కొంతమంది ముఖం పొడిబారిపోయి పాలిపోయినట్లు వుంటుంది. ముఖ వర్చస్సు మెరిసిపోవాలంటే చర్మానికి విటమిన్లు అందాలి. బాదం నూనెలో ఎ, ఇ విటమిన్లు ఉంటాయి. ఈ నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. సమపాళ్లలో బాదం, కొబ్బరినూనె కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి.
రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా తయారవుతుంది.
ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
సమపాళ్లలో బాదంనూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపి, దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.
అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.