Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?

Advertiesment
కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
, శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:25 IST)
ఏడేళ్లపాటు భర్తతో కలిసి జీవించిన అనంతరం 29ఏళ్ల సోఫీ టర్నర్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తికి ముందు విడిపోవడం గురించి తను ఎప్పుడూ ఆలోచించలేదని ఆమె వివరించారు. ''నాపై ఒత్తిడి చాలా పెరిగింది. చాలా ఎక్కువైంది. దీంతో కొన్ని రోజులు విడిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత దీన్ని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయించాం''అని ఇంగ్లండ్‌లోని బాలల హక్కుల కోసం పోరాడే సంస్థలో పనిచేస్తున్న సోఫీ చెప్పారు.

 
బ్రిటన్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి విడాకులు, బ్రేకప్‌ కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే జులై నుంచి అక్టోబరు మధ్య విడాకుల కేసులు 122 శాతం పెరిగినట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ న్యాయ సేవల సంస్థ స్టువార్ట్స్‌ తెలిపింది. రిలేషన్‌షిప్ నుంచి ఎలా బయటపడాలో సహాయం కోరే వారు బాగా పెరిగారని చారిటీ సిటిజన్స్ అడ్వైజ్ అనే సంస్థ కూడా వెల్లడించింది. విడాకుల అగ్రిమెంట్ల విక్రయాలు 34 శాతం పెరిగినట్లు అమెరికాలో కాంట్రాక్టులు తయారుచేసే ఓ ప్రముఖ వెబ్‌సైట్ తెలిపింది. వీరిలో ముఖ్యంగా గత ఐదు నెలల్లో వివాహం చేసుకున్నవారే 20 శాతం వరకు ఉన్నట్లు పేర్కొంది.

 
అన్నిచోట్లా ఇలానే..
చైనాలో కూడా పరిస్థితులు ఇలానే ఉన్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నడమ అత్యంత కఠినమైన లాక్‌డౌన్ ఇక్కడ అమలుచేశారు. కోవిడ్-19 వ్యాప్తికి కళ్లేం వేసేందుకు స్వచ్ఛంద నియమ నిబంధనలు విధించిన స్వీడన్‌లోనూ ఇదే పరిస్థితి. బంధాలపై కరోనావైరస్ వ్యాప్తి ప్రభావితం చూపుతుందనేది పాత విషయమే. అయితే, కరోనావైరస్ వ్యాప్తితో బ్రేకప్‌లు, విడాకులు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయో మానసిక వైద్యులు, విద్యావేత్తలు, న్యాయవాదులకు ఇప్పుడిప్పుడే పూర్తి అవగాహన వస్తోంది. అంతేకాదు 2021లో కూడా ఇదే స్థాయిలో బ్రేకప్‌లు కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు.

 
జంటలకు ఇదొక తుపాను లాంటిదని స్టువార్ట్స్ న్యాయ సేవల సంస్థలో భాగమైన కార్లీ కించ్ చెప్పారు. లాక్‌డౌన్‌లు, సామాజిక దూరం నిబంధనల నడుమ జంటలు ఎక్కువ సమయం కలిసి జీవించాల్సి వస్తోందని ఆమె చెప్పారు. ''చాలా కేసుల్లో లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ లాంటివి బ్రేకప్‌లకు ఉత్ప్రేరకంగా పనిచేశాయి. విడాకులకు మూల కారణాలు ఏ మాత్రం మారలేదు. ఈ విషయం నచ్చలేదు.. ఆ విషయం నచ్చలేదు.. అనే వాదనలు ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ, నేడు అవి చాలా పెద్దవి అయిపోయాయి. వాటి ఫలితమే ఈ బ్రేకప్‌లు''అని ఆమె అన్నారు.

 
''విడాకుల కేసులు పెరగడం నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు. కానీ 76 శాతం కొత్త కేసుల్లో మహిళలే విడాకుల కోసం ముందుకు వస్తున్నారు. గతేడాది ఇది 60 శాతంగా ఉండేది. చాలా జంటల్లో ఇంటిపని, పిల్లలను చూసుకోవడం లాంటివి మహిళలపైనే పడతాయి. దీని వల్లే మహిళలు ఎక్కువగా విడాకుల కోసం ముందుకు వస్తున్నారు''అని ఆమె వివరించారు.

 
కారణాలు ఏమిటి?
విడిపోవాలనే నిర్ణయాన్ని ఇద్దరమూ కలిసే తీసుకున్నామని టర్నర్ చెప్పారు. తమ మధ్య స్నేహ బంధం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. టర్నర్‌కు ఇదివరకు అనారోగ్య సమస్యలు ఉండటంతో కరోనావైరస్ వ్యాప్తి ముప్పు తగ్గించుకునేందుకు ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రపోయేవారు. వారి మధ్య మాట దూరం పెరిగింది. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ గొడవ పడటం జరిగేది. టర్నర్‌కు ఇంటిపని పెరగడంతో.. ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తనతో సమయాన్ని గడపడంలేదని తన భర్త విసుగుచెందేవారని టర్నర్ చెప్పారు.

 
కోవిడ్ వ్యాప్తి నడుమ కొన్ని జంటల్లో మానసిక సమస్యలు పెరగడంతో బ్రేకప్‌లు ఎక్కువయ్యాయి. ఎడిటర్‌గా పనిచేస్తున్న, అమ్‌స్టెర్‌డామ్‌కు చెందిన 43 ఏళ్ల మేరీకి మార్చిలో కరోనావైరస్ సోకింది. దీంతో ఆమె భర్త మానసిక సమస్యలు నియంత్రణ తప్పాయని ఆమె చెప్పారు. ''క్వారంటైన్ సమయంలో అన్ని పనులూ నేనే చేయాల్సి వచ్చేది. చాలా అలసిపోయేదాన్ని''అని ఆమె చెప్పారు.

 
జులై వరకు ఇక్కడ కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. నాలుగేళ్ల పిల్లాడిని చూసుకోవడం, పార్ట్‌టైమ్ జాబ్ చేయడం లాంటి పనులతో ఆమె నెట్టుకొచ్చేవారు. ''వీటన్నింటి కంటే నా రిలేషన్‌షిప్ వల్లే నాపై ఎక్కువ ఒత్తిడి కలిగేది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా నేను అలసిపోయేదాన్ని. అందుకే విడిపోదామని ఆయనకు చెప్పాను. ఇది నాకు చావు, బతుకుల సమస్యలా అనిపించేది''అని ఆమె చెప్పారు.

 
మంచి సంబంధాలుండే వారూ..
ఇదివరకు మంచి సంబంధాలుండే జంటలు కూడా ప్రస్తుతం బ్రేకప్‌ల బాట పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ''రోజువారీ జనజీవనాన్ని కరోనావైరస్ కుదేలు చేయడమే దీనంతటికీ కారణం''అని యూకే కౌన్సిల్ ఫర్ సైకోథెరపీ అధికార ప్రతినిధి రోనెన్ స్టిల్‌మ్యాన్ చెప్పారు.

 
''చాలా మంది తమకు ఏం జరుగుతుంది? తమ మధ్య ఏం జరుగుతోంది? లాంటి విషయాలను అతిగా ఆలోచించి ప్రెజర్ కుక్కర్‌లా మారారు. ఆ ఒత్తిడి తీవ్రమైనప్పుడు.. బ్రేకప్‌లు, విడాకులకు దారి తీస్తోంది''అని రోనెన్ వివరించారు. స్తాక్‌హోమ్‌లో ఉండే అమెరికన్ నోరా.. తన స్పానిష్ బాయ్‌ఫ్రెండ్‌తో ఇటీవల విడిపోయారు. ''మేం కోవిడ్ సోకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆయన బాస్కెట్ బాల్‌ను వదిలిపెట్టారు. నేను కూడా పర్వతారోహణను పక్కనపెట్టాను.

 
ఇంట్లో ఇంత సమయం గడపడంతో.. మా మధ్య గొడవలు చాలా పెద్దవి అయ్యాయి. ఆయన ఎక్కువగా మాట్లాడతారు. అందుకే ఆయనకు మాట్లాడటానికి ఎక్కువ మందికావాలి. మరోవైపు నాకు మాట్లాడటం ఇష్టముండదు. ఎక్కువ సమయం విడిగా ఉండటానికి ఇష్టపడతా''అని నోరా చెప్పారు. వీరిద్దరూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

 
నేడు యువ జంటలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో కరోనావైరస్ ఒకటని న్యాయవాది కించ్ చెప్పారు. అందుకే అమెరికా, కెనడాల్లో విడాకుల అప్లికేషన్లు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. ''30 ఏళ్ల క్రితం జంటలు చూసిన సమస్యల కంటే నేటి జంటలు ఎక్కువ సమస్యలను చవిచూస్తున్నాయి''అని ఆమె వివరించారు.

 
ఆర్థిక ఇబ్బందులూ...
మరోవైపు కోవిడ్ వ్యాప్తి నడుమ ఆదాయానికి గండిపడటంతో చాలా మంది బ్రేకప్‌ల దిశగా ముందుకు వెళ్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ''ఇదేమీ కొత్తకాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత.. ప్రతి ఆర్థిక సంక్షోభంలోనూ విడాకుల రేట్లు పెరిగాయి'' అని ఉత్తర స్వీడన్‌లోని ఉమేయో యూనివర్సిటీలో డెమొగ్రఫిక్ హిస్టరీపై పరిశోధన చేస్తున్న గ్లెన్ శాండ్‌స్ట్రామ్ చెప్పారు.

 
''ఆర్థికంగా మనం తీవ్రమైన సంక్షోభాన్ని చూస్తున్నాం కాబట్టి.. వివాహాల్లో ఒడిదుడుకులు పెరగడాన్ని అర్థం చేసుకోవచ్చు''అని గ్లెన్ అన్నారు. వివాహ బంధాల్లో ఒడిదొడులకు ఆర్థిక పరిస్థితీ ఒక కారణం. ''ఆదాయం తక్కువ కావడంతో ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవాలి? అనే విషయంపై వివాహ బంధాల్లో చాలా ఒడిదొడుకులు వస్తాయి. మానసికంగానూ చాలా ఒత్తిడి పెరుగుతుంది''అని గ్లెన్ వివరించారు.

 
''ఆదాయం తగ్గడంతో, ముఖ్యంగా మగవారి ఆత్మాభిమానంపై ప్రభావం పడుతోంది. ఎందుకంటే కుటుంబాన్ని ఎంత బాగా నడిపిస్తున్నాం అనే దానిపైనే వారి విలువ వుందని అనుకుంటారు. దీంతో కోపం, ఆందోళన, విసుగెత్తిపోవడం, గృహ హింస పెరుగుతాయి''అని గ్లెన్ చెప్పారు. మిగతా ఆర్థిక సంక్షోభాలతో పోలిస్తే.. ప్రస్తుత సంక్షోభం ఎక్కువగా అల్పాదాయ వర్గాలపై ప్రభావం చూపింది. మహిళలు, యువత, మైనారిటీలు ఎక్కువగా ఉండే ఆతిథ్య రంగం, పర్యటకం, రీటైల్ సెక్టార్‌లలో ఈ సంక్షోభం ఎక్కువగా కనిపించింది.

 
2021 మధ్యనాటికి వ్యాక్సీన్ వస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ, ఈ బ్రేకప్‌ల ట్రెండ్ ఇప్పుడప్పుడే తగ్గుతుందని నిపుణులు అనుకోవట్లేదు. కోవిడ్-19 ఆర్థిక ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుందని, దీంతో జంటల్లో ఆర్థిక సమస్యలు కొనసాగుతాయని గ్లెన్ వివరించారు. ''ఆర్థిక సంక్షోభం ఉద్యోగాలు తగ్గేస్థాయి వరకు వెళ్తే.. వివాహాలపై చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది''అని గ్లెన్ చెప్పారు. అయితే, దేశాల ఆర్థిక వ్యవస్థలు త్వరగా కోలుకుంటే, ఈ ప్రభావం అంతగా ఉండదని వివరించారు.

 
పరిస్థితి మెరుగుపడినా..
మరోవైపు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినా, విడాకుల కేసులు పెరుగుతాయని కించ్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా జంటలు సంబంధాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. కష్టాలను దృష్టిలో ఉంచుకొని విడిపోవట్లేదని చెప్పారు. ''నా అంచనా ప్రకారం.. ఇప్పుడు విడిపోవడానికి భయపడుతున్న జంటలు పరిస్థితులు సద్దుమణిగాక విడిపోతాయి''అని కించ్ అన్నారు.

 
భవిష్యత్ బ్రేకప్‌ల గురించి సమాచారం సేకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు కించ్ సంస్థ తెలిపింది. ''చాలా ప్రశ్నలతో వారు మా దగ్గరకు వస్తున్నారు. ముఖ్యంగా విడాకులు, బ్రేకప్‌లను కొంచెం వాయిదా వేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు విడిపోవడానికి చాలామంది ఇదివరకటి కంటే ఎక్కువ పరిశోధన చేస్తున్నారు''అని ఆమె చెప్పారు.

 
సోఫీ టర్నర్ విషయానికి వస్తే.. తల్లి, సోదరికి దగ్గరగా ఉండేందుకు సఫోక్‌లో ఆమె కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు. భర్త నుంచి దూరం కావడం బాధాకరమైనప్పటికీ, ఇదే మంచిదని ఆమె భావిస్తున్నారు. ''మేం ఒకే గదిలో ఉన్నప్పటికీ మాట్లాడుకునే వాళ్లంకాదు. కరోనావైరస్ మహమ్మారితో పరిస్థితులు మాకు అర్థమయ్యాయి. ఇప్పుడు మేం స్నేహితులగానే చాలా సంతోషంగా ఉన్నాం. చిన్నచిన్న విషయాలకు ఇప్పుడు మాకు కోపం రావడం లేదు''అని ఆమె అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని సవతి పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మొదటి భార్య: ప్రెస్‌రివ్యూ