Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోఫీ గ్రెగరీ ట్రూడో: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్యకు కరోనా, బ్రెజిల్ అధ్యక్షుడికి కోవిడ్-19 పరీక్షలు

Advertiesment
wife of Canadian Prime Minister Sophie Gregory Trudeau
, శుక్రవారం, 13 మార్చి 2020 (13:53 IST)
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ శరవేగంగా ఇతర దేశాలకూ పాకడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే మహమ్మారిగా ప్రకటించింది. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగరీ ట్రూడో‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణైంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 
ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో 14 రోజుల పాటు విడిగా ఉంచుతున్నారు(ఐసోలేషన్). సోఫీకి కరోనా సోకినట్లు నిర్ధరణ కావడంతో భర్త జస్టిన్ ట్రూడోను కూడా 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు. 

 
ఐసోలేషన్‌లో ప్రధాని దంపతులు
సోఫీ గ్రెగరీ ట్రూడో ప్రస్తుతం బాగానే ఉన్నారని ప్రధాని జస్టిన్ ట్రూడో కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానికి ప్రస్తుతం కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించనప్పటికీ ముందుజాగ్రత్తగా ఆయన్నూ 14 రోజులు విడిగా ఉంచుతున్నట్లు తెలిపారు.

 
ప్రస్తుతం ప్రధాని జస్టిన్ ట్రూడో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు కరోనా వైరస్ లక్షణాలేమీ లేవని, ఆయన తన విధులు ఎప్పటిలాగే నిర్వహిస్తారని.. శుక్రవారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం వెల్లడించింది. కెనడాలో ఇప్పటివరకు 103 మందికి కరోనా సోకినట్లు నిర్ధరించారు.

 
లండన్ నుంచి తిరిగొచ్చాక..
ప్రధాని భార్య సోఫీ ట్రూడో బుధవారం రాత్రి లండన్ నుంచి తిరిగివచ్చిన తరువాత స్వల్పంగా జ్వరం రావడంతో పాటు ఇతర కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయిన తరువాత ఆమె ''వైరస్ లక్షణాలతో అనారోగ్యంగా ఉన్నప్పటికీ త్వరలోనే కోలుకుంటానన్న నమ్మకం ఉంది'' అన్నారు.

 
తాజా పరిస్థితులు నేపథ్యంలో ప్రధాని ట్రూడో రానున్న రెండు రోజుల్లో తాను పాల్గొనాల్సిన సమావేశాలను వాయిదా వేశారు. కెనడాకు చెందిన మరో నాయకుడు, ఎన్డీపీ నేత జగ్‌మీత్ సింగ్ కూడా ఇంటికే పరిమితమవుతున్నారని.. తన ఆరోగ్యమూ బాగులేదని గురువారం తెలిపారు. అయితే, ఆయన అనారోగ్య లక్షణాలు కరోనా లక్షణాలను పోలి లేవని వైద్యులు చెబుతున్నారు.

 
బ్రెజిల్ అధ్యక్షుడికీ కరోనా పరీక్షలు
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్స్‌నారోకు కరోనావైరస్ పరీక్షలు జరిపారు. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. తన కమ్యూనికేషన్స్ సెక్రటరీకి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ కావడంతో ఇప్పుడు అధ్యక్షుడికీ పరీక్షలు జరిపారు. ఆయన కమ్యూనికేషన్ సెక్రటరీ అమెరికా పర్యటన నుంచి వచ్చిన తరువాత కరోనా ఉన్నట్లు తేలింది. కాగా బోల్స్‌నారో ఇంతకుముందు కరోనావైరస్‌ను ఒక భ్రమగా కొట్టిపారేశారు. ఇప్పుడు ఆయనే పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుర్తింపు లేనిచోట ఉండలేను.. కేఈ ప్రభాకర్ :: హామీ ఇస్తే వస్తానంటున్న శిద్ధా