నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ రేటు భారీగా తగ్గింది. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.
అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ రూ. 170, స్కిన్‌లెస్ రూ. 180కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.
కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఒకవేళ ఈ సమయంలో ఉత్పత్తి తగ్గితే మళ్లీ కార్తీక మాసం ముగిసిన తర్వాత చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు కూడా లేకపోలేవు.