Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచం 2050: రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనున్న భారత్

ప్రపంచం 2050: రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించనున్న భారత్
, శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:44 IST)
నేడు అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న దేశాలే మరో 30 ఏళ్లలో జర్మనీ, జపాన్, అమెరికా దేశాలని అధిగమించి ప్రపంచ ఆర్ధిక రంగాన్ని శాసించే దేశాలుగా ఎదుగుతాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఎదుగుదలకు బ్రెక్సిట్, కరోనావైరస్, దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య కలహాలు సవాళ్లుగా కనిపిస్తున్నప్పటికీ, రానున్న దశాబ్దాల్లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా వృద్ధి రేటుని 26 శాతంగా అంచనా వేసినప్పటికీ, 2050 నాటికి ప్రపంచ మార్కెట్ ప్రస్తుతం ఉన్న స్థాయి కన్నా రెట్టింపు కావచ్చు.

 
ఈ ఎదుగుదలతో పాటు ప్రపంచంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. భవిష్యత్ ఎలా ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, అత్యధిక మంది ఆర్ధిక వేత్తలు మాత్రం నేడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే రేపటి ఆర్ధిక సూపర్ పవర్లనే విషయాన్ని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు.

 
ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన 'ది వరల్డ్ ఇన్ 2050' నివేదిక ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న జాబితాలో ఉన్న 7 దేశాలలో 6 దేశాలు ఇంకో 30 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరుతాయని పేర్కొంది.

 
అమెరికా (రెండవ స్థానం నుంచి 3వ స్థానానికి), జపాన్ (4 నుంచి 8వ స్థానానికి) జర్మనీ (5 నుంచి 9 వ స్థానానికి) పడిపోతాయని వ్యాఖ్యానించింది. వియత్నాం, ఫిలిప్పీన్స్, నైజీరియా లాంటి ఆర్ధిక వ్యవస్థలు కూడా మరో 30 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందుతాయని ఈ నివేదిక చెప్పింది.

 
అభివృద్ధి పధంలో ఉన్న దేశాలలో గణనీయంగా చోటు చేసుకుంటున్న మార్పులని అక్కడి ప్రజలు స్వీకరిస్తున్న విధానం, , ఆ దేశాల్లో నివసించడం వలన ఉండే లాభాలు, ఎదురవుతున్న సవాళ్ళను అర్ధం చేసుకునేందుకు బీబీసీ ఐదు దేశాల పౌరులతో మాట్లాడింది.

 
పీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం, 2050లో టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు
చైనా
భారత్
అమెరికా
ఇండోనేసియా
బ్రెజిల్
రష్యా
మెక్సికో
జపాన్
జర్మనీ
యూకే

 
చైనా
పర్చేసింగ్ పవర్ పారిటీ (పిపిపి) అనే అంతర్జాతీయ సంస్థ అంచనా వేసిన స్థూల జాతీయ ఉత్పత్తి ప్రకారం, చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్ధిక వ్యవస్థగా పరిణమించింది. ఇది ఇప్పటికే ఆర్ధికంగా ఎదిగినప్పటికీ, ఈ ఎదుగుదల కేవలం శిఖరానికి ఒక అంచులాంటిదేనని, భవిష్యత్లో ఇది మరింత అభివృద్ధి చెందుతుందని ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

 
చైనాలో నివసిస్తున్న వారి కళ్ళ ముందే అతి పెద్ద ఆర్ధిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. "గత కొన్నేళ్లుగా నేను నివసిస్తున్న షిజో ఇండస్ట్రియల్ పార్క్ షాపింగ్ మాల్స్, పార్కులు , రెస్టారంట్లు , ట్రాఫిక్ తో నిండిపోయింది. ఇక్కడికి నేను 15 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఇక్కడ అంతా వ్యవసాయ భూమి ఉండేది ", అని వన్ మినిట్ చైనీస్ బుక్స్ అనే పుస్తకం రాసిన రోవాన్ కోల్ చెప్పారు. "ఇది చైనా లో ప్రతి రోజు జరుగుతున్న కధే. దేశం అంతా శరవేగంగా మారిపోతోంది".

 
ఈ మార్పులు కొత్త వ్యాపారవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్వాగతం పలుకుతున్నాయి. చాలా మంది కొత్త వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని చైనాలో అతి పెద్ద నగరమైన షాంఘై లో ప్రారంభిస్తారు. “షాంఘై, వాణిజ్య నగరమని" ఫల్ క్రం స్ట్రాటజిక్ అడ్వైజర్స్ సంస్థ వ్యవస్థాపకులు జాన్ పాబన్ అన్నారు. ఆయన అమెరికా దేశస్థుడు.

 
“పొద్దునే మార్కెట్లలో, ట్రాఫిక్ లైట్ల దగ్గర పని చేసే చిన్న వ్యాపారుల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు ఆఫీస్ లలో పని చేసే ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు ఇక్కడ పరుగులు పెట్టాల్సిందే". పాబన్ ఇంతకు ముందు నివసించిన న్యూ యార్క్ నగరంతో పోల్చి చూస్తే ఇక్కడ అందరూ ఏదైనా విషయం వినడానికి, సలహా ఇవ్వడానికి ముందుకు వస్తారని అన్నారు.

 
“ఇక్కడ బ్రతకాలంటే తప్పనిసరిగా చైనీస్ భాష మాండరిన్ నేర్చుకోవల్సి ఉంటుంది”. చైనాలో ఇంతకు ముందు లాంటి పరిస్థితులు లేవని, పాబన్ అన్నారు. భాష రాకపోతే ఇక్కడ ఉద్యోగం దొరకడం కష్టం మాత్రమే కాకుండా ఇక్కడ ప్రజలు కూడా వారితో కలవడానికి ఆమోదించరు.

 
భారత్
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవ స్థానంలో ఉన్న భారత దేశం మరో మూడు దశాబ్దాల్లో ఏటా సగటున 5 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలతో గణనీయంగా ఆర్ధిక అభివృద్ధి సాధించనుందని నివేదిక పేర్కొంది. 2050 కల్లా భారతదేశం, అమెరికాను అధిగమించి ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో 15 శాతం వాటాతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో రెండవ స్థానంలో నిలుస్తుందని అంచనా వేసింది. ఈ అభివృద్ధి ఫలాలు ఇప్పటికే ప్రజలకు చేరడం ప్రారంభమైంది.
webdunia

 
“20వ శతాబ్దం చివర నుంచి 21వ శతాబ్దం ఆరంభం వరకు నా కళ్ళ ముందు దేశ స్వరూపం మారిపోవడం చూస్తున్నాను" అని టాక్ ట్రావెల్ యాప్ నిర్వాహకుడు సౌరభ్ జిందాల్ అన్నారు. ఆర్ధిక రంగంలో చోటు చేసుకున్న మార్పులు ప్రజల జీవన విధానంలో, నగర జీవితంలో, దేశ పౌరుల నడవడిక, అలవాట్లలో అనేక మార్పులు తెచ్చాయని ఆయన వివరించారు.

 
ఉదాహరణకు గత 15 ఏళ్లలో ప్రజలు వాడుతున్న టీవీ సెట్లలో, కారు బ్రాండ్లలో, మొబైల్ ఫోన్ నాణ్యతలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. విమాన ప్రయాణాలు చాలా మందికి అందుబాటులోకి రావడమే కాకుండా, చాలామంది ఖరీదైన , విలాసవంతమైన భవనాలలో నివసిస్తున్నారని అన్నారు.

 
ఈ అభివృద్ధి అంత సులభంగా జరగలేదు. దేశంలో చాలా కార్లు ఉన్నప్పటికీ తగినంత మౌలిక సౌకర్యాలు మాత్రం అభివృద్ధి చెందలేదు. తగిన నియంత్రణ లేకపోవడంతో దిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరిగింది. ఈ అభివృద్ధి దేశంలో ప్రతి పౌరుడికీ సమానంగా అందలేదు. “ఇక్కడ చాలా మంది ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలను అనుభవించటం లేదు. ఉదాహరణకు ఒక ఆకాశ హర్మ్యం లాంటి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ పక్కనే ఒక మురికివాడ కూడా ఉంటుంది”.

 
దేశంలో మహిళల పట్ల ప్రవర్తించే తీరు, నేరాల స్థాయి కూడా కొంత ఆగ్రహానికి గురి చేసే అంశంగా ఉంది. “ఒక దేశ అభివృద్ధి ఆ దేశ ప్రజలు అనుభవిస్తున్న హక్కుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ దిశలో ఇంకా చాలా ముందుకు ప్రయాణించాల్సి ఉంది” అని మైసూర్‌లో నివసించే బ్లాగర్ నమిత కులకర్ణి అభిప్రాయపడ్డారు. మహిళలు పబ్లిక్ స్థలాలలో సురక్షితంగా ఉన్నారనేంత వరకు ఎంత అభివృద్ధి జరిగినా నిరర్ధకమని అన్నారు.

 
ఎవరైనా విదేశీయలు భారతదేశం వచ్చి స్థిరపడాలనుకుంటే ముందుగా ఈ దేశ పరిస్థితులను పరిశోధించి రావాలని సలహా ఇచ్చారు. ఈ దేశంలో వివిధ ప్రాంతాల మధ్య భాష, సంస్కృతి, అలవాట్లు, సంప్రదాయాలలో అనేక వ్యత్యాసాలు ఉంటాయని చెప్పారు. "నాకైతే ఈశాన్య రాష్ట్రాలంటే ఇష్టం" అని నమిత తెలిపారు.

 
వాళ్ళ దేశాలలో ఉండే పద్ధతులను ఇక్కడ అవలంబించాలని చూడటం కంటే, ఇక్కడ ఉన్న పద్ధతులకు అనుగుణంగా వారే మారితే బాగుంటుందని కొంత మంది సలహా ఇస్తారు. "భారతదేశానికి అలవాటు పడండి, కానీ దేశం మీ కోసం మారదు" అని జిందాల్ అన్నారు.

 
బ్రెజిల్
దక్షిణ అమెరికాలో అత్యంత శక్తివంతమైన దేశం బ్రెజిల్ 2050 నాటికల్లా జపాన్, జర్మనీ, రష్యాలని అధిగమించి ప్రపంచంలోనే ఐదవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదుగుతుంది. మంచి సహజ వనరులు కలిగిన దేశంగా బ్రెజిల్ గత కొన్ని దశాబ్దాలుగా ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ శాఖల్లో నెలకొన్న అవినీతి, ఆర్ధిక మాంద్యం నియంత్రణ చేసే అంశాలలో ఈ దేశం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటోంది.

 
2000 సంవత్సరం తర్వాత నుంచి 2010 ప్రారంభం వరకు ఆర్ధిక వ్యవస్థకి సంబంధించి దేశంలో జరుగుతున్న పరిస్థితిని అంతా నేను గమనించాను. ఈ దేశంలో ఆవిర్భవించిన ఒక కొత్త మధ్య తరగతి పట్ల ఇక్కడి ప్రజలు చాలా గర్వపడుతున్నారని స్యావు బెర్ సట్ అనే బ్రెజిల్ పౌరుడు చెప్పారు. అదే సమయంలో పెద్ద నగరాలైన రియో డి జెనియోరో , సావ్ పాలో లాంటి నగరాలు సామాన్య ప్రజల నివాసానికి అందుబాటులో లేవని అన్నారు. “ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కంటే అధికంగా అభివృద్ధి జరుగుతుందేమో అని ఒక దశలో అనిపించిందని అన్నారు. జరుగుతున్న అభివృద్ధికి సరితూగే స్థాయిలో వ్యాపార కూడళ్లు, రైల్ మార్గాలు, రోడ్ మార్గాలు, నౌకా కేంద్రాలు లేవని తెలిపారు."

 
బ్రెజిల్ కి ఎదురైనా సవాళ్ళే ఆ దేశం టెక్నాలజీని త్వరితగతిన వినియోగించడానికి సహకరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో అధిక అభివృద్ధి ఆర్ధిక మాంద్యానికి దారి తీస్తుంది. పెరుగుతున్న ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకోవడానికి బ్రెజిల్ చేసిన ద్రవ్య నిల్వలు వలన ఆ దేశం ఆర్ధిక, సాంకేతిక శక్తిగా తయారు అవ్వడానికి సహకరించిందని అన్నలిసా నాష్ ఫెర్నాండేజ్ , ఇంటర్ కల్చరల్ స్ట్రాటెజిస్ట్ చెప్పారు. స్మార్ట్ ఫోన్ల విప్లవం మార్కెట్ ని వెల్లువెత్తక ముందే ఇక్కడ ప్రజలు గత 20సంవత్సరాల నుంచి ఏటిఎంల ద్వారా పేపాల్, వెన్మోలను వాడి ఆర్ధిక లావాదేవీలు జరుపుతున్నారని అన్నారు.

 
2016లో చోటు చేసుకున్న ఆర్ధిక మాంద్యం దేశాన్ని కొంత వెనక్కి నెట్టేసినప్పటికీ, గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వంతో దేశం మళ్ళీ ఆర్ధికంగా పుంజుకుంటుందని రోయఁటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. కొన్ని ఆర్ధిక సవాళ్లు ఉన్నప్పటికీ భవిష్యత్ ఆశాజనకంగా ఉందనే ఆశ ఉందని, బ్రెజిల్ దేశస్థుడు సిల్వానా ఫ్రాఫియెర్ అన్నారు.

 
గనులు, వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తుల రంగాలలో బ్రెజిల్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్ధిక శక్తి. సర్వీస్ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. పర్యాటక రంగంలో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉన్నప్పటికీ ఈ దేశంలో కొత్త వారికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఈ దేశపు భాషని నేర్చుకోవల్సి ఉంటుంది.

 
"బ్రెజిల్ విదేశీయులకు స్నేహపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. బ్రెజిల్ దేశస్థులు సాంఘికంగా ప్రజలతో ఎక్కువ కలిసిపోయే మనుషులు. విదేశీయులు వారి దేశ సంస్కృతి, భాష పై ఆసక్తి చూపించడాన్ని బ్రెజిల్ ప్రజలు ఇష్టపడతారు", అని ఫ్రాఫియెర్ చెప్పారు. పోర్చుగీస్ నేర్చుకుంటే సొంత దేశంలో ఉన్న భావనే కల్గుతుంది.

 
మెక్సికో
మెక్సికో2050 నాటికి ప్రస్తుతం ఉన్న పదకొండవ స్థానం నుంచి ప్రపంచంలోనే ఏడవ పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదుగుతుంది. ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక పరిస్థితి నష్టాలలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో, మెక్సికో పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతులు పై పెట్టిన దృష్టి దేశ ఆర్ధిక ప్రగతికి కారణమైంది.

 
“గత పది సంవత్సరాల నుంచి మెక్సికన్ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి పధంలో నడుస్తోంది, కానీ నేను అనుకున్నంత, దేశానికి ఉన్న శక్తి సామర్ధ్యాల కనుగుణంగా అభివృద్ధి చెందలేదని”, పుయెర్టో వాల్లర్తాలో నివసించే బ్లాగర్ ఫెడెరికో ఆరిజబలగా చెప్పారు.

 
“ఇంధనం ధర గత 5 సంవత్సరాలలో రెట్టింపు అవ్వడమే కాకుండా మెక్సికన్ కరెన్సీ పేసో విలువ కూడా గత పది సంవత్సరాలలో 50 శాతానికి పడిపోయింది. కానీ, అవకాశాలు దొరికి కష్టపడి పని చేస్తే ఎన్నో ఖరీదైన దేశాల కంటే మెరుగైన జీవితం ఇక్కడ అనుభవించవచ్చని", అయన అన్నారు. వైద్యం, రవాణా సౌకర్యాలు ఈ దేశంలో అందరికి అందుబాటులో ఉంటాయని అన్నారు

 
మెక్సికో నగరంలో ఎక్కడికి వెళ్లాలన్న 4 నుంచి 10 డాలర్లు ( 800 రూపాయిల లోపే ) ఖర్చవుతుందని ఇంటర్నేషనల్ లివింగ్ సీనియర్ ఎడిటర్, అమెరికా దేశస్థురాలు సూజన్ హాస్కిన్స్, చెప్పారు. ఆమె ప్రస్తుతం మెరిడా, యుకాటన్ లో నివసిస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలాగే ఇక్కడ కూడా మౌలిక సదుపాయాల కొరత ఉంది. కానీ, ప్రభుత్వం 44 బిలియన్ డాలర్ల (33,000 కోట్ల రూపాయిలను) పెట్టుబడిని మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రకటించినట్లు రోయఁటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

 
మెక్సికోలో కూడా వివిధ ప్రాంతాల మధ్య సంస్కృతి, వాతావరణ వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ దేశంలో స్థిరపడాలనుకునే విదేశీయులు కొంత పరిశోధన చేసి, కొన్ని నగరాలు చూసి, ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటే బాగుంటుందని మెక్సికన్ దేశస్థులు విదేశీయులకి సలహా ఇచ్చారు. ఈ దేశంలో ఉండాలంటే స్పానిష్ భాష తెలిసి ఉండటం చాలా ముఖ్యం. ఇతరులతో మాట్లాడేటప్పుడు వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఇక్కడ ప్రజలు చాలా సహాయం చేస్తారని హాస్కిన్స్ అన్నారు.

 
నైజీరియా
ఆఫ్రికాలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ నైజీరియా కూడా 2050 కల్లా ఏటా 4.2 వృద్ధి రేటుతో, 22 వ స్థానం నుంచి 14 వ స్థానానికి చేరి బలమైన ఆర్ధిక వ్యవస్థగా రూపొందుతుంది. ఇక్కడి ప్రభుత్వం అవినీతి నిర్మూలనతో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ , ప్రజలు మాత్రం దేశ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు.

 
నైజీరియా జనాభాలో 30 శాతం మంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వారున్నారని గ్లోబల్ ఎంట్రీప్రీన్యూర్ షిప్ మానిటరింగ్ డేటా పేర్కొంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక శాతం. నైజీరియాలో ఒక ఉత్సాహకర వాతావరణం నెలకొని ఉందని యాక్సిలరేట్ టివి ఛానల్ అధినేత కోలెట్ ఓటుశేషో చెప్పారు.నైజీరియాలో ప్రజలు సహజంగా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారని దీంతో, ఎప్పుడూ ఎదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారని అన్నారు.

 
దేశంలో రవాణా సదుపాయాలు మాత్రం తక్కువగా ఉన్నప్పటికీ, వాటిని కూడా ఇక్కడ ప్రజలు వ్యాపార అవకాశంగా మలుచుకున్నారని చెప్పారు. ఉబెర్ ని పోలిన మోటార్ బైక్ యాప్ ఒకడాస్ ఎక్కువ వాడుకలో ఉందని చెప్పారు. దేశ భవిష్యత్ పట్ల నైజీరియా ప్రజలకి ఆశ ఉన్నప్పటికీ, ప్రభుత్వ శాఖల్లో ఉన్న అవినీతి వలన విదేశీ పెట్టుబడులు రావేమో అన్న అనుమానం కూడా ఉంది.

 
తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న దేశం గురించి కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, లేకపోతె తమ దేశపు సహజ వనరులను, ముడి సరుకులను కొల్లగొట్టే ప్రమాదం ఉందని, ట్రావ్ సోలో అధినేత షిజోబా అన్యోహ అన్నారు.

 
కొత్తగా వచ్చేవారు మంచి స్కూలు, ఆహారం, నైట్ లైఫ్ ఉండే లాగోస్ లో కానీ అబూజాలో కానీ ఉంటే బాగుంటుందని చెప్పారు. ముందుగా పరిచయం ఉన్నవారెవరైనా ఉంటే బాగుంటుందని లేదంటే వీధి దొంగలు బారిన పడే అవకాశం ఉందని అన్నారు. చుట్టూ ఉన్నవారిని గమనించుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

 
(ఈ వ్యాసం, బీబీసీ ట్రావెల్ ప్రారంభించిన 'లివింగ్ ఇన్' అనే సిరీస్ నుంచి తీసుకున్నది)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరును కమ్ముకున్న కరోనా.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్