దేశంలో వంట గ్యాస్ ధరలు మరోమారు భగ్గుమన్నాయి. బుధవారం చడీచప్పుడు కాకుండా 14.2 కిలోగ్రాముల డొమెస్టిక్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 చొప్పున చమురు కంపెనీలు పెంచేశాయి.
ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053కు చేరుకుంది. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.
ఇంతకుముందు, దేశీయ సిలిండర్ల ధరలు మే 19, 2022న సవరించారు. మరోవైపు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు బుధవారం నుంచి యూనిట్‌కు రూ.8.5 తగ్గించాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నై వంటి మెట్రోలలో, సిలిండర్ ధర వరుసగా రూ. 2,012.50, రూ. 2,132.00 రూ. 1,972.50, రూ. 2,177.50గా ఉంది.
ఈ నెల 1వతేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించినా, బుధవారం నుంచి గృహ అవసరాల గ్యాస్ ధరను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. మార్చి 22న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అంతకుముందు 2021 అక్టోబర్, 2022 ఫిబ్రవరి నెలల మధ్య దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఢిల్లీలో రూ.899.50గా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడనుంది.