Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?

Advertiesment
hot water
, శనివారం, 11 ఏప్రియల్ 2020 (22:32 IST)
కరోనావైరస్ నుంచి రక్షించుకోవడానికి రక రకాల నకిలీ వైద్య సలహాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అలా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలుసుకోవడానికి 'బీబీసీ ఫ్యూచర్' ప్రయత్నించింది.

 
వాతావరణం చలిగా ఉన్నప్పుడు వేడి పానీయం తాగితే గొంతుకి హాయిగా ఉంటుంది. చిరాకుగా ఉన్న మనసుకి సాంత్వన లభిస్తుంది. ఇతరులకి దగ్గరైన భావన కలుగుతుంది. ఒక్కొక్కసారి వేడిగా ఉన్న వాతావరణం కూడా ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఒక కప్ కాఫీ గాని, టీ గాని తాగినంత మాత్రాన అవి కోవిడ్-19 బారిన పడకుండా మనల్ని రక్షించడానికి పని చేయవు.

 
వేడి నీళ్లు తాగితే కరోనావైరస్ రాదనే నకిలీ వైద్య సలహాలు సోషల్ మీడియాలోను, వ్యక్తిగత మెసేజింగ్ యాప్‌లలోను ప్రచారంలో ఉన్నాయి. యునిసెఫ్ ఈ ప్రచారంతో తమకి ఎటువంటి సంబంధం లేదని ఓ ప్రకటన చేసింది. వేడి పానీయాలు వైరస్ సోకకుండా కాపాడతాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవని కార్డిఫ్ యూనివర్సిటీలో రెస్పిరేటరీ డిసీజెస్ విభాగంలో పని చేస్తున్న రోన్ ఎకెల్స్ చెప్పారు.

 
జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారిపై వేడి పానీయాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనే అంశంపై ఆయన గతంలో పరిశోధన చేశారు. వేడి పానీయాలు జలుబు, దగ్గు ఉన్నప్పుడు, గొంతులో ఉన్న కఫాన్ని కరిగించి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయని అన్నారు. ఇది ప్రభావం లేని మందులా పని చేస్తుందని అన్నారు. ఇన్ఫెక్షన్‌కి కారణం అయ్యే వైరస్‌ని మాత్రం ఎటువంటి వేడి నీరూ తగ్గించదు. కోవిడ్-19కి కారణమయ్యే వైరస్ నుంచి వేడి నీరు ఎందుకు రక్షణ కల్పించదో 'బీబీసీ ఫ్యూచర్' పరిశీలించింది.

 
వేడి నీరు తాగడం వలన కానీ, పుక్కిలించడం వలన కానీ వైరస్ మాయమవదని పరిశీలనలో తేలింది. ప్రధానంగా వైరస్ సోకిన వారి తుమ్ము, దగ్గు నుంచి వచ్చే తుంపర్ల ద్వారా అది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇది ముందుగా శ్వాస కోశ వ్యవస్థ మీద దెబ్బ తీస్తుంది. ఈ వైరస్ శరీరంలో ఉండే ద్రవ పదార్థం సహాయంతో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది.

 
ఒక్క సారి వైరస్ శరీరంలోకి చేరిన తర్వాత అది మరింత విస్తృతమై, బలపడుతుంది. శరీరంలో మొదట ఇన్ఫెక్షన్‌కి గురైన కణాల నుంచి ఇతర కణాలకు వైరస్ సోకడానికి 30 గంటలు పడుతుందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఒక్కసారి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత అది ఏ ఉష్ణోగ్రతలనైనా తట్టుకోగలదు. మానవ శరీరంలో ఉండే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వైరస్ సజీవంగా ఉండటానికి, మరింత పెరగడానికి అనువుగా ఉంటుంది. వేడి నీరు తాగడం వలన ఊపిరితిత్తుల నాళాల్లోని ఉష్ణోగ్రత పెరిగే అవకాశం లేదు.

 
కరోనావైరస్ లాంటి వైరస్‌ని నాశనం చేయడానికి కనీసం 56 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు కానీ అవసరం. 60-65 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అవసరమని కూడా కొన్ని పరిశీలనలు పేర్కొన్నాయి. అయితే, అధిక ఉష్ణోగ్రతల్లో కోవిడ్-19 వైరస్ మనగలదా లేదా అనే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి అధ్యయనాలు ప్రచురితం అవ్వలేదు.

 
ఆహారంలో ఉండే బ్యాక్టీరియాని నాశనం చేయడానికి 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడిలో వండితే సరిపోతుంది కానీ, ఆ వేడికి మానవ శరీరంపై కాలిన గాయాలవుతాయి. ఎక్కువ వేడి నీటిలో స్నానం చేస్తుంటే బాగుంటుంది. కానీ వేడి నీరులో ఎక్కువ సమయం ఉన్నప్పటికీ అదేమీ వైరస్‌ని నాశనం చేయదు.

 
బయట ఉష్ణోగ్రత ఎంత ఉన్నప్పటికీ శరీర ఉష్ణోగ్రత మాత్రం 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ మాత్రమే ఉంటుంది. కానీ, శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి చేరితే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రత ఇంత కన్నా ఎక్కువ పెరిగితే మరణానికి కూడా దారి తీయవచ్చు. అలాగే, టీలో ఉండే కొన్ని లక్షణాలు కోవిడ్-19 బారి నుంచి కాపాడతాయనే మాటలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ, దీనికి కూడా శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు.

 
వేడి పానీయం ఉపశమనం కలిగిస్తుంది కానీ, కోవిడ్-19 బారి నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడం, ఏదైనా ఉపరితలాన్ని తాకిన వెంటనే చేతులు సబ్బు నీటితో శుభ్రపర్చుకోవడం, ఎప్పటికప్పుడు వస్తున్న వైద్య సలహాలు అనుసరించడం అవసరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానవత్వాన్ని చాటుకున్న తెలంగాణ బిడ్డలు, ఒకరు రూ. 10 లక్షలు, ఇంకొకరు రూ. 3 లక్షల అద్దె మాఫీ