Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా దెబ్బకు ఉద్యోగం ఊడిందా? నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోండి... ఎలా?

కరోనా దెబ్బకు ఉద్యోగం ఊడిందా? నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకోండి... ఎలా?
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:22 IST)
కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా, దేశంలో లాక్డౌన్ అమలు చేశారు. ఈ కారణంగా అనేక కంపెనీలు మూతపడ్డాయి. ఈ లాక్డౌన్ ఇంకా కొనసాగుతోంది. ఫలితంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఇలాంటి నిరుద్యోగులను ఆదుకునేందుకు కేంద్ర కార్మిక శాఖ ముందుకు వచ్చింది. 
 
ఈఎస్ఐ ఖాతాలు కలిగి కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారి వేతనంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా చెల్లించనున్నట్టు కేంద్ర కార్మికశాఖ ప్రకటించింది. అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద ఈ సాయం అందించనున్నట్టు తెలిపింది.
 
ఉద్యోగాలు కోల్పోయిన వారు సమీపంలోని ఈఎస్ఐ కార్యాలయంలో స్వయంగా సంప్రదించి కానీ, ఆన్‌లైన్‌లో కానీ, పోస్టులో కానీ దరఖాస్తులు పంపవచ్చని తెలిపింది. దరఖాస్తుతోపాటు ఆధార్ కాపీ, బ్యాంకు వివరాలు, అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.
 
ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ఏడాదిపాటు అంటే వచ్చే ఏడాది జూన్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. గతంలోనూ నిరుద్యోగ భృతి లభించేది. అయితే, అప్పుడు వేతనంలో కేవలం 25 శాతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దానిని 50 శాతానికి పెంచారు. అలాగే, నిబంధనలు కూడా కొంత సరళతరం చేశారు.
 
గతంలో సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తు పంపించే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునేలా నిబంధనలు సడలించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత నిరుద్యోగ భృతి కార్మికుల బ్యాంకు ఖాతాలోనే పడనుంది. కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబాయ్‌కి కరోనాపాజిటివ్ వ్యక్తులు, ఎయిర్ ఇండియా విమానాలపై దుబాయ్ ప్రభుత్వం నిషేధం