Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్రాస్‌పల్లి శ్మశానంలో సెప్టెంబర్ 18 రాత్రి ఏం జరిగింది?

అద్రాస్‌పల్లి శ్మశానంలో సెప్టెంబర్ 18 రాత్రి ఏం జరిగింది?
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (17:41 IST)
హైదరాబాద్ శివార్లలో, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో అద్రాస్ పల్లి గ్రామం ఉంది. ఊళ్లో పంచాయతీ కార్యాలయం ఎదురుగా అమ్మవారి గుడి, పక్కనే చిన్న మసీదు, ముందుకెళ్తే గాంధీ విగ్రహం ఉన్నాయి. అక్కడికి కొంత దూరంలో కొన్ని పొలాలు. వాటి మధ్యలో ఒక శ్మశానం. అక్కడ కొన్ని సమాధులు, కొన్ని మృతదేహాలు కాల్చిన ఆనవాళ్లు. శ్మశానం మొదట్లో ఒక చోట కాష్టం ఆరింది. బూడిద మిగిలింది. ఆ బూడిద ఒక్క శరీరానిది కాదు. అవును... అక్కడి చితిలో ఇద్దర్ని కాల్చారు. ఒకరిది మరణం, మరొకరిది 'హత్య'.

 
సెప్టెంబరు 18 బుధవారం రాత్రి. అద్రాస్ పల్లికి చెందిన ఆటోడ్రైవర్ బోయిని ఆంజనేయులు ఇంటికి చేరుకున్నారు. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో ఆటో ఉంచి లోపలకు వెళ్లారు. తర్వాత ఇంటి బయట ఉన్న తన పెద్దన్న గణేశ్ చెప్పులు వేసుకుని ఆయన పొలాల్లోకి బయల్దేరారు. రోజూ రాత్రి ఇంటికి చేరుకున్న తర్వాత బహిర్భూమికి వెళ్లడం ఆంజనేయులుకు అలవాటు. అలా వెళ్లిన ఆయన గంటో రెండు గంటల్లోనో తిరిగి రావాలి. కానీ, మళ్లీ ఇంటికి రాలేదు.

 
పంచాయతీ కార్యాలయం నుంచి లోపలకు వెళ్తే అంబేడ్కర్ విగ్రహం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న వీధిలో గ్యార లక్ష్మి నివాసం ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సెప్టెంబరు 17 మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. మరుసటి రోజు 18వ తేదీ బుధవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 18న రాత్రి లక్ష్మి అంత్యక్రియలు ముగిశాయి.

 
శ్మశానంలో గొడవ అవుతోందన్న సమాచారం అందుకున్న కొందరు అక్కడికి వెళ్లారు. పోలీసులూ వచ్చారు. వారంతా వచ్చేసరికి అక్కడ లక్ష్మిని కాల్చిన చితిలో ఒక శరీరం కాలుతోంది. అది ఆంజనేయులుది. ముందు కాలిన మృతదేహం కాళ్ల వైపు రెండో శరీరం తల ఉన్నట్టుగా ఉంది. ఆ శరీరం బోర్లా ఉంది. మెడ, వీపు భాగం మినహా అంతా కాలిపోయింది. పోలీసులు ఆ మిగిలిన భాగాన్ని తీసి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించారు. పరీక్షల తర్వాత తిరిగి వచ్చిన సగం కాలిన, మిగిలిన శరీర భాగాలకు ఆంజనేయులు పొలం దగ్గరే మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు. సెప్టెంబరు 19 గురువారం ఉదయం. ఆ బోర్లా పడ్డ మనిషిని హత్య చేశారన్న అభియోగంతో లక్ష్మి బంధువులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా జరిగింది ఒకే ఒక్క అనుమానంపై- అదే చేతబడి.

 
పోలీసుల కథనం ఏమిటంటే- సెప్టెంబరు 18 రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆంజనేయులు బహిర్భూమికి వెళ్లారు. లక్ష్మి బంధువులు, ఆమె చితిపైనే ఆంజనేయుల్ని కూడా కాలుస్తున్నారని 8.30కి ఊళ్లో ప్రచారం జరిగింది. ఆంజనేయులు పెద్దన్న గణేశ్, ఇంకొందరు శ్మశానానికి వెళ్లారు. సగం కాలిన శరీరాన్ని చితి నుంచి బయటకు లాగారు. తమ్ముడు ఆంజనేయులు నంబరుకు ఫోన్ చేస్తే లైన్ కలవలేదు. ఇంటి నుంచి ఆయన వేసుకెళ్లిన చెప్పులు అక్కడ పడి ఉన్నాయి. వాటిని చూసి అన్న గుర్తుపట్టారు. లక్ష్మికి ఆంజనేయులు మంత్రాలు వేశారని (చేతబడి చేశారని) ఆమె బంధువులు అనుమానించారని, అందుకే ఈ పని చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ లో రాశారు.

 
లక్ష్మి నాలుగైదేళ్ల నుంచి అనారోగ్యంతో ఉన్నారు. ఈ మధ్యే ఆస్పత్రిలో చేరారు. 17న మరణించారు. ఆమెకు చేతబడి జరిగిందన్న అనుమానమున్న లక్ష్మి బంధువులు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా శ్మశానం దగ్గరే ఉన్నారు. చేతబడి చేసిన వ్యక్తి, చనిపోయిన వారి చితి దగ్గరకు వచ్చి పూజలు చేస్తాడనీ, అప్పుడు అతణ్ని పట్టుకోవచ్చని వారి ఉద్దేశం. వారు అక్కడ వేచి ఉన్నప్పుడే ఆంజనేయులు శ్మశానం సమీపంలోని చెరువు దగ్గర కనిపించారు. 

 
ఆంజనేయులే క్షుద్రపూజలు చేశాడని, లక్ష్మి మృతికి కారణమయ్యాడని వారు అనుమానించారు. వెంటనే ఆయన్ను పట్టుకున్నారు. అదే విషయాన్ని మిగిలిన గ్రామస్థులకు ఫోన్లో చెప్పారు. అందరూ కలసి రాళ్లు, కట్టెలు, గొడ్డలితో ఆయన్ను కొట్టారు. ఆంజనేయులు బతికి ఉండగానే, కాలుతున్న లక్ష్మి చితిపైకి తోసేశారు. అందులో ఒకరు తర్వాత విషయాన్ని గ్రామ సర్పంచ్ భర్త నరసింహకు ఫోన్ చేసి చెప్పారు.

 
నలుగురి అరెస్టు
హత్య, సాక్ష్యాలను తారుమారు చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడం అనే నేరాభియోగాల కింద భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 302, 201, 148 రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారు. 19వ తేదీ గురువారం ఏ1 అంటే మొదటి నిందితుడు గ్యార బలరాం(వయసు 52 ఏళ్లు, రైతు) సహా నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఏ2 గ్యార కిష్టయ్య (55 ఏళ్లు, రైతు); ఏ3 బండల శ్రీరాములు (35 ఏళ్లు, లారీ డ్రైవర్); ఏ4 గ్యార నరసింహ (30 ఏళ్లు, లారీ డ్రైవర్) ఉన్నారు.

 
అద్రాస్ పల్లి ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. మృతుడు ఆంజనేయులు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి. నిందితులు ఎస్సీలు. గ్రామ సర్పంచ్ బాధితులకు బంధువు. ఉప సర్పంచ్ నిందితులకు బంధువు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అక్కడ రాజకీయ, లేదా కులవైరం ఏమీ లేదు.

 
లక్ష్మి భర్త ఆరోపణ?
"నా భార్య చితి చుట్టూ ఆంజనేయులు బట్టలు లేకుండా తిరిగాడు. అందుకే మావాళ్లు పట్టుకున్నారు" అని లక్ష్మి భర్త సీతయ్య చెబుతున్నారు. "నా భార్యకు షుగర్, బీపీ ఉన్నాయి. ఆస్పత్రుల్లో చూపించాం. చనిపోయింది. ఇంటికి తీసుకొచ్చాం. అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి వచ్చాక సంప్రదాయం ప్రకారం 'ఇంగళం' (చితి చుట్టూ పిడకలు పెట్టి పాటించే ఒక ఆచారం) చేయడానికి మా వాళ్లు నలుగురు శ్మశానానికి వెళ్లారు. నేను వెళ్లలేదు.

 
మా వాళ్లు వెళ్లేసరికి ఆంజనేయులు చితి చుట్టూ బరిబాతల(నగ్నంగా) తిరుగుతున్నాడు. మా వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. బరబాతల తిరుగుతున్నాడనే పట్టుకున్నారు. మావి వేరే కులాలు. అతను మా కాడి దగ్గర తిరగడం వల్లే ఇది అయింది. మా వాళ్లు పట్టుకున్నారు. కొట్లాట అయింది. కొట్టేశారు. అతను మా కాడి దగ్గరకు రాకపోతే వాళ్లకూ మాకూ అవసరమే లేదు. అతను నగ్నంగా చితి చుట్టూ తిరిగాడు కాబట్టే ఇలా అయింది. లేకపోతే వాళ్లకూ మాకూ ఏమీ లేదు. పంచాయితీలు, కొట్లాటలూ ఏమీ లేవు" అని సీతయ్య బీబీసీతో చెప్పారు. అభియోగం ఎదుర్కొంటున్న వారిలో ఒకరి చేతికి కాలిన గాయాలు అయ్యాయని వారి బంధువులు చెప్పారు.

 
మా తమ్ముడికి మంత్రాలు రావు, అన్యాయంగా చంపేశారు: గణేశ్
"ఆ రోజు సాయంత్రం ఆటో ఇంటి వద్ద పెట్టాక ఆంజనేయులు కాసేపు టీవీ చూశాడు. ఐదు నిమిషాల తక్కువ ఎనిమిది ప్రాంతంలో ఫోన్ వస్తే బయటకు వెళ్లాడు. ఇక రాలేదు. ఆ రోజు రాత్రి మా బంధువు ఫోన్ చేసి మా తమ్ముడికి ఇలా అయిందని చెప్పాకే మాకు విషయం తెలిసింది. నేను ముందు నమ్మలేదు. వెంటనే బయల్దేరి వెళ్లాను" అని ఆంజనేయులు పెద్దన్న గణేశ్ బీబీసీతో చెప్పారు.

 
"నేను వెళ్లేసరికే శ్మశానంలో పోలీసులూ, జనం ఉన్నారు. కాష్టం కాలుతూనే ఉంది. తమ్ముడు వేసుకెళ్లిన నా చెప్పులు చూసి గుర్తుపట్టాను. ఎలా జరిగిందో తెలీదు. ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. వాళ్లకూ మాకూ ఏ గొడవలూ లేవు. మంత్రాలు లేవు, మాకు రావు. వాళ్లు కావాలనే పుకార్లు పుట్టించారు. మా తమ్ముణ్ని కొట్టి చంపేశారు. దాన్నుంచి తప్పించుకోవడానికి మంత్రాలు వేశాడంటూ పుకార్లు పుట్టించారు. తప్పించుకోవడానికే ఈ నింద వేశారు" అని గణేశ్ ఆరోపించారు.

 
"ఆంజనేయులు పగటి పూట బహిర్భూమికి వెళ్లడు. రాత్రుళ్లు డ్యూటీ ముగించుకున్న తర్వాత పొలాల వైపు వెళ్తాడు. రోజూ అతను ఆ దారిలోనే కాష్టానికి చాలా దూరంగా పొలాల వైపు వెళ్తాడు. సాధారణంగా రాత్రి పదీ పదిన్నరకు వెళ్తాడు. ఆ వేళ తొందరగా వెళ్లాడు" అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆంజనేయులు తల్లి, కొడుకు పోయిన దుఃఖంలో ఉన్నారు. ఆంజనేయులు వయసు పాతికేళ్లు.

 
సర్పంచ్ భర్త సాక్షి... ఆయన మాటేమిటంటే?
"నేను కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఉన్నాను. బయటకు రాగానే 8.30 ప్రాంతంలో గ్యార నరసింహ నాకు ఫోన్ చేశారు. 'ఇక్కడ కాష్టం దగ్గరకు వచ్చిన ఆంజనేయుల్ని పట్టుకున్నారు' అని చెప్పాడు. 'కొడుతున్నారు' అని కూడా అనలేదు. అంతలోనే ఫోన్ కట్ అయింది. నేను మళ్లీ కాల్ చేసినా ఎత్తలేదు" అని ఈ కేసులో సాక్షిగా ఉన్న సర్పంచ్ భర్త బోయిని నరసింహ బీబీసీతో చెప్పారు.

 
అప్పుడు తాను పక్క ఊరిలో ఉండడంతో, ఊళ్లో ఉన్న కొందరికి ఫోన్ చేసి శ్మశానం వద్దకు వెళ్లి చూడాలన్నానని ఆయన తెలిపారు. "శ్మశానం దగ్గర లొల్లి అవుతోందనీ, తాము వెళ్లలేదనీ వాళ్లు చెప్పారు. వాళ్లను వెళ్లి చూడాలని చెప్పి, పోలీసులకు ఫోన్ చేశాను. అప్పటికే పోలీసులకు సమాచారం ఉంది. నేనూ, పోలీసులూ, కొందరు గ్రామస్థులం అక్కడకు చేరుకునేసరికి అక్కడెవరూ లేరు. అప్పటికే రాత్రి 9 దాటింది. చీకట్లో ఎవరూ పెద్దగా కనపడలేదు. కాష్టం మీద ఉన్నది ఒక మృతదేహమా, రెండు శరీరాలా, ఆడా, మగా అనే తర్జనభర్జన జరిగింది. చివరకు మిగిలిన భాగాన్ని పక్కకు తీసి పోస్టుమార్టానికి పంపారు" అని నరసింహ చెప్పారు.

 
లక్ష్మి అనారోగ్యంతో మరణించారని, ఆమెకు చేతబడి చేశారని కుటుంబ సభ్యుల అనుమానమని ఆయన చెప్పారు. "చేతబడి చేశారన్న అనుమానంతోనే బహుశా వారు కాష్టం దగ్గర కావలి కాసి ఉండొచ్చు (చేతబడి చేసిన వారు, చనిపోయిన వారి చితి దగ్గరకు వస్తారని ఒక నమ్మకం). రోజూ రాత్రుళ్లు బహిర్భూమికి వెళ్లే అలవాటు ఆంజనేయులుకు ఉంది. కానీ అతను ఎక్కడికి వెళ్లాడు? ఎందుకు వెళ్లాడు? ఎందుకు పట్టుకున్నారు అనేది తెలియదు" అని ఆయన వివరించారు.

 
తాను మంత్రాలను నమ్మనని, కావాలంటే తనకే మంత్రం చేయండని ఊళ్లో చెబుతుంటానని నరసింహ తెలిపారు. సెప్టెంబరు 18న ఘటన గురించి ముందుగా సమాచారం అందిన వారిలో నరసింహ ఒకరు. ఆయనకు సమాచారం ఇచ్చి ఫోన్ కట్ చేసిన గ్యార నరసింహను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆంజనేయులు, నిందితులూ మద్యం ప్రభావంలో ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు గ్రామస్థులు అన్నారు. ఊళ్లో పెద్దవాళ్లు గ్రామ దేవత గుడి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సెప్టెంబరు 18 ఘటన గురించి దాదాపు ఎవరూ కొత్తవారితో మాట్లాడడం లేదు. అద్రాస్ పల్లిలో అధికారులు ముందు జాగ్రత్తగా పోలీసులను మోహరించారు. మూడు చోట్ల క్యాంపు పెట్టి, గొడవలు జరగకుండా కాపలా కాస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రయాన్ 2: ల్యాండర్ ‘విక్రమ్’ దిగాల్సిన ప్రదేశం ఫొటోలు తీసిన నాసా