Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?

కరోనావైరస్ లేనివాళ్లే దేశంలో ఎక్కువగా చనిపోతారా? ఎందుకు?
, గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:39 IST)
ఇప్పుడు భారత వైద్య వ్యవస్థ మొత్తం కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడంపైనే దృష్టి పెట్టింది. కాలాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని చాలా క్లినిక్‌లు, ల్యాబ్‌లు మూతపడ్డాయి. దీంతో మధుమేహం, గుండె జబ్బుల లాంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 
రాబోయే రోజుల్లో కరోనావైరస్ సోకినవారితో పోలిస్తే, కరోనావైరస్ సోకనివాళ్ల మరణాలు ఎక్కువవుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో క్లినిక్‌లకు వెళ్లేవాళ్లూ రోజూ కోటి మంది వరకూ ఉంటారు. మధుమేహం గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు వీళ్లలో ఉంటారు. వీరికి రక్త పరీక్షలు, ఎక్స్ రే, సోనోగ్రఫీ, ఎమ్ఆర్ఐ వంటి పరీక్షలు అవసరమవుతాయి.

 
కానీ, ఇప్పుడు ఇలాంటివారిపై వైద్యులు తక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్‌లు ఉన్నా, సిబ్బంది తక్కువగా ఉంటున్నారు. ఆసుపత్రుల్లో కరోనావైరస్ కేసులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా 75 శాతానికిపైగా క్లినిక్‌లు, ల్యాబ్‌లు మూతపడ్డాయి.

 
‘‘దేశంలో పది లక్షల దాకా ల్యాబ్‌లు ఉన్నాయి. వాటిలో 75 శాతానికిపైగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల కారణంగా మూతపడ్డాయి. కొన్ని పెద్ద ప్రైవేటు ల్యాబ్‌లు నడుస్తున్నా, వాటిలో చాలా తక్కువ మంది సిబ్బంది ఉంటున్నారు’’ అని ట్రాన్జెషియా అనే ల్యాబ్ పరికరాల సరఫరా సంస్థ అధిపతి సురేశ్ వజీరానీ చెప్పారు.

 
సిబ్బంది రావట్లేదు
ముంబయిలో ఉన్న తమ ఐదు ల్యాబ్‌ల్లో మూడు పనిచేస్తున్నాయని, కానీ 52 మంది సిబ్బందిలో 10 మందే పనికి వస్తున్నారని పాథాలజిస్ట్ డాక్టర్ అపర్ణ జయరాం చెప్పారు. ‘‘కరోనా బాధితులతో పోల్చితే సాధారణ రోగులు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి’’ ఆమె అన్నారు.

 
ముంబయికి చెందిన కేర్ గోయల్‌ గర్భసంచి సమస్యతో బాధపడుతున్నారు. ఆమె ప్రతి -2 నెలలకు ఓసారి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ‘‘లాక్‌డౌన్ కారణంగా నేను డాక్టర్ దగ్గరకు వెళ్లలేకపోతున్నా. నెలనెలా నేను సోనోగ్రఫీ చేయించుకోవాలి. ఇప్పుడు దానికి వీలు లేకుండా పోయింది’’ అని అన్నారు.

 
పరిస్థితి తీవ్రమైతే ఎలా అని ప్రశ్నించినప్పుడు... ‘‘నేనైనా క్లినిక్‌కు వెళ్లాలి. డాక్టర్ అయినా మా ఇంటికి రావాలి’’ అని కేర్ గోయల్ అన్నారు.

 
తక్షణ అవసరం ఉంటేనే...
దిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో నఫీసా కౌసర్ అనే 75 ఏళ్ల మహిళ ఉంటున్నారు. ఆమె 20 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు కూడా ఉంది. క్రమం తప్పకుండా లిక్విడ్ ప్రొఫైల్‌తోపాటు రకరకాల రక్తపరీక్షలు ఆమె చేయించుకోవాల్సి ఉంటుంది.

 
‘‘మార్చి చివర్లో నేను రక్త పరీక్షలు చేయంచుకోవాల్సి ఉంది. కానీ, లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమవుతుంది. అంతకుముందు ల్యాబ్ నుంచి ఓ వ్యక్తి ఇంటికి వచ్చి, రక్త నమూనా తీసుకువెళ్లేవారు. ఇప్పుడు తమ వద్ద సిబ్బంది లేరని ల్యాబ్ వాళ్లు చెబుతున్నారు. కొరియర్ సేవలు కూడా నడవడం లేదు’’ అని ఆమె చెప్పారు.

 
ఆమె లైఫ్ స్పాన్ అనే క్లినిక్‌కు వెళ్తుంటారు. భారత్ వ్యాప్తంగా దీని శాఖలు ఉన్నాయి. రోగులను చూడటం, సిబ్బంది లేకపోవడంతో టెలీ మెడిసిన్‌కు ఆర్డర్లు తీసుకోవడం ఆ సంస్థ ఆపేసినట్లు చెబుతున్నారు.

 
తక్షణ అవసరం లేని సర్జరీలను వైద్యులు ఇప్పుడు చేయడం లేదు. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉండే 40 ఏళ్ల విజయ్ జాధవ్ కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు చూపు మందగిస్తోంది. కార్నియా మార్పిడి చికిత్సను తక్షణమే ఆయన చేయించుకోవాల్సి ఉంది.

 
‘‘చికిత్స కోసం మేం మొదట పుణె వెళ్లాం. వెంటనే సర్జరీ చేయించుకోవాలని వాళ్లు చెప్పారు. కార్నియా మార్పిడి సర్జరీ అక్కడ చేయలేమని... హైదరాబాద్ కానీ, ఇండోర్ కానీ వెళ్లమని అన్నారు’’ అని విజయ్ సోదరి అంకితా జాదవ్ వివరించారు. ఇంతలోనే లాక్‌డౌన్ వచ్చిందని.. హైదరాబాద్, ఇండోర్‌లోని ఆసుపత్రుల్లో సర్జరీ కోసం కార్నియాలు అందుబాటులో లేవని తమకు తెలిసిందని ఆమె అన్నారు. ‘‘ఇప్పుడు మేం జల్నా జిల్లాలోని ఓ ఆసుపత్రికి వచ్చాం. ఇక్కడి వైద్యుల సలహా తీసుకుంటున్నాం’’ అని అన్నారు.

 
నడవాలనే నిబంధనలు చెబుతున్నాయి
లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం ప్రాథమిక వైద్య వైద్య సేవలన్నీ అత్యవసర సేవల కిందకు వస్తాయి. వాళ్ల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలూ ఉండవు. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు సేవలు అందించడం లేదని, రహదారులపై పోలీసులు ఆపుతున్నారని రోగులు చెబుతున్నారు. ఇండోర్‌లోని సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్‌ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ వ్యాస్‌‌ను ఈ అంశం గురించి బీబీసీ మరాఠీ సంప్రదించింది.

 
‘‘మేం ఇప్పుడు చాలా ముఖ్యమైన సర్జరీలనే చేస్తున్నాం. కార్నియా మార్పిడి చెయ్యాలంటే దాత కావాలి. ఇండోర్‌లో ప్రభుత్వ ఆమోదిత ఐ బ్యాంక్ ఒకటి ఉంది. కానీ, లాక్‌డౌన్ కారణంగా అది మూతపడింది’’ అని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌‌కు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని, కానీ ఇది మరీ ఎక్కువైతే సమస్య రావొచ్చని కేర్ గోయల్ అన్నారు.

 
వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా తన లాంటి వాళ్లం చాలా సున్నితమైన స్థితిలో ఉన్నామని నఫీసా కౌసర్ అన్నారు. ‘‘గత పది రోజుల నుంచి నేను ఇంటి బయట అడుగుపెట్టలేదు. రక్త పరీక్షలు ఎప్పుడు చేయించుకుంటానో తెలియదు. శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా’’ అని ఆమె అన్నారు.

 
నిపుణుల కొరత
వైద్యులు, క్లినిక్‌లలో పనిచేసే నిపుణులు అత్యవసర సేవల విభాగం కిందకే వస్తారని కేంద్రం పదేపదే చెబుతూ ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. చాలా మంది వైద్యులు, నిపుణులు ఇళ్లలోనే ఉండిపోతున్నారని, కరోనావైరస్ భయంతో వాళ్ల కుటుంబ సభ్యులు వారిని ఆపుతున్నారని డాక్టర్ అపర్ణ జయరాం అంటున్నారు. కొందరు ఎలాగో బయటకు వచ్చినా, పోలీసులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

 
‘‘మా ఐదు ల్యాబ్‌ల్లో మూడు పనిచేస్తున్నాయి. కానీ, సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. రోజూ 18 గంటలు పనిచేస్తున్నా. విషమంగా ఉన్న, పాత రోగుల ఇళ్లకు వ్యక్తిగతంగానే నేను వెళ్తున్నా. వాళ్ల రక్త నమూనాలు సేకరిస్తున్నా’’ అని ఆమె వివరించారు.

 
‘‘రోగులను చూడాలని ప్యాథాలజీ వైద్యుల వాట్సాప్‌ బృందాల్లో సందేశాలు పెడుతున్నాం. కానీ, పెద్దగా ప్రభావం ఉండటం లేదు. ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల కూడా వాళ్లు ఆందోళనతో ఉన్నారు’’ అని అపర్ణ చెప్పారు. తనకు కూడా కొన్ని రోజుల క్రితం అలాంటి సమస్య ఎదురైందని ఆమె చెప్పారు.

 
‘‘రక్త నమూనా సేకరించేందుకు ఓ రోగి ఇంటికి వెళ్తున్నా. ఓ సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి నన్ను ఆపారు. ఇంటి నుంచి ఎందుకు బయటకు వస్తున్నారని, అంత తొందరపాటు ఎందుకని ఆయన నన్ను ప్రశ్నించారు. మీకు గుండె పోటు వస్తే, నా అవసరం తెలుస్తుందని బదులు చెప్పా’’అని అపర్ణ అన్నారు.

 
ప్రాథమిక వైద్య సేవలు ఇప్పుడు పూర్తి సామర్థ్యంలో 25 శాతంతోనే పనిచేస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్య సంక్షోభం వస్తుందని సురేశ్ వజీరానీ అంటున్నారు. ‘‘కోవిడ్-19 బాధితుల్లో ఎక్కువ మంది వేరే రోగాలతో ఉన్నవాళ్లే. అందుకే ఇతర రోగాలున్నవారికి చికిత్సలు అందించడం చాలా ముఖ్యం. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే దేశం ఆరోగ్యంగా ఉండాలి’’ అని ఆయన అన్నారు.

 
కరోనాపై అన్ని దిక్కుల నుంచీ పోరాటం చేయాలని, కరోనా లేనివాళ్లు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందని అపర్ణ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘తెలంగాణలో 125 కరోనావైరస్ హాట్‌ స్పాట్లు, ఒక్క హైదరాబాద్‌లోనే 60’ : ప్రెస్ రివ్యూ