Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరా చోప్రాపై ట్రోలింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగనుంది?

Advertiesment
మీరా చోప్రాపై ట్రోలింగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగనుంది?
, శుక్రవారం, 5 జూన్ 2020 (13:24 IST)
బాలీవుడ్ నటి మీరా చోప్రా తనని సోషల్ మీడియాలో వేధించిన జూనియర్ ఎన్‌టీఆర్ అభిమానులపై హైదరాబాద్ సైబర్ పోలీస్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మంగళవారం ట్విటర్లో నిర్వహించిన 'ఆస్క్ మీరా' లైవ్‌లో భాగంగా ఒక ట్విటర్ యూజర్ జూనియర్ ఎన్‌టీఆర్ గురించి ఒక్క పదంలో చెప్పమని అడిగారు. దానికి మీరా చోప్రా సమాధానం చెబుతూ "నాకు ఎన్‌టీఆర్ ఎవరో తెలియదు. నేను ఆయన అభిమానిని కాదు" అని సమాధానం ఇచ్చారు. తనకు మహేష్ బాబు అంటే ఇష్టమని చెప్పారు.

 
దీంతో ఆగ్రహించిన ఎన్‌టీఆర్ ఫ్యాన్ పేజీలకి సంబంధించిన కొందరు నెటిజెన్లు వారి ట్విటర్ ఖాతాల ద్వారా మీరా చోప్రాని గ్యాంగ్ రేప్ చేస్తామని, ఆమెపై యాసిడ్ దాడి చేస్తామని, చంపేస్తామని బెదిరించారు. ఈ ట్రోలింగ్ తర్వాత జూనియర్ ఎన్‌టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ ఆమె మరొక ట్వీట్ చేశారు.

 
“నేను కేవలం మహేష్ బాబు అభిమానిని అని చెప్పడం వలన మీ అభిమానులు నన్ను అసభ్య పదజాలంతో దూషిస్తారని తెలియదు. నా తల్లి తండ్రులని శపించడం ఎంత వరకు భావ్యం? ఇటువంటి అభిమానులతో మిమ్మల్ని మీరు ఒక విజయవంతమైన నటుడిగా భావిస్తారా? నా ట్వీట్‌ని మీరు నిర్లక్ష్యం చేయరని అనుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.

 
దీనిని జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా పరిగణించింది. మీరా చోప్రా పోలీస్ కేసు నమోదు చేసేందుకు సహాయ పడింది. ఈ ఫిర్యాదుపై నివేదిక అందించాలని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖ శర్మ తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ సుమతిని కోరారు. నటి మీరా చోప్రా వాన, గ్రీకు వీరుడు, బంగారం వంటి పలు తెలుగు చిత్రాలలో కూడా నటించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా ట్విటర్ ద్వారా ఆమెకి మద్దతు తెలిపారు.

 
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు?
ఈ వివాదం పై జూనియర్ ఎన్‌టీఆర్‌ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, టీం తారక్ ట్రస్ట్‌కి చైర్మన్, జూనియర్ ఎన్‌టీఆర్‌ అభిమాని యార్లగడ్డ మనోజ్ బీబీసీ తెలుగుతో ఈ అంశంపై మాట్లాడారు. “ఒక పేరున్న నటుడు కొన్ని లక్షల మంది అభిమానులను నియంత్రణలో పెట్టలేరు, ఎవరో కొంతమంది చేసిన పనికి అభిమానులందరినీ నిందించడం తప్పు’’ అన్నారు.

 
అయితే, ట్విటర్‌లో మహేష్ బాబు అభిమానులు జూనియర్ ఎన్‌టీఆర్‌పై చేసిన ట్రోలింగ్‌ని ఆమె లైక్ చేయడంతో ట్విటర్‌లో వాగ్వివాదం ముదిరిందని ఆయన అన్నారు. కొంత మంది అభిమానులు తీవ్రంగా ప్రవర్తించారని, అసభ్య పదజాలం వాడటం తప్పేనని ఒప్పుకున్నారు. అధికారిక ఫ్యాన్ పేజిలో ఉన్న వ్యక్తులెవరూ ఇలాంటి అసభ్య దూషణలకు పాల్పడరని చెబుతూ.. సోషల్ మీడియాలో ఎవరైనా ఎటువంటి తనిఖీలు లేకుండా అకౌంట్లు తెరవగలిగే అవకాశం ఉండటం వలన ఎవరు నిజమైన అభిమానులో, కాదో తెలుసుకోవడం కష్టమవుతుందని మనోజ్ అన్నారు.

 
సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని నియంత్రించడం కష్టమని చెబుతూ.. ఇలాంటి వేదికల్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం సాధారణమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జూనియర్ ఎన్‌టీఆర్‌ సాధారణంగా ఇటువంటి వాటికి స్పందించరని స్పష్టం చేశారు. ఆయన అభిమాన సంఘాలు చేస్తున్న సాంఘిక కార్యక్రమాలు కూడా ప్రజలు గమనించాలని కోరారు. అసలు ఆ అకౌంట్ ఎన్‌టీఆర్‌ అభిమానిదో కాదో చెప్పలేనప్పుడు.. ఆయా అకౌంట్ల నుంచి చేసే ట్రోలింగ్‌కి ఆయన ఎలా బాధ్యత వహించగలరని ప్రశ్నించారు మనోజ్.

 
ఇటువంటి కేసుల్లో ఏం జరుగుతుంది?
అయితే, ఇటువంటి కేసులలో సదరు సోషల్ మీడియా వేదిక సంబంధిత వ్యక్తుల వివరాలు ఇస్తే తప్ప కేసుని విచారించలేమని హైదరాబాద్ సైబర్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎం ప్రసాద్ చెప్పారు. ఏఏ సందర్భాల్లో ట్రోలింగ్ కేసులు నమోదు చేస్తారో ఆయన వివరిస్తూ.. సాధారణ ట్రోలింగ్ అయితే కేసు నమోదు చేయమని, కానీ ఈమె విషయంలో ట్రోలింగ్ చాలా అసభ్యకరమైన పదజాలం, బెదిరింపులతో కూడుకుని ఉండటం వలన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమెని అసభ్య పదజాలంతో దూషించిన 7-8 ట్విటర్ అకౌంట్లపై కేసును నమోదు చేసినట్లు తెలిపారు.

 
ఈ ట్వీట్లు చేసిన వారు ఇప్పటికే అకౌంట్లు తొలగించినట్లు చెప్పారు. సాధారణంగా ఫిర్యాదుదారు నివాసం ఉండే ప్రాంతంలోనే ఫిర్యాదుని నమోదు చేయవలసి ఉంటుందని, అయితే ఈ కేసులో ట్రోల్ చేసిన అకౌంట్లు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినవి కావడంతో కేసుని నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుని ముంబయి సైబర్ పోలీస్ విచారణకి బదిలీ చేస్తామని చెప్పారు. వారు విచారణ చేసి అరెస్ట్ చేయగలిగితే నిందితులకు ఐదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు.

 
ఏదైనా సోషల్ మీడియా యాజమాన్యం మద్దతు ఉంటేనే కేసుని పరిష్కరించగలమని ప్రసాద్ చెప్పారు. ఒక్క కేసులోనైనా ట్విటర్ లాంటి వేదికలు సమాచారం ఇవ్వగలిగితే ఇలా అసభ్యకర ట్రోలింగ్ చేసేవారిలో భయం కలిగించగలమని అభిప్రాయపడ్డారు. కొన్ని కోట్ల అకౌంట్లు ఉండటం వలన ట్విటర్ ట్రోలింగ్ చేసిన అకౌంట్లని తొలగించడానికి సహాయపడుతుంది తప్ప ఇప్పటి వరకు ట్రోలింగ్ విషయంలో వివరాలు వెల్లడించిన దాఖలాలు లేవని చెప్పారు. అయితే, ఆమెని ట్రోల్ చేసిన కొన్ని ట్విటర్ అకౌంట్లు యాక్టివ్ గానే ఉన్నట్లు బీబీసీ గమనించింది.

 
ట్రోలింగ్ అంటే ఏమిటి?
సోషల్ మీడియాలో "ట్రోలింగ్" అనే పదజాలాన్ని భారతీయ చట్టాలలో నిర్వచించలేదని, హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త శ్రీకాంత్ చింతల్ చెప్పారు. ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా నిర్దిష్ట చట్టాలులేనప్పటికీ, ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (ఐటి యాక్ట్) తో పాటు ఇండియన్ పీనల్ కోడ్ 1860 (ఐపీసీ)లోని అనేక నిబంధనలు ఉన్నాయి.

 
ఐపీసీలోని 354డి (మహిళలను వేధించడం), 499 (పరువు నష్టం), సెక్షన్ 503 & 507 మొదలైన నిబంధనలు ఆన్‌లైన్ వేధింపులకి (ట్రోలింగ్) సైతం వర్తిస్తాయని చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, సెక్షన్ 66 ఈ & 67 కింద ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు పిల్లల భద్రత కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. “మహిళల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలనడంలో ఎటువంటి సందేహం లేదు, అయితే ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను ఎదుర్కోవటానికి లింగ తటస్థ చట్టాలు చాలా అవసరం. చాలా ఆన్‌లైన్ ట్రోల్స్ గమనిస్తే, ట్రాన్స్ జెండర్స్ ని, మొత్తం ఎల్.జీ.బీ.టీ లపై అవమానకరమైన, అత్యంత హేయమైన వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు”.

 
గతంలో నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కూడా చాలా సార్లు ఆన్‌లైన్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అతని మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఆమె రెండవ వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించిన సందర్భంలో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇది తనను చాలా మనోవేదనకు గురి చేసిందని, ఇది భరించలేక ట్విట్టర్ అకౌంట్‌నే తొలగించానని గతంలో నాతో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ రేణూ దేశాయ్ చెప్పారు. “ఆన్‌లైన్ ట్రోలింగ్‌ను త్వరితగతిన పరిష్కరించడానికి పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని లేదా ప్రస్తుత చట్టాలలోనే ప్రత్యేక నిబంధనలను తీసుకువస్తే బాగుంటుంది” అని శ్రీకాంత్ అన్నారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లెక్కేంటి? కొత్తగా 127 కేసులు