భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పునరుద్ధరణకు కేంద్రం నడుంబిగించింది. ఇందుకోసం రూ.1.64 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బీఎస్ఎస్ఎల్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నిజం చెప్పాలంటే బీఎస్ఎన్ఎల్ నానాటికీ బక్కచిక్కిపోతోంది. అలాంటి సంస్థను తిరిగి గాడిన పెట్టేందుకు మోడీ ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఇందుకోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా, బీఎస్ఎన్ఎల్, భారత్ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్ లిమిటెడ్(బీబీఎన్ఎల్)ను విలీనం చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల తర్వాత దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం 4జీ నెట్‌వర్క్ సదుపాయాన్ని కల్పించే దిశగా బీఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఈ ప్యాకేజీ నుంచి భారీ మొత్తంలో నిధులు కేటాయించనుంది.