ఆధార్ నంబర్ ఉంటేనే రైల్ టిక్కెట్?
ఆధార్ నంబర్ ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ప్రారంభించడం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే కూలీ రేట్లకు కూడా ఆధార్ నంబరును తప్పనిసరి చేశారు.
ఆధార్ నంబర్ ప్రతి ఒక్కదానికి ఆధారంగా మారింది. ఇప్పటికే బ్యాంకు ఖాతా ప్రారంభించడం నుంచి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చెల్లించే కూలీ రేట్లకు కూడా ఆధార్ నంబరును తప్పనిసరి చేశారు. తాజాగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు కూడా తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ సర్క్యులర్‌ను జారీచేయనుంది.
ఇటీవల ఈ-టికెట్ల (ఆన్‌లైన్ స్కామ్) కుంభకోణం వెలుగుచూసింది. రైల్వే అధికారులు ఇటీవల ముంబైకి చెందిన సల్మాన్ ఖాన్ నుంచి రూ.1.5 కోట్ల విలువైన 6 వేల ఈ-టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. 5400 మంది ఏజెంట్లను పెట్టుకొని.. తన బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నందుకు వారి నుంచి ప్రతి నెలా రూ.700లను సల్మాన్ ఖాన్ వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఆధార్ నంబరును తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ఈ దిశగా చర్యలు తీసుకోనుంది. ఇందులో టికెట్ల రాకెట్‌ను అడ్డుకొనేందుకు కొన్ని కఠిన నిబంధనలను అమలు చేయనున్నారు. ప్రయాణికుల యూజర్ ఐడీలను వారి ఆధార్ నంబర్లతో అనుసంధానం చేయాలని సూచించారు. అంతేగాక 'బుక్ నౌ' మీట నొక్కగానే ఓ ప్రశ్న/ఓటీపీ వచ్చే పద్ధతినీ పెట్టాలని సూచించారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చన్నారు.