ధన త్రయోదశి డిమాండ్ కారణంగా ఈ వారాంతంలో బంగారు ధర మరింతగా పెరగనుంది. ఇది ఈ వారాంతానికి రూ.1.30 లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని బంగాలు వ్యాపారులు అంటున్నారు. మరోవైపు, దేశీయ విపణిలో బంగారు ధరలు నానాటికీ పెరిగిపోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,200 పలుకుతోంది. ఇక, హైదరాబాద్ నగరంలో పుత్తడి ధర రూ.1,27,700కు చేరుకుంది. అటు కిలో వెండి ధర రూ.1.77 లక్షలు దాటేసింది.
గోల్డ్ ఈటీఎఫ్‌లు, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో పుత్తడి రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధనత్రయోదశి నాటికి 10 గ్రాముల పసిడి ధర రూ.1,30,000 పైన ఉండొచ్చని అభిప్రాయ పడ్డారు. ఇక, 2026 ఆరంభం నాటికి రూ.1.50లక్షలకు చేరొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,071.50 డాలర్లుగా ఉంది. ఈ వారాంతానికి ఔన్సు ధర 4,150-4,250 డాలర్లు చేరుకునే అవకాశముందని ఆమె తెలిపారు.
ఇక, దేశీయంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1,23,977 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. వెండి ధర కూడా రూ.లక్షన్నర దాటి పరిగెడుతోంది. అమెరికా షట్ డౌన్ ఎత్తివేతపై అనిశ్చితి, యూఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతల వంటి పరిణామాలతో బంగారంలో పెట్టుబడులకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలోనే గోల్డ్ ఈటీఎఫ్లకు గిరాకీ విపరీతంగా ఉంటోంది. సెప్టెంబరులో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (గోల్డ్ ఈటీఎఫ్)లో నిధుల ప్రవాహం పెరిగింది. ఆగస్టులో వీటిలోకి రూ.2,190 కోట్ల పెట్టుబడులు రాగా, సెప్టెంబరులో ఈ మొత్తం నాలుగింతలై రూ.8,363 కోట్లకు చేరింది. మరోవైపు, రానున్న దీపావళి పర్వదినంతో పాటు పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిడికి మరింత డిమాండ్ ఉంటుందని బులియన్ వర్గాలు అంచనా వేశాయి.