సౌదీ అరేబియాలో మహిళలు ఇకపై పురుషుడి రక్షణ లేకుండా స్వతంత్రంగా ప్రయాణించవచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం నాడు ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం 21 ఏళ్ళ వయసు పైబడిన మహిళలు, పురుష సంరక్షకుడి అనుమతితో నిమిత్తం లేకుండా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇకపై దేశంలోని వయోజనులందరూ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుని ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. దీనితో మహిళలకు పురుషులతో సమానంగా ప్రయాణ హక్కు లభించినట్లయింది. ఇదే కాకుండా, మహిళలకు బిడ్డ జననం, పెళ్ళి, విడాకులను రిజిస్టర్ చేసుకునే హక్కు కూడా ఈ ఆదేశాలతో సమకూరింది.
రాచరిక ఆదేశాలలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఉద్యోగ నియామకాల విధానంలో మార్పులు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంటే, ఇకపై దేశంలో ఎవరైనా వయో, లింగ, వైకల్య భేదాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ఉద్యోగం చేసే హక్కును పొందుతారు.
ఇప్పటివరకు, ఎవరైనా సౌదీ మహిళ పాస్‌పోర్టు పొందాలన్నా, విదేశాలకు ప్రయాణించాలన్నా పురుష సంరక్షకుడి - భర్త, తండ్రి లేదా పురుష బంధువు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. సౌదీ అరేబియా పాలకుడు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దేశంలో భారీ సంస్కరణలను అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మహిళలు స్వతంత్రంగా డ్రైవ్ చేయడంపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేయడం వంటి నిర్ణయాలు వెలుగు చూశాయి.
మహమ్మద్ బిన్ సల్మాన్ 2016లో తన ఆర్థిక విధానాన్ని ప్రకటించారు. పని చేసే చోట మహిళల ప్రాతినిధ్యాన్ని 22 శాతం నుంచి 30 శాతానికి పెంచుతూ 2030 నాటికి దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేయాలన్నదే ఆయన ప్రణాళిక. సౌదీలోని కొంతమంది ఉన్నత వర్గాల మహిళలు చాలా కాలంగా లింగ వివక్ష వేధింపుల మూలంగా కెనడా వంటి దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
గత జనవరి నెలలో, 18 ఏళ్ళ రహాఫ్ మహమ్మద్ అల్ కునన్‌కు కెనడా ఆశ్రయం కల్పించింది. ఆమె సౌదీ అరేబియా నుంచి పారిపోయి ఆస్ట్రేలియా చేరుకోవాలనుకున్నారు. కానీ, ఆమె థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ విమానాశ్రయంలోని హోటల్ గదిలో దొరికిపోయారు. తనను స్వదేశానికి పంపించవద్దని ఆమె అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. సౌదీలో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు తరచూ చెబుతున్నాయి.