బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలన్నింటినీ కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. కరోనా మహమ్మారితో పోరాటం వేళ కేంద్రం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. వాటికి నిధులు కేటాయించే పరిస్థితి ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలను 2021 మార్చి 31 వరకూ నిలిపివేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఖర్చును తగ్గించి, నూతన కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దానిపై పోరాటానికి వినియోగించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర అభియాన్ భారత్, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
వీటి అమలుకు నిధుల కేటాయింపు ఉంటుందని, ఇతర కొత్త పథకాలను ఈ ఆర్థిక సంవత్సరంలో అనుమతించమని స్పష్టం చేసింది. ఇకపై కొత్త పథకాల కోసం ఆర్థిక శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు పంపవద్దని అన్ని మంత్రిత్వ శాఖలకు లేఖ ద్వారా సమాచారం అందించింది.