మాంద్యం అంటే నెమ్మదించడం లేదా దీర్ఘ కాలం పాటు అదే స్థితిలో ఉండిపోవడం. ఆర్థిక పరమైన విషయాల్లో దీన్నే ఆర్థిక మందగమనంగా చెబుతారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘ కాలంపాటు మందగనమనంలో ఉన్నా లేదా వృద్ధి రేటు పడిపోయినా ఆర్థిక మాంద్యంగా చెబుతారు. భారత్‌లో ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కొనసాగుతోందన్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఖండించారు. అసలు అలాంటి సందేహాలే అవసరంలేదని ఆమె అన్నారు. అయితే, ఒక దేశం ఎప్పుడు ఆర్థిక మాంద్యంలో ఉందని ప్రకటిస్తారనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఎప్పుడు ఆర్థిక మాంద్యం ప్రకటిస్తారు?
వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గుతూ వస్తే, ఆర్థిక మాంద్యంగా ప్రకటిస్తారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే.. ఆర్థిక వ్యవస్థ పెరగడానికి బదులుగా కుంచించుకుపోవడాన్ని ఆర్థిక మాంద్యం అంటారు. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్నప్పుడు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతాయి. ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. మరోవైపు స్టాక్ మార్కెట్‌పైనా ఈ ప్రభావం కనిపిస్తుంది. జీడీపీ ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందో లేదా త్వరలో మాంద్యం చుట్టుముట్టే ముప్పుందో చెప్పొచ్చు.
ఆర్థిక మాంద్యం, స్టాగ్‌ఫ్లేషన్‌ల మధ్య తేడా ఏమిటి?
ఆర్థిక మాంద్యంతోపాటు స్టాగ్‌ఫ్లేషన్ అనే పదం కూడా తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ ఎదుగుబొదుగు లేకుండా అలానే ఉండిపోవడాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు. ఆర్థిక మాంద్యంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతే.. స్టాగ్‌ఫ్లేషన్‌లో తగ్గడం లేదా పెరగడం రెండూ ఉండవు. అంటే ఇక్కడ వృద్ధి రేటు సున్నాగా ఉంటుంది.
ఆర్థిక మాంద్యానికి, ద్రవ్యోల్బణానికి సంబంధముందా?
ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలతోపాటు దాదాపు అన్ని దేశాల్లోనూ ప్రజలను ద్రవ్యోల్బణం ఇబ్బంది పెడుతోంది. కరోనావైరస్ వ్యాప్తి నడుమ వస్తువుల సరఫరా గొలుసు దెబ్బతింది. ఆ తర్వాత రష్యా-యుక్రెయిన్ యుద్ధం పరిస్థితిని మరింత తీవ్రంచేసింది. మళ్లీ ఇప్పుడు చైనాలోని పెద్దపెద్ద నగరాలు వరుసగా లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నాయి. దీంతో మళ్లీ ఆర్థిక మాంద్యం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణ రేటుకు కళ్లెం వేసేందుకు ప్రపంచ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. భారత్ కూడా ఇదే దిశగా చర్యలు తీసుకుంది. అయితే, వడ్డీ రేట్ల పెంపుతో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
1970లలో ఇలానే అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. దీంతో ధరలకు కళ్లెం వేసేందుకు ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఆర్థిక మాంద్యం తలెత్తిందిఅని ఫోర్బ్స్‌లో ఒక కథనం ప్రచురించారు. మరోవైపు దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, ప్రొఫెసర్ అరుణ్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వడ్డీ రేట్లను పెంచడంతో మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గడంతో వృద్ధి రేటు కూడా పడిపోతుంది. ఫలితంగా ఆర్థిక మాంద్యం వస్తుందిఅని ఆయన అన్నారు.
మరోవైపు ద్రవ్యోల్బణం విపరీతంగా పడిపోయినా ఆర్థిక మాంద్యం వస్తుంది. ద్రవ్యోల్బణం పెరగడం కంటే విపరీతంగా పడిపోవడం వల్లే ఎక్కువ నష్టం జరుగుతుంది. ద్రవ్యోల్బణం పడిపోవడం అంటే, ధరలు పడిపోవడం. ధరలు పడిపోయినప్పుడు ప్రజల జీతాలు తగ్గుతాయి. ఫలితంగా వస్తువుల ధరలు మరింత పడిపోతాయి. ధరలు పడిపోయినప్పుడు సామాన్యులు, వ్యాపారవేత్తలు డబ్బులను ఖర్చుపెట్టడం తగ్గిస్తారు. దీంతో వృద్ధి బలహీన పడుతుంది. ఇదే ఆర్థిక మాంద్యంగా మారుతుంది. 1990ల్లో జపాన్‌లో ఇలానే ఆర్థిక మాంద్యం వచ్చింది.
భారత్‌లో ఎప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చింది?
రిజర్వు బ్యాంకు డేటాను పరిశీలిస్తే, స్వాతంత్ర్యం తర్వాత భారత్‌లో నాలుగుసార్లు ఆర్థిక మాంద్యం వచ్చింది. 1958, 1966, 1973, 1980లలో ఆర్థిక మాంద్యం వచ్చింది. 1957-58లో తొలిసారి స్వతంత్ర భారత దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చింది. అప్పట్లో వృద్ధి రేటు మైనస్‌లోకి వెళ్లిపోయింది. ఆ ఏడాది వృద్ధి రేటు మైనస్ 1.2గా నమోదైంది. దిగుమతి బిల్లులు భారీగా పెరగడమే తొలి ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణం. 1955 నుంచి 1957 మధ్య దిగుమతి బిల్లులు 50 శాతానికిపైగా పెరిగాయి.
1965-66లో తీవ్రమైన కరవు పరిస్థితుల వల్ల భారత్ వృద్ధి రేటు మరోసారి నెగిటివ్‌లోకి వెళ్లింది. ఆ ఏడాది ఏకంగా మైనస్ 3.66 శాతంగా వృద్ధి రేటు నమోదైంది. ఆ తర్వాత 1972-73లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు నిలిచిన దేశాలకు ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ కంట్రీస్ (ఓఏపీఈసీ) చమురు దిగుమతులను నిలిపివేసింది. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు 400 శాతం వరకు పెరిగాయి. ఆ ఏడాది భారత్‌లోనూ మైనస్ 0.3 శాతంగా వృద్ధి రేటు నమోదైంది.
1980లో ఇరాన్‌లో విప్లవం వల్ల ప్రపంచంలోని చాలా దేశాలకు చమురు దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయ విపణిలో మళ్లీ చమురు ధరలు పెరిగాయి. భారత్‌లోనూ చమురు దిగుమతుల బిల్లు రెట్టింపు అయ్యింది. దీంతో మైనస్ 5.2 శాతంగా వృద్ధి రేటు నమోదైంది. 2020లో ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనావైరస్ కేసులు పెరిగినప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థలు మందగమనంలోకి వెళ్లిపోయాయి.
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
ఆర్థిక మాంద్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ స్వామి స్పందించారు.
నిజమే భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న సందేహమే అక్కర్లేదు. ఆర్థిక మంత్రి చెప్పినది నిజమే. ఎందుకంటే గత ఏడాదే భారత్ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోయిందిఅని ఆయన వ్యాఖ్యానించారు. సుబ్రమణియన్ స్వామి వ్యాఖ్యలను ఎలా చూడాలి? అనే ప్రశ్నపై జేఎన్‌యూ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆయన మాటలను పూర్తిగా తప్పుపట్టడానికి వీల్లేదు. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే స్టాగ్‌ఫ్లేషన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తోందిఅని చెప్పారు.
నిర్మలా సీతారామన్ చెబుతున్న గణాంకాలన్నీ సంఘటిత రంగానివే. ఆమె అసంఘటిత రంగం గణాంకాలను చెప్పడం లేదు. సంఘటిత రంగం వృద్ధి సాధిస్తున్న మాట వాస్తవమే. కానీ, అసంఘటిత రంగం పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. ఈ ప్రభావం త్వరలో సంఘటిత రంగంపైనా కనిపిస్తుందిఅని అరుణ్ కుమార్ చెప్పారు. ముందు అసంఘటిత రంగంలో వృద్ధి ఎంతుందో ప్రభుత్వం వెల్లడించాలి. ఆ తర్వాతే మనం ఒక అవగాహనకు రావాలి. కేవలం సంఘటిత రంగం గణాంకాలు చూసి ఆర్థిక మాంద్యం వచ్చింది లేనిదీ అంచనాకు రాకూడదుఅని ఆయన అన్నారు.
ప్రపంచంలోని చాలా దేశాల్లో వడ్డీ రేట్లు పెంచుతున్నారు. దీంతో డిమాండ్ తగ్గిపోయే అవకాశముందిఅని అరుణ్ కుమార్ చెప్పారు. మరోవైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం వల్ల కూడా వస్తువుల సరఫరా గొలుసు తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఇప్పట్లో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలేమీ కనిపించడం లేదు. ఇలా ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతే, దేశంలోని అసంఘటిత రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీంతో వృద్ధి మందగిస్తుందిఅని ఆయన వివరించారు.
ఆర్థిక మాంద్యం నుంచి బయటకు రావడం ఎలా?
ఒక దేశం ఆర్థిక మందగమనం నుంచి బయటకు రావాలంటే, మొదట పెట్టుబడులను పెంచాలి. పెట్టుబడులు పెరిగితే, ఉద్యోగ కల్పన పెరుగుతుంది. దీంతో ప్రజల చేతుల్లోకి డబ్బులు వస్తాయి. వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందిఅని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ వివరించారు. భారత్‌లో నిరుద్యోగం చాలా పెద్ద సమస్య. గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకాలతో ఈ సమస్యను పరిష్కరించొచ్చు. అదే సమయంలో జీఎస్‌టీ లాంటి పరోక్ష పన్నులను కూడా తగ్గించాల్సి ఉంటుంది. వస్తువులపై జీఎస్‌టీ తగ్గించినప్పుడు.. ప్రజల చేతుల్లో మిగిలే డబ్బు పెరుగుతుంది. దీంతో మార్కెట్‌లోకి మరింత డబ్బు వస్తుందిఅని అరుణ్ కుమార్ చెప్పారు.
అందుకే జీఎస్‌టీ సంస్కరణలపై ప్రభుత్వం ఆలోచించాలి. జీఎస్‌టీ వల్ల అసంఘటిత రంగంపై చాలా ప్రభావం పడుతోంది. దీనితోపాటు కార్పొరేట్ రంగంపై ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించాలి. ఒక్కసారిగా పెరిగే కంపెనీల లాభాలపై విధించే ట్యాక్స్‌ను విండ్‌ఫాల్ ట్యాక్స్ అంటారుఅని ఆయన వివరించారు. పెద్దపెద్ద కంపెనీలపై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధిస్తే, ప్రజలపై పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించొచ్చు. దీంతో సామాన్య ప్రజల చేతిలో నాలుగు డబ్బులు మిగులుతాయి. వీటిని మళ్లీ మార్కెట్లోనే వారు ఖర్చు చేస్తారు. దీంతో వృద్ధి పెరుగుతుందిఅని ఆయన తెలిపారు.