Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌ కళ్యాణ్‌ జీతం ఎంత?

pawan kalyan

బిబిసి

, శనివారం, 8 జూన్ 2024 (22:50 IST)
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పవన్‌ కల్యాణ్‌. ఎన్నికల్లో విజయం తర్వాత జనసేన నాయకులతో సమావేశమైన పవన్‌ కల్యాణ్, ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటానని చెప్పారు. అప్పుడే ప్రజలకు తనపై అజమాయిషీ, తనకు బాధ్యత ఉంటాయన్నారు. తాను రూపాయి జీతం తీసుకుంటానని చెప్పడం లేదని అన్నారు.
 
ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలకు జీతం ఎంత వస్తుంది? ఇతర భత్యాల కింద ఎంత చెల్లిస్తారు? జీతంతో పాటు ఎమ్మెల్యేలకు ఇచ్చేవి ఏంటి? ఏపీ ఎమ్మెల్యేలకు ఎంత జీతం ఇస్తారో తెలుసుకునే ముందు, ఎమ్మెల్యేలకు ఏ ఏ సదుపాయాలు, భత్యాలు ఉంటాయో తెలుసుకుందాం.
 
నెలవారీ జీతం: ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. ప్రజా సేవలో ఇది వారికి లభించే ప్రాథమిక ఆదాయం.
నియోజక వర్గ భత్యం: జీతంతో పాటు ప్రతీ ఎమ్మెల్యేకు నియోజకవర్గ భత్యం ఉంటుంది. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పర్యటన ఖర్చుల కోసం దీన్ని ఇస్తున్నారు.
 
ఆకస్మిక భత్యం: ఎమ్మెల్యే పదవీకాలంలో ఎదురయ్యే ఊహించని ఖర్చుల కోసం ఇచ్చే భత్యం ఇది. ఈ భత్యం కింద ఎంత ఇస్తారనేది రాష్ట్రాన్ని బట్టి మారుతోంది.
 
సెక్రటేరియల్ అలవెన్స్: ఎమ్మెల్యేల ఆఫీసు నిర్వహణ, శాసన విధుల్లో వారికి సహాయం చేసే సిబ్బందిని నియమించుకుని వారికి జీతం ఇవ్వడానికి ఇచ్చే అలవెన్స్ ఇది.
 
రవాణా భత్యం: ఎమ్మెల్యేలకు వారి ప్రయాణ ఖర్చులను రవాణా భత్యం ద్వారా తిరిగి చెల్లిస్తారు. దీని కింద 200 లీటర్ల పెట్రోల్‌కు అయ్యే ఖర్చును అప్పటి ధరలను బట్టి చెల్లిస్తారు.
 
టెలిఫోన్ సౌకర్యాలు: ఎమ్మెల్యేలకు అధికారిక అవసరాల కోసం టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండే ఫోనుకు రూ.3వేలు, నియోజకవర్గంలోని నివాసంలో ఏర్పాటు చేసుకున్న ఫోన్ కోసం 2,500 చెల్లిస్తారు.
 
సిట్టింగ్ అలవెన్సులు/రోజువారీ అలవెన్సులు: అసెంబ్లీ సమావేశాలు, హౌస్ కమిటీ సమావేశాల సమయంలో, ఎమ్మెల్యేలకు సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారు.
 
వైద్య సదుపాయాలు: ఎమ్మెల్యేలు వారి కుటుంబాలు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, ఇతర గుర్తింపు పొందిన ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం, చికిత్స చేయించుకోవచ్చు.
 
కుటుంబ పింఛను: ఎమ్మెల్యే మరణించిన సందర్భంలో, వారి భార్య/భర్తకు పెన్షన్‌ ఇస్తారు. ఇవి కాకుండా రాష్ట్రాన్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక సదుపాయాలు, అలవెన్సులు చెల్లిస్తున్నారు.
 
దేశంలో ఎమ్మెల్యేలందరికీ ఒకే రకమైన జీతభత్యాలు ఉంటాయా?
శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల జీత భత్యాల విషయంలో నిర్ధిష్ట పరిమితులు లేవు. ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను బట్టి వాటిని నిర్ణయిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎమ్మెల్యేలకు వేతనాలు, ఇతర అలవెన్సులు ఇస్తారు. శాసన సభ్యులకు ప్రతి నెల చెల్లించే నిర్ధిష్ట వేతనంతో పాటుగా పలు అలవెన్సులు అందుతాయి. ఇంతకుముందు చెప్పినట్టు నియోజకవర్గ అలవెన్సు, కంటింజెన్సీ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, సెక్రటేరియల్‌ అలవెన్స్ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభకు హాజరైన రోజుకి సిట్టింగ్ అలవెన్స్ ఇస్తారు.
 
ఎమ్మెల్యేలు వాహనాలు, కంప్యూటర్, ఫర్నీచర్ వంటివి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ సదుపాయం కూడా లభిస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటాయి. వసతి అందుబాటులో లేకపోతే హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఇక మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్, ట్రావెల్, మెడికల్ సదుపాయం ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్ అందుతుంది.
 
తెలంగాణ టాప్‌
భారత్‌లో చట్టసభ సభ్యులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు 2 లక్షల 50 వేల రూపాయల వరకు జీతభత్యాల కింద వస్తాయి. గతంలో వారికి ఇంత జీతభత్యాలు లేవు. తెలంగాణ చట్టసభ సభ్యుల జీతభత్యాలను 2016లో 163 శాతం పెంచారు. అప్పుడున్న రూ. 12వేల జీతాన్ని రూ. 20 వేలకు పెంచారు. నియోజకవర్గ అలవెన్స్‌ను రూ. 82 వేల నుంచి 2 లక్షల 3 వేల రూపాయలకు పెంచారు.
తెలంగాణ తర్వాత దిల్లీ, మధ్యప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్కువ జీతభత్యాలు ఉన్నాయి. అక్కడ వారికి నెలకు సుమారు 2 లక్షల 10 వేల రూపాయల చొప్పున ఇస్తున్నారు. మహారాష్ట్ర, బిహార్‌లో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు దాదాపు రూ. 1.65 లక్షలు జీతభత్యాలుగా ఇస్తున్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఎంత?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వేతనాలు, భత్యాల కింద ఒక్కో ఎమ్మెల్యేకు ఒక లక్ష 25 వేల రూపాయల చొప్పున అందుతోంది. దాంతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకపోవడంతో మరో రూ. 50 వేలు హెచ్ఆర్ఏగా చెల్లిస్తున్నారు. దీంతో పాటు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు అందిస్తున్నారు. ఎమ్మెల్యేలకు వారి అవసరాలకు అనుగుణంగా 1 + 1 లేదా 2+2 చొప్పున గన్‌మెన్‌లతో భద్రత కల్పిస్తున్నారు.
 
వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్ సదుపాయంతో పాటు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందించిన దాఖలాలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలలో ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లతో పాటుగా ప్రభుత్వ చీఫ్ విప్, విప్, పీఏసీ చైర్మన్, ప్రధాన ప్రతిపక్ష నాయకులు వంటి పదవులు దక్కిన వారందరికీ ఎమ్మెల్యేల కంటే జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి.
 
రూపాయి జీతం...
ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను రూపాయి జీతం మాత్రమే తీసుకుంటానని గతంలో ప్రకటించారు. అంతకుముందు ఎన్టీఆర్ కూడా అదే రీతిలో రూపాయి జీతం తీసుకున్నారు. ప్రభుత్వ ధనం ప్రజాసేవకు వెచ్చించాలనే ఆశయంతో తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు,
 
అయితే జీతం పేరుతో రూపాయి తీసుకున్నప్పటికీ ఇతర రూపాల్లో ఆడంబరాలకు ప్రజాధనం వృధా చేసినట్టు ఆయా నేతల మీద ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా జనసేన తరుపున పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు. వేతనం, ఇతర భత్యాల కింద ఆయనకు నెలకు సుమారు ఒక లక్ష 75 వేల రూపాయలు వస్తాయి. 
 
జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నట్టు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరితే ఆయనకు అదనపు సదుపాయాలు దక్కుతాయి. ఆయన ఎలాంటి బాధ్యతలు స్వీకరిస్తారన్న దానిని బట్టి జీత, భత్యాలు అందుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అన్నీ కలిపి ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 1.75 వేలు చొప్పున లభిస్తోంది. 2016 తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతన, భత్యాల సవరణ జరగలేదని ఏపీ శాసన మండలి సభ్యుడు వి చిరంజీవిరావు చెప్పారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా శాసనసభ, మండలి సభ్యుల జీత భత్యాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ యుజి 2024లో టాప్ స్కోరర్‌గా నిలిచిన నెల్లూరుకు చెందిన ఆకాష్ ఎడ్యుకేషనల్ విద్యార్థి