చెత్త పన్ను. ఈ పన్ను చెల్లించకపోతే ఎక్కడెక్కడో వున్న చెత్తనంతా ఇంటి ముందు పోసి నానా ఇబ్బందులకు గురిచేసేవారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులకు గురి చేసిన చెత్త పన్ను వసూలును బంద్ చేస్తున్నట్లు అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. కూటమి ప్రభుత్వం రాగానే చెత్త పన్నును నిలిపివేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇకపై చెత్త పన్ను వసూళ్లను నిలిపివేయాలని అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది.
చెత్తతో ఏటా రూ. 200 కోట్ల వడ్డన
ప్రజల నుంచి నెలకి రూ. 50 నుంచి రూ. 150 వరకూ ఒక్కో ఇంటి నుంచి వసూలు చేస్తున్న చెత్త పన్ను ద్వారా ప్రభుత్వానికి రూ. 200 కోట్లు సమకూరేది. ఈ చెత్త పన్నును 2021లో వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ పన్ను విధించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎంతమాత్రం వెనుకడుగు వేయలేదు. చెత్త పన్నును బలవంతంగా ప్రజల నుంచి వసూలు చేసింది. ఇదిలావుండగానే ఆస్తి పన్నును కూడా ఏటా 15 శాతం చొప్పున పెంచుతూ ప్రజల నడ్డి విరిచారు. సొంత ఇల్లు వున్న యజమానులు ఏటా దాదాపు రూ. 3500 కట్టాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఈ ఆస్తి పన్ను ఆరు నెలలకి కేవలం రూ. 400గా వుంది. ఏడాదికి చూసుకున్న రూ. 1000 దాటదు. అది కూడా మెట్రోపాలిటిన్ సిటీ అయిన చెన్నైలోనే ఇలా వుంటే మన రాష్ట్రంలోని విజయవాడ లాంటి నగరంలో ఇది మూడింతలు ఎక్కువగా వున్నది. ఇంకా కరెంట్ బిల్లులు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలు పెంచేసింది.
ఒక ఇంట్లో ఒక ఫ్యాను, ఏసీ వాడితే చాలు... బిల్లు నెలకి రూ. 1000 దాటుతుంది. ఇక వాషింగ్ మెషీన్ వంటివి వాడితే రూ. 2000 దాటిపోతుంది. ఐతే పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఈ కరెంటు బిల్లు రెండు నెలలకి రూ. 1000 దరిదాపుల్లో వుంటుంది. ఇలా ఏ ప్రకారం చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలపై పన్నులు, విద్యుత్ చార్జీల వడ్డనతో బెంబేలెత్తిపోయారు. వైసిపి ఓటమికి ఇవి కూడా కారణం అనే వాదన వుంది.