భారత్‌ను దూరం చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ అన్నారు. భారత్ ఒక బలమైన మిత్రదేశమన్నారు. అలాంటి దేశంతో అమెరికా తన సంబంధాలను దెబ్బతీసుకోరాదని ఆమె హితవు పలికారు.
ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును కొనుగోలు చేయడాన్ని ట్రంప్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో భారత్‌పై భారీగా పన్నుల భారం మోపుతున్నారు. ఈ కారణంగా భారత్ - అమెరికా దేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ దానిపై సుంకాల భారాన్ని గణనీయంగా పెంచుతానని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేశారు. దీనిపై నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఇరు దేశాల సంబంధాలపై చర్చనీయాశంగా మారాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు కానీ చైనా, చేయొచ్చా అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
రష్యా, ఇరానియన్ నుంచి చైనా అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేస్తుందన్నారు. అలాంటి దేశానికి మాత్రం సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారంటూ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా ఆమె విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ, భారత్ వంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు.