తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చికెన్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కిలో చికెన్ ధర రూ.250 నుంచి రూ.270కి ఎగబాకింది. చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎండాకాలంలో కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానికితోడు బహుళజాతి సంస్థలు కృత్రిమ కొరత సృష్టిస్తుంటాయి. అప్పుడు చికెన్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.
కానీ, వానాకాలంలో కోళ్ల ఎదుగుదల, ఉత్పత్తి వేగంగా జరిగే సమయంలోనూ చికెన్ ధరలు మండిపోతున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు కిలో చికెన్ ధర కేవ లం రూ.120 ఉండేది. మేలో రూ.160 నుంచి రూ.180 వరకు పెరిగింది. జూన్‌లో రూ.200 చొప్పున విక్రయించారు. జూలై మొదలుకాగానే విపరీతంగా రేట్లు పెంచేశారు.
హైదరాబాద్‌లో ఆదివారం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.276 - రూ.280 చొప్పున విక్రయించారు. కోడిని నేరుగా కొంటే కిలో రూ.170కి విక్రయిస్తున్నారు. మార్కెట్‌ను శాసించే పెద్దపెద్ద కంపెనీల వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లో కొనుగోలు ధర ఇంకా ఎక్కువగా ఉంది.
హైదరాబాద్ సహా పలుప్రాంతాల్లో బోనాల పండుగ జరుగుతుండటంతో కోళ్లకు మరింత డిమాండ్ పెరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పూర్తిస్థాయిలో తెరవటంతో మాంసం వినియోగం పెరిగింది.