దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి వంటి వీవీఐపీలు ప్రయాణించేందుకు వీలుగా బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ కొనుగోలుచేసింది. దీనికి ఎయిరిండియా వన్ అనే పేరు పెట్టారు. దీన్ని అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఈ అత్యాధునిక బీ777 విమానం మరికొన్ని గంటల్లో భారత గడ్డను ముద్దాడనుంది.
నిజానికి ఈ విమానాన్ని ఎయిర్ ఇండియా సంస్థకు బోయింగ్ కంపెనీ గత ఆగస్టులోనే అందించాల్సి ఉండగా... కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యమైంది. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీలో ల్యాండ్ కానుంది. మరో విమానం కొన్ని రోజుల తర్వాత అందనుంది.
మరోవైపు వీవీఐపీల ప్రయాణ సమయాల్లో ఈ రెండు విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లుకాకుండా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు నడుపనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని ప్రయాణించే విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతున్నారు.
అంతేకాదు ఇతర సమయాల్లో వాటిని కమర్షియల్ ఆపరేషన్లకు కూడా వినియోగిస్తున్నారు. కానీ, ఎయిరిండియా విమానాలను మాత్రం కేవలం వీవీఐపీల కోసం మాత్రమే వినియోగించనున్నారు. అందుకే ఇకపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు మాత్రమే ఇకపై ఈ విమానం నడుపనున్నారు.