విమాన రంగ సంక్షోభం... ఆగిపోనున్న ఎయిరిండియా సేవలు

శుక్రవారం, 11 అక్టోబరు 2019 (10:08 IST)
దేశ విమానయానరంగం సంక్షోభంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ విమానరంగ సంస్థ అయిన ఎయిరిండియా సేవలు వారం పదిరోజుల్లో ఆగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)ను సరఫరా చేయబోమని చమురు రంగ కంపెనీలు తేల్చి చెప్పాయి.
 
చమురు రంగ సంస్థలకు ఎయిరిండియా పాత బకాయిలు చెల్లించాల్సివుంది. ఇవి చెల్లించేంతవరకు ఎయిరిండియాకు ఇంధనాన్ని అందించబోమని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీలు చెప్పేశాయి. 
 
గడచిన 8 నెలలుగా ఈ కంపెనీలకు ఎయిరిండియా ఇంధనానికి డబ్బులు కట్టలేదు. దీంతో రూ.5 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఆగస్టులోనూ ఇదే విధమైన నిర్ణయాన్ని చమురు కంపెనీలు తీసుకోగా, కేంద్ర పౌర విమానయాన శాఖ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దింది. 
 
ఆపైనా బకాయిలు వసూలు కాకపోవడంతో చమురు కంపెనీలు ఇప్పుడు అల్టిమేటం ఇచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎయిరిండియా రూ.60 వేల కోట్ల అప్పుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏటీఎఫ్ సరఫరాను నిలిపివేస్తే, ఏఐ విమానాల సేవలు నిలిచిపోవడం ఖాయంగా తెలుస్తోంది. 
 
అదే జరిగితే, భారత ఏవియేషన్ ఇండస్ట్రీలో సంక్షోభం మొదలైనట్టేనని, ప్రయాణికుల అవసరాలను, డిమాండ్ కు తగ్గట్టు సర్వీసులను నడిపించడంలో ప్రైవేట్ సంస్థలు విఫలం అవుతాయని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #ModixijinpingMeet మహాబలిపురాన్ని ఇందుకే ఎంపిక చేశారట....