Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలేషియా అడవుల్లో మాయమైన ఆ యూరప్ అమ్మాయి ఎక్కడ? ఏమైంది?

మలేషియా అడవుల్లో మాయమైన ఆ యూరప్ అమ్మాయి ఎక్కడ? ఏమైంది?
, గురువారం, 8 ఆగస్టు 2019 (18:47 IST)
మలేషియాకు విహారయాత్రకు వెళ్లిన ఒక యూరోపియన్ అమ్మాయి అక్కడి దట్టమైన అడవుల్లో అదృశ్యమైంది. ఆమె పేరు నోరా ఖ్వోరిన్. వయసు 15 సంవత్సరాలు. ఆమె కుటుంబం డసన్ రిసార్టులో బస చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా నోరా ఆమె పడకగదిలో కనిపించలేదు. గది కిటికీ తెరిచి ఉంది. అదృశ్యం కేసుగా పరిగణిస్తున్న మలేషియా పోలీసులు, నోరా ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

 
తమ కుమార్తె అపహరణకు గురై ఉండొచ్చని తల్లిదండ్రులు ఒక ప్రకటనలో చెప్పారు. నోరా ఎన్నడూ ఒంటరిగా ఎక్కడకీ వెళ్లదని, ఆమె తప్పిపోయిందనుకొనేందుకు అవకాశమే లేదని తెలిపారు. ఉత్తర ఐర్లాండ్, ఫ్రాన్స్‌లకు చెందిన నోరా తల్లిదండ్రులు దాదాపు 20 ఏళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. రెండు వారాల పర్యటన కోసం ఈ నెల 3న నోరా కుటుంబం మలేషియాలోని సెరెంబన్ సమీపాన ఉన్న అటవీ ప్రాంతంలోని రిసార్టుకు వచ్చింది. ఇది మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు దాదాపు 63 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 
కూతురు కనిపించడం లేదని ఈ నెల 4న స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమె తండ్రి గుర్తించారు. 15 ఏళ్ల తమ కుమార్తె ఇదే వయసున్న ఇతర టీనేజర్ల మాదిరి కాదని కుటుంబం తెలిపింది. అంతకన్నా తక్కువ వయసున్న బాలికలా కనిపిస్తుందని, తన పనులు తాను చక్కబెట్టుకోలేదని, జరిగేవాటిని అర్థం చేసుకోలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేశారు.

 
ఈ రిసార్టులో గరిష్ఠంగా 20 మంది ఉండొచ్చు.
రిసార్టుకు చుట్టుపక్కలున్న అటవీ ప్రాంతాల్లోనూ, దగ్గర్లోని నది వెంబడి కూడా పోలీసులు, అగ్నిమాపక విభాగం, ఇతర విభాగాల సిబ్బంది గాలింపు జరుపుతున్నారు. గ్రామస్థులనూ ప్రశ్నిస్తున్నారు. అన్వేషణలో హెలికాప్టర్లు కూడా వాడుతున్నారు. దట్టమైన ఈ అటవీ ప్రాంతంపై స్థానిక 'ఒరంగ్ అస్లీ' ప్రజలకు బాగా అవగాహన ఉంటుంది. గాలింపు బృందాలు వీరి సహాయం తీసుకొంటున్నాయి. దాదాపు 180 మంది గాలింపులో పాల్గొంటున్నారు.

 
నోరా పాస్‌పోర్టు, ఇతర వస్తువులు కుటుంబ సభ్యుల వద్దే ఉన్నాయని పోలీసు అధికారి చే జకారియా ఓథ్‌మాన్ చెప్పారు. రిసార్టు వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలు కొంత పరిధి వరకే పనిచేస్తాయి. నోరా తప్పిపోయి ఉంటుందని, ఎంతో దూరం వెళ్లి ఉండదని పోలీసులు భావిస్తున్నారని బీబీసీ ఆగ్నేయాసియా ప్రతినిధి జొనాథన్ హెడ్ తెలిపారు.

 
ఈ అటవీ ప్రాంతంలో ఎలా వెళ్లాలో కొత్తవాళ్లకు తెలియదని, అందువల్ల నోరా ఆచూకీ గురించి ఆందోళన కలుగుతోందని గాలింపులో పాల్గొంటున్న గ్రామస్థుడు బాలి అనక్ అకావు చెప్పారు. నోరా అదృశ్యం రిసార్టు యాజమాన్యానికి అంతుచిక్కడం లేదని అధికార ప్రతినిధి హానిమ్ బమధాజ్ తెలిపారు. తమ రిసార్టు పదేళ్లుగా నడుస్తోందని, ఎన్నడూ దొంగతనం కూడా జరగలేదని ఆమె చెప్పారు.

 
తితివాంగ్సా పర్వతాలకు దగ్గర్లో, నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బెరంబన్ ఫారెస్ట్ రిజర్వ్‌ను ఆనుకొని 12 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల తోటల మధ్య తమ రిసార్టు ఉందని రిసార్టు వెబ్‌సైబ్ చెబుతోంది. ఇందులో మొత్తం ఏడు నివాసాల్లో కలిపి గరిష్ఠంగా 20 మంది ఉండొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త ఆర్మీ ఉద్యోగం, భార్య ఆటో డ్రైవరుతో వివాహేతర సంబంధం, బెడిసి కొట్టడంతో పొడిచి...