గత 2019 సంవత్సరం ఆఖరులో వెలుగు చూసిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడించింది. అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. దీంతో అనేక కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అయితే, ఈ మహమ్మారి తర్వాత మన దేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. ధనవంతులు, మరింత సంపద పరులుగా మారారు.
ఒకవైపు కరోనా కారణంగా ఎన్నో ఆర్థిక సవాళ్లు ఎదురు కావడమే కాకుండా ఉపాధి కోల్పోయే పరిస్థితులను చూశాం. కానీ, అదే సమయంలో కొందరికి మెరుగైన సంపాదన అవకాశాలు ఏర్పడినట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆదాయపన్ను రిటర్నులు ఆధారంగా చూస్తే రూ.కోటికిపైన ఆదాయం ఉన్న విభాగంలోకి గడిచిన మూడేళ్లలో కొత్తగా 57,951 మంది వచ్చి చేరారు.
కరోనా మహమ్మారి ప్రవేశానికి ముందు ఆర్థిక సంవత్సరం 2019-20 నాటికి రూ.కోటికి పైగా ఆదాయం సంపాదించే వారు 1,11,939 మంది ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి కోటీశ్వరుల సంఖ్య 1,69,890 మందికి చేరింది. అంటే మూడేళ్లలో 50 శాతం పెరిగారు. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.
కరోనా వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం 2020-21లో మాత్రం కోటికి పైన ఆదాయం ఉన్న వారి సంఖ్య 81,653కు తగ్గగా, ఇక ఆ తర్వాత నుంచి ముందుకే దూసుకుపోతోంది. కరోనా వల్ల 2020-21లో ఎక్కువ రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడం గుర్తుండే ఉంటుంది. దీనివల్లే ఆ సంవత్సరానికి కోటీశ్వరులు తగ్గారు.
మరి ఇంత పెద్ద ఎత్తున కోటీశ్వరులు పెరగడానికి కారణాలను పరిశీలిస్తే.. స్టాక్ మార్కెట్‌లో బూమ్ రావడం, స్టార్టప్ లు జోరుగా పెరగడం, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాల్లో మంచి వృద్ధి రావడం, ఒక్కరే ఒకటికి మించిన సంస్థలో పని చేయడాన్ని పన్ను అధికారులు ప్రస్తావిస్తున్నారు. 2016-17 నాటికి దేశంలో కోటీశ్వరుల సంఖ్య 68,263గానే ఉంది. ఆరేళ్లలో మూడింతలు పెరగడం మారిన దేశ ఆర్థిక పరిస్థితులకు నిదర్శనంగా చూడొచ్చు.