Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరల్డ్ ఎర్త్ డే: మనిషికి ఇదే చివరి శతాబ్దమా? డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?

వరల్డ్ ఎర్త్ డే: మనిషికి ఇదే చివరి శతాబ్దమా? డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?
, గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:38 IST)
డైనోసార్లలా మనుషులు కూడా అంతరించిపోనున్నారా? మానవ సమాజానికి ముప్పు పొంచి ఉందా? ఈ రెండు ప్రశ్నలను కాదనలేం! అణు యుద్ధం, మానవ జాతిని తుడిచిపెట్టే వ్యాధులు, వాతావరణ మార్పులు.. ఇవేవీ కాకపోతే ఏదన్నా గ్రహ శకలం భూమిని ఢీకొడితే? మనమూ డైనోసర్లలాగే అంతరించిపోవాల్సిందే!

 
తత్వవేత్త, రేడియో బ్రాడ్‌కాస్టర్ డేవిడ్ ఎడ్‌మండ్స్.. ‘మానవ సమాజం మనుగడ’ అంశంలో కృషి చేస్తోన్న నిపుణులతో మాట్లాడుతూ, ఈ ప్రమాదాల తీవ్రతను ఎలా తగ్గించాలో వివరించారు. మనుషులు ఒక శతాబ్ద కాలం బతకుతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘ప్రస్తుత మానవ జాతి, లేక మన వారసులకు పొంచివున్న ప్రమాదం అత్యంత క్లిష్టమైనది’’ అని ఆక్స్‌ఫర్డ్‌ ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్స్టిట్యూట్‌కు చెందిన ఆండర్స్ సాండ్‌బర్గ్ అన్నారు. 20వ శతాబ్దం మధ్యకాలం వరకూ, మనం సురక్షితంగా ఉన్నామనే భావనలో బతికాం. కానీ అది నిజం కాదు. మానవ జాతి మొత్తాన్ని తుడిచిపెట్టే ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి. ఇవే ఆ ప్రమాదాలు...

 
గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం
1980కి ముందువరకు భూమి, గ్రహశకలాల తాకిడికి గురవుతుందని మనం ఆలోచించలేదు. కానీ, తండ్రీకొడుకులైన ఇద్దరు శాస్త్రవేత్తలు, గ్రహశకలాలు భూమిని తాకడం వల్లనే డైనోసర్లు అంతరించిపోయాయన్న తమ కాల్పనిక సిద్ధాంతాన్ని ప్రచురించాక అందరి దృష్టికోణం మారింది. ఆ శాస్త్రవేత్తలు లూయిస్, వాల్టర్ ఆల్వరెజ్. వీరి సిద్ధాంతాన్ని తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల వేదిక మెక్సికోలో జరిగిన ఓ సమావేశంలో బలపరిచింది.

 
డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలాలు మెక్సికోలోని యుకాటన్ భూభాగంలో భూమిని తాకినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అంశంలో జరుగుతున్న పరిశోధనలో భాగంగా, లూయిస్, వాల్టర్ సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు అంగీకరించారు. మానవ జాతిని అంతం చేయగలిగినవాటిల్లో మనం సృష్టించుకున్న కారణాలు కాకుండా, బయటి నుంచి పొంచివున్న ప్రమాదం ఈ గ్రహశకలాల తాకిడి.

 
జనాభా పెరుగుదల, చాలీచాలని వనరులు, వాతావరణ మార్పులు
వాతావరణ కాలుష్యం వల్ల పొంచివున్న ప్రమాదం గురించి చాలామందికి తెలిసేవుంటుంది. కానీ యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన అధ్యయనకారులు కరీన్ కులేమన్ మాత్రం, పెరుగుతున్న జనాభా గురించి ఆలోచిస్తున్నారు. జనాభా పెరుగుదల, సహజ వనరులు అంతరించిపోవడం అంశాలు, ఎప్పుడోకానీ వార్తల్లోకి రావు. జనాభా పెరుగుదలకు, వాతావరణ మార్పులకు సంబంధం ఉందని, ఇది మానవ తప్పిదమేనని కరీన్ చెబుతున్నారు.

 
‘‘జనాభా పెరుగుదలకు మరో కోణమే వాతావరణ మార్పులు. సహజ వనరులకు మించి జనాభా పెరగడం, అవసరాలు పెరగడం.. వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. జనాభా పెరుగుదల ఆగకుండా, వాతావరణ మార్పులను అడ్డుకోవడం అసాధ్యం’’ అని ఆమె చెబుతున్నారు.

 
జీవవైవిధ్య వినాశనం
వన్యప్రాణులను నాశనం చేస్తూ మనం జీవిస్తున్నాం. ఇది చాలా విషాదకరం. కొన్ని దశాబ్దాల తర్వాత, మానవ వినియోగానికి అవసరమైన మేరకు సముద్రంలో చేపలు ఉండవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే, భవిష్యత్తులో చేపల మార్కెట్లు ఉండవు, చేపల కూర కూడా ఉండదు. కీటకాలు, పురుగులు కూడా రానురానూ మాయమవుతున్నాయి. వీటితోపాటు కొన్ని పక్షి జాతులు కూడా! ఎందుకంటే, అంతరిస్తున్న కీటకాల మీదే ఆ పక్షి జాతులు కూడా ఆధారపడి ఉన్నాయి కాబట్టి. జీవవైవిధ్యం దెబ్బతింటే పరిణామాలు ఎలావుంటాయో మనకు తెలియదని కరీన్ అంటున్నారు. భవిష్యత్తులో జరగబోయే నష్టం పట్ల కూడా అవగాహనా లోపం ఉందని ఆమె అభిప్రాయం.

 
ప్రపంచాన్ని నాశనం చేయగలిగే వ్యాధులు
గతేడాది నుంచి కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే కోట్ల మంది దీని బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. ఇది ఇంకా అదుపులోకి రాలేదు. 1918సం.లో చెలరేగిన ‘స్పానిష్ ఫ్లూ’ గురించి ప్రస్తావిస్తూ, ఆ సమయంలో 50% జనాభాకు ఆ వ్యాధి సోకిందని, ‘5 నుంచి 10 కోట్ల మంది ప్రజలు చనిపోయుంటారని ఓ అంచానా’ అని మనుషులకు పొంచివున్న జీవసంబంధమైన ప్రమాదాల అంశంపై కేంబ్రిడ్జ్‌లో పని చేస్తున్న లలితా సుందరం అన్నారు.

 
దేశంలోకి వలసలు పెద్దఎత్తును జరుగుతున్న సమయంలో స్పానిష్ ఫ్లూ వ్యాపించింది. ఇప్పుడు మెరుగైన వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ, గ్లోబలైజేషన్.. చాలా సమస్యలను కొనితెచ్చుకుంటోంది. స్పానిష్ ఫ్లూ వ్యాపించినపుడు ప్రజలు రైళ్లు, ఓడల ద్వారా ప్రయాణించి వచ్చారు. కానీ విమాన ప్రయాణం పెరుగుతున్న ఈ కాలంలో వ్యాధులు కూడా అంతే వేగంగా ప్రబలి, మానవ జాతిపై విధ్వంసకర ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంది.

 
వ్యక్తుల నుంచి పొంచివున్న ప్రమాదం
మనిషి సృష్టించిన ప్రమాదాలేవీ ఉద్దేశించి చేసినవి కావు. కానీ సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో... కొందరు వ్యక్తులు చేస్తున్న విధ్వంసకర దాడుల గురించి ఆలోచిస్తున్నాం. సింథటిక్ బయోలజీని ఉపయోగించి ల్యాబొరేటరీలలో వైరస్‌ను తయారుచేయడం అందుకు ఒక ఉదాహరణ. ‘‘ఒక్క స్విచ్ నొక్కితే ప్రపంచం అంతమవుతుందంటే, ఆ స్విచ్ నొక్కడానికి చాలామంది ఉత్సాహంగా చూపుతారు’’ అని ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన అధ్యయనకారులు ఫిల్ టోర్రెస్ అన్నారు.

 
అలాంటివారిలో మతం చేత ప్రభావితమైన అతివాదులు కూడా ఉంటారు. ప్రపంచాన్ని కాపాడాలంటే, దాన్ని అంతం చేయాలని, అందుకోసం దేవుడే వారికి కర్తవ్యబోధ చేశాడని వారు భావిస్తారు. జపాన్‌లోని ‘ఓమ్ షిన్రిక్యో’ సంస్థ అందుకు ఉదాహరణ. ఫిల్ టోర్రెస్ చెబుతున్నట్లుగా అలాంటివారి నుంచి మానవ జాతికి ప్రమాదం పొంచివున్న మాట వాస్తవమే. తమ వ్యక్తిగత కారణాలు, అభిప్రాయాలతో మానవ జాతి అంతరించిపోవడానికి కారణమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కాల్పుల ఘటనకు పాల్పడుతున్నవారు కూడా అందుకు ఉదాహరణ.

 
వీరిలో నరమేధం సృష్టించాలన్న కోరిక బలంగా ఉంటుంది. తమ చర్యల వల్ల మానవ జాతి మొత్తాన్ని అంతం చేయాలనే తమ కోరికను కొందరు బహింరంగంగా ప్రదర్శిస్తే, మరికొందరు అలా చేయలేక, గోప్యంగా తమ డైరీలలో రాసుకుంటారు. ఇలాంటి అసాంఘిక వ్యక్తులు ప్రపంచంలో ఎందరుంటారు? ఇలాంటివారు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది ఉంటారని ఒక అంచనా.

 
అణు యుద్ధం
అణు యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేయకపోవచ్చు కానీ, యుద్ధం అనంతర పరిణామాలు నాశనం చేయొచ్చు. అణ్వాయుధాల పేలుళ్లతో నగరాలు ధ్వంసమైనపుడు, ఆ పేలుడు ప్రభావంతో రేగిన ధూళి మేఘాల్లోకి, భూమిపై ఉండే స్ట్రాటోస్ఫియర్ పొర వరకు వెళ్లగలదని ‘గ్లోబల్ క్యాటాస్ట్రోఫిక్ రిస్క్’ ఇన్స్టిట్యూట్‌కు చెందిన సెత్ బామ్ అన్నారు. ఈ ధూళి కణాలు కొన్ని దశాబ్దాలపాటు అక్కడే ఉండి, సూర్యకాంతిని కూడా అడ్డుకోగలవు. అణ్వాయుధ ప్రయోగం ద్వారా మానవ జాతి అంతరించడం అన్నది వివిధ స్థాయిల్లో జరుగుతుంది. పేలుడు సంభవించాక, ప్రాథమిక స్థాయిలో నష్టం జరిగాక, ఆ ప్రభావం ఆర్థిక రంగంపై, ప్రపంచ పర్యావరణంపై పడుతుంది.

 
కృత్రిమ మేధస్సు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధస్సు) వల్ల పలు రకాలుగా ముప్పు పొంచి ఉంది. కృత్రిమ మేధకు చెందిన గణాంకాల్లో తేడా వచ్చి, అకస్మాత్తుగా గ్లోబల్ స్టాక్ మార్కెట్ పతనమై, ఆర్థిక రంగం కుదేలయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ మిషీన్లపై మనం నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉందన్నది ఒక ఆలోచన. ప్రధానంగా ‘డీప్ ఫేక్ వీడియో’ల గురించి నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ప్రముఖుల నకిలీ వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను, సందేశాలను ప్రముఖులు చెబుతున్నట్లుగా దుర్వినియోగపరచొచ్చు. ఒక దేశాధినేత మరో దేశాధినేతను బెదిరిస్తున్నట్లు, హెచ్చరిస్తున్నట్లు డీప్ ఫేక్ వీడియో సృష్టించవచ్చు. దీని ద్వారా రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది. ఈ టెక్నాలజీని పసిగట్టడం రోజురోజుకూ కష్టతరం అవుతోంది.

 
ఈ ప్రమాదాల తీవ్రతను తగ్గించడం ఎలా?
భవిష్యత్తును ఊహించగలం కానీ నిర్ణయించలేం. అలా ఊహించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్ తరంలో మిషీన్లు మానవ నియంత్రణలో ఎలా పనిచేస్తాయి అన్న అంశంపై ఆండర్స్ సాండ్‌బర్గ్ అధ్యయనం చేస్తున్నారు. మానవ జాతిని తుడిచిపెట్టే వ్యాధులు తలెత్తితే ఎలా స్పందించాలన్న అంశంపై మరికొందరు నిపుణులు పని చేస్తున్నారు.

 
అణు యుద్ధం అనంతర పరిణామాలను ఎదుర్కొని ఎలా జీవించాలన్న విషయంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, జనాభా నియంత్రణ మాత్రమే చాలా సమస్యలకు పరిష్కారమని కరీన్ చెబుతున్నారు. ‘‘కుటుంబ సభ్యుల సంఖ్య విషయంలో సామాజిక నియమాలు మారాలి. ఎక్కువ మంది పిల్లలు ఉండాలని, సహజ వనరులు, ఇతరత్రా వనరులను ఇష్టమొచ్చినట్లు వినియోగించుకోవాలని భావించరాదు’’ అని కరీన్ చెబుతున్నారు.

 
ఈ విధంగా మానవ జాతికి పొంచివున్న ప్రమాదాల నివారణలో మనం కూడా భాగస్వాములం కావచ్చు. కానీ దీర్ఘకాల ప్రణాళికలు రచించుకున్న ప్రతిసారీ మనుషులు వైఫల్యం చెందుతున్నారు. భవిష్యత్ తరాల గురించి ఆలోచించే స్థాయికి మన వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. ఒకవేళ ఈ 21వ శతాబ్దం చివరిది కాకపోతే, ఆ తర్వాత మనుగడ సాగించడం కోసం పెను సవాళ్లను ఎదుర్కోవల్సి ఉంటుందని కరీన్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో అన్ని వేరియంట్‌లను నిరోధించే ఒకే వ్యాక్సిన్‌