ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిపాలకుడుగా ఎంతో అదృష్టవంతుడనే విషయం తొలి కలెక్టర్ల సదస్సులోనే ధ్రువపడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, డైరక్టర్ ఆఫ్ పోలీస్(డీజీపీ) గౌతమ్ సవాంగ్ కేవలం నెల రోజుల్లోనే కొత్త ప్రభుత్వ- 'పాలిటీ గ్రామర్'ను సూక్ష్మస్థాయిలో గ్రహించారు. ఆ విషయం సోమ, మంగళవారాల్లో రాజధాని అమరావతిలో జరిగిన సదస్సులో స్పష్టమయింది. వాళ్ళిద్దరూ ప్రభుత్వ ప్రాధాన్యాలను అనుసరించి మరీ మాట్లాడే క్రమంలో, పూర్తి 'అకడమిక్' ధోరణిని అనుసరించారు. ఇలాంటి సదస్సుల్లో అరుదుగా కనిపించే దృశ్యమిది.
సదస్సు మొదటి రోజు సీఎస్ ఎల్‌వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ- "ఆర్థిక సంస్కరణల అనంతరం (పాతికేళ్లు పూర్తయిన తర్వాత) ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలనే ఎరుకతో మనం పనిచేయాల్సి ఉంది" అంటూ, నూతన ప్రభుత్వ మారబోతున్న ప్రాధాన్యాల గురించి కలెక్టర్లుగా ఉన్న యువ ఐఏఎస్ అధికారులకు ముందస్తు సూచన చేశారు.
ప్రభుత్వం ఉపాంగాల్లో ఎగ్జిక్యూటివ్'గా పిలిచే 'బ్యూరోక్రసీ'ని చట్టాల పరిరక్షణలో దానికున్న ప్రాధాన్యం దృష్ట్యా- 'స్టీల్ ఫ్రేం'గా వ్యవహరిస్తారు. అయితే ఆర్థిక సంస్కరణల తర్వాత వాటిని అవసరాన్ని మించి తలకెత్తుకున్న నాయకత్వాలున్న ప్రభుత్వాల్లో 'బ్యూరోక్రసీ' ధృడతర నిబద్ధత క్రమంగా గుల్లబారింది. దేశం యావత్తూ ఈ దృశ్యాన్ని ఇటీవల ముగిసిన ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో చూసింది.
ఎన్నికల ప్రకటన వెలువడ్డాక, ఎన్నికైన ప్రభుత్వం పాత్ర నామమాత్రమైనప్పుడు, చట్టాలను కాపాడాల్సిన 'బ్యూరోక్రసీ' ఎలా పనిచేయాల్సి ఉంటుందనే ఒక ఆదర్శవంతమైన నమూనా, ఈ రాష్ట్రంలో ఆవిష్కృతమైంది. ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అవసరానికి మించిన జోక్యాన్ని భారత ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) ఎలా నిలువరించి 'బుక్'ను కాపాడగలరనే దాన్ని గోపాలకృష్ణ ద్వివేది ఇక్కడ నిరూపించారు.
సరిగ్గా ఆ సంవాద కాలంలో ప్రధాన కార్యదర్శిగా విధుల్లోకి వచ్చిన అధికారి- ఎల్‌వీ; దానికి మరికొంత కొనసాగింపు డీజీపీ సవాంగ్ నియామకం. కనుక వీరిద్దరి నియామకాలకు ఒక పూర్వ భూమిక ఉన్నట్టే, ఇప్పుడు వీరి కార్యాచరణ వ్యూహాల్లోనూ ఒక 'జ్వాల' (ఇగ్నిషన్) ఉండే అవకాశాలు కొట్టిపారేయలేం. అందుకే వీరిద్దరూ పునాదుల్లోకి వెళ్లి తమ కార్యరంగాల్లోని మౌలిక అంశాలను ఒక 'అకడమిషియన్ల' మాదిరి ఈ సదస్సులో ప్రస్తావించారు.
ఈ కారణంవల్లే ప్రభుత్వానికి వీరు ఒక అదనపు అండ అని చెప్పబూనడం. గత ప్రభుత్వంలో తరచూ పాడిన 'రెండంకెల వృద్ధి' పాట ఇప్పటికే పాతపడటం తెలిసిందే. అయితే రెండంకెల వృద్ధి సాధించడానికి ఏంచేయాలనే అంశాన్ని వదిలిపెట్టి, అందుకు ప్రాధాన్యాలు ఎంచుకోకుండా ఐదేళ్లు 'క్వార్టర్ వన్ (క్యూ-1)' అంటూ కలెక్టర్ల సదస్సులను కంపెనీ బోర్డ్ మీటింగ్ మాదిరిగా నిర్వహించడం చూశాం.
ఇప్పుడు ఈ పోలిక తేవడం అంటే, నెల రోజుల్లోనే జగన్మోహన్‌రెడ్డిది గొప్ప ప్రభుత్వమని చెప్పడం కోసం కాదు. అందుకు కారణం వేరే వుంది. నరేంద్ర మోదీ మరోసారి గెలిచాక, ఇప్పుడు దేశ ఆర్థికవృద్ధి అస్సలు బాగోలేదని, దేశంలో నిరుద్యోగిత శాతం విషయంలో 45 ఏళ్ల క్రితం నాటి తీసికట్టు పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ఇక 2011-17 మధ్య మనం సాధించిన 'వృద్ధి' అని చెబుతున్నది వాస్తవం కాదని భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ప్రకటించారు. దీని మీద ఇప్పటికే ఆర్థికవేత్తల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో దీనిపై ఒక మార్గదర్శనం కోసం ప్రధాని మోదీ ఈ నెల 21న దిల్లీలో ఆర్థికవేత్తలు, పలు రంగాల నిపుణులు 40 మందితో ఒక సమావేశం నిర్వహించారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో దృష్టి పెట్టవలసిన రంగాలను వారు ప్రధాని ముందు పెట్టారు. అవి- నీటిపారుదల రంగం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం.
ఆసక్తికరంగా మోదీ దిల్లీ సమావేశానికి నాలుగు రోజుల ముందు పత్రికల్లో వచ్చిన జగన్ ప్రభుత్వ తొలి కలెక్టర్ల సమావేశ 'అజెండా'లోనూ ఇవే అంశాలు ఉన్నాయి. దీన్ని బట్టి ఆర్థిక సంస్కరణలను దేశంతోపాటు తొలినాళ్లలోనే మొదలుపెట్టిన రాష్ట్రాల్లో వృత్తం పూర్తయ్యాక ప్రాధాన్యాలు మళ్లీ మొదటికి వచ్చినట్లైంది.
సీఎస్ ఎల్‌వీ మాట్లాడుతూ- ఎన్నికైన ప్రభుత్వాల ప్రాధాన్యాలు, నిబంధనల పరిమితుల్లోనే అమలు చేయడం, అందుకు అవసరమైన మానసిక సంసిద్ధతను కలెక్టర్లు అలవర్చుకోవాలని, పౌరపాలనలో ఇది అనివార్యమని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సదస్సులో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ- రాష్ట్రంలో కుల, మత ఘర్షణల గురించి ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యున్నత అధికారిక వేదికపై నుంచి, ఇలాంటి అతి సున్నితమైన అంశాన్ని ప్రస్తావించడం ఇది మొదటిసారి. బహుశా పరిస్థితి తీవ్రత స్థాయిని బట్టి దీన్ని డీజీపీ ఇక్కడ ప్రస్తావించి ఉండవచ్చు. ఇందులో మతం విషయంలో జాతీయ రాజకీయాల ప్రభావం ఉంటే, రాష్ట్ర విభజన తర్వాత, కొత్తగా కులం కేంద్రంగా రాజకీయాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, అదిప్పుడు నూతన ప్రభుత్వం ముందు కొత్త సవాలు అయింది. మహిళలు, పిల్లల భద్రత, మాదకద్రవ్యాల లభ్యత వంటి అంశాలు కూడా సవాంగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
"ఒడిశా సరిహద్దు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో ఉన్న వామపక్ష తీవ్రవాద సమస్యకు ఇప్పుడు కొత్తగా చింతూరు తోడైంది" అని డీజీపీ చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టులతోపాటు శాంతిభద్రతల సమస్యలు పెనవేసుకుని ఉంటున్నాయని, పోలవరం, వంశధార, కొవ్వాడ అణువిద్యుత్తు ప్రాజెక్టులు ఇందులో వున్నాయని డీజీపీ చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వం అభివృద్ధి-శాంతిభద్రతలను కలిపి చూస్తున్న స్పృహతో పనిచేస్తుందనే సంకేతం ఇచ్చినట్టైంది.
అయిదేళ్ల క్రితం రాష్ట్ర విభజన దశలో రాజధానికి అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేయడానికి రాష్ట్రంలో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీ విజయవాడలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇవే అంశాలను వరసగా ప్రస్తావిస్తూ, అప్పటి నగర పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు నుంచి వివరాలు సేకరించడం ఇప్పుడు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది.
సీఎస్, డీజీపీ ఇరువురు తమ ప్రసంగాల్లో, ఆర్థిక సంస్కరణల అనంతరం, రాష్ర్ట విభజన అనంతరం అంటూ రాష్ట్రానికి సంబంధించిన రెండు కీలక అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడటం ద్వారా జగన్ ప్రభుత్వం నేల విడిచి సాము చేయబోవడం లేదనే సానుకూల సంకేతం ఇచ్చినట్టు అయింది.