించుకోవాలని పరుగుపెడుతున్న రిటైలర్లు టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లపై 20 నుంచి 40 శాతం డిస్కౌంట్లు ప్రకటించారు.
కన్సూమర్లకు ఏడాది మధ్యలోనే దీపావళి వచ్చేసింది. జీఎస్‌టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు 20–40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయదారులు వారి సరుకును జూలై 1 నాటికి పూర్తిగా అమ్మేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తేదీ నుంచి వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వస్తోంది.
జీఎస్‌టీ వల్ల ఈ రిటైలర్లకు నష్టాలు రావొచ్చు. అందుకే ఈ నష్టాలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించి సరుకును ఖాళీ చేసుకోవాలని చూస్తున్నారు. టెలివిజన్ సెట్స్, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు (ఏసీలు), వాషింగ్ మెషీన్లపై రిటైల్ చైన్స్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో వీటి ధరలు తగ్గాయి. రిటైలర్లు ఒక వస్తు రిటైల్ ధరపై సాధారణంగా 10–15% డిస్కౌంట్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ డిస్కౌంట్ గరిష్టంగా మూడు రెట్లు పెరగొచ్చు.
శాంసంగ్, పానాసోనిక్, హిటాచి, వీడియోకాన్ వంటి సంస్థలు కూడా కన్సూమర్ ప్రమోషనల్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. గిఫ్ట్స్, వారంటీ పొడిగింపును అందిస్తున్నాయి. రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కొత్త సరుకును తీసుకెళ్లడం నిలిపివేసిన దగ్గరి నుంచి కంపెనీలు ఈ ఆఫర్లకు శ్రీకారం చుట్టాయి. ‘రిటైలర్లు వారి స్టాక్ మొత్తాన్ని నగదులోకి మార్చుకోవాలని భావిస్తున్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 40 శాతం సెంట్రల్ జీఎస్‌టీని భరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే విక్రయించని ఉత్పత్తులపై వీరికి క్రెడిట్ ప్రయోజనం లభించదు’ అని ప్రముఖ ఎలక్ట్రికల్ గూడ్స్ రిటైలర్ సంస్థ గ్రేట్ ఈస్ట్రన్ డైరెక్టర్, పుల్కిత్ బైద్ తెలిపారు.
మొత్తం మీద జీఎస్టీ పుణ్యమా అని రిటైలర్లు నష్టపోతున్నప్పటికీ వినియోగదారులకు మాత్రం దీపావళికి ఎంతో ముందుగా డిస్కౌంట్ల పండగ వచ్చేసింది. మామూలు డిస్కౌంట్లు కాదు మామూలుగా కంటే 3, 4 రెట్ల డిస్కౌంటు మరి.