Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాల్తేరు డివిజన్: అసలు ఈ పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు కనుమరుగు అయిపోతుందా?

Advertiesment
వాల్తేరు డివిజన్: అసలు ఈ పేరు ఎలా వచ్చింది? ఇప్పుడు కనుమరుగు అయిపోతుందా?
, మంగళవారం, 23 మార్చి 2021 (12:47 IST)
ఒక ఏరు... ఓ ఊరి పేరయ్యింది. ఆ పేరే ఆ ఊరికి ఉనికయ్యింది. ఇప్పుడు ఆ పేరు నిలుపుకోవడం కోసం ఉద్యమం మొదలైంది. ఆ ఊరి పేరు వాల్తేరు. ఉద్యమం వాల్తేరు రైల్వే డివిజన్ కోసం. విశాఖపట్నానికి చాలా పేర్లు ఉన్నాయి. గతం నుంచి చూసుకుంటే వైశాఖిపురం, ఇసకపట్నం, వైజాగపట్నం, వైజాగ్, వాల్తేరు... ఇవన్నీ మత్స్యకార పల్లె నుంచి మహానగరంగా ఎదిగిన విశాఖపట్నం పేర్లే.

 
అయితే ఇందులో విశాఖవాసులు ఎక్కువ సెంటిమెంట్, అటాచ్‌మెంట్‌గా ఫీలైయ్యేది మాత్రం వాల్తేరు పేరుకే. ఎందుకంటే విశాఖ ఎదుగుదలకి ప్రధాన కారణాల్లో ఒకటి వాల్తేరు రైల్వేస్టేషన్. ఆ రైల్వే స్టేషన్ కాస్త డివిజన్‌గా మారింది. ఆ డివిజన్ రెండేళ్ల క్రితం జోనయ్యింది. కానీ ఇప్పుడు వాల్తేరు డివిజన్ మాత్రం చరిత్రలో కలిసిపోనుంది.

 
వాలు ఏరు... వాల్తేరు
విశాఖపట్నానికి మరో పేరుగా వాల్తేరును చెప్తారు. ఎందుకంటే రైల్వే స్టేషన్‌కి వాల్తేరు అని పేరు ఉండటంతో విశాఖపట్నం వచ్చినవారంతా వాల్తేరు అనేవారు. రైల్వే టిక్కెట్లపై కూడా వాల్తేరు అనే రాసుండేది. దీంతో విశాఖకి వాల్తేరు పర్యాయపదంగా మారింది. ఇప్పటికీ వాల్తేరు పేరు ఉత్తరాంధ్రతో పాటు మరికొన్ని చోట్ల వాడకంలో ఉంది. వాల్తేరు పేరు వెనుక చిన్నపాటి చరిత్ర కూడా ఉంది.

 
"వాల్తేరు అంటే అదొక బ్రిటిష్ కలెక్టర్, గవర్నర్, ఆర్మీ ఆఫీసరు పేరు అని చాలా మంది చెబుతుంటారు. కానీ, బ్రిటిష్ వాళ్లలో ఎవరికీ వాల్తేరు అనే పేరు ఉండదు. వాల్టర్ అనే పేరు ఉంటుంది. దాంతో చాలా మంది వాల్టర్ పేరే వాల్తేరు అయిందని చెబుతుంటారు. కానీ, వాల్టర్ పేరుతో విశాఖలో ఏ బ్రిటిష్ అధికారి పని చేసినట్లూ రికార్డుల్లో లేదు" అని విశాఖ రైల్వేలపై పరిశోధనలు చేసిన చరిత్రకారులు ఎడ్వార్డ్ పాల్ బీబీసీతో చెప్పారు.

 
"వాల్తేరు అనేది అచ్చమైన తెలుగు పేరు. ప్రస్తుతం విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పెద వాల్తేరు, చిన వాల్తేరు ప్రాంతాల వరకూ ఎర్రమట్టి దిబ్బలు ఉండేవి. వాటి గుండా ఒక ఏరు పారేది. అది సముద్రం వైపుకి వాలుగా పారుతూ శివాజీపాలెం దిగువన ఉన్న బీచ్‌లో కలిసేది. అందుకే ఆ ఏరు పారే ప్రాంతం మొత్తాన్ని వాలు ఏరు అనేవారు. అది వాడుకలో వాలుటేరు అయ్యింది. బ్రిటిష్ వారు దానిని వాల్తేరు అని పిలవడమే కాకుండా రికార్డులలో కూడా వాల్తేర్ (waltair) అనే రాసేవారు. ఈ విషయం లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీ ప్రచురించిన పుస్తకాల్లో కూడా ఉంది’’ అని వివరించారు ఆయన.

 
‘‘వాల్తేరు అనేది జనాల్లో నుంచి పుట్టిన ఒక జనపదం. వాలుటేరుకి దగ్గరగా ఉండటంతోనే విశాఖ రైల్వే స్టేషన్‌కి ఆ రోజుల్లో వాల్తేరు రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. అలాంటి వాల్తేరు అనే పేరు పూర్తిగా చరిత్రలో కలిసిపోతుందని బాధగా ఉంది. మా చిన్నతనంలో మేం ఎక్కడికి వెళ్లినా వాల్తేరు రైలు, వాల్తేరు బస్సు అనే వాళ్లం. వాల్తేరు నుంచి వచ్చారా అని అడిగేవాళ్లం" అని తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఎడ్వార్డ్ పాల్.

 
ఇక చరిత్రే
దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఐదు రైల్వే డివిజన్లలో వాల్తేరు ఒకటి. ఏపీ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దీని పరిధి ఉంది. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తన వ్యాపార అవసరాల కోసం బ్రిటిష్ ఇండియాలో ప్రధానమైన పోర్టులను కలుపుతూ రైల్వే లైన్లను నిర్మించాలని నిర్ణయించింది. తూర్పు కోస్తాలో కోల్‌కతా, మద్రాసు మధ్య ఉన్న విశాఖపట్నంపై బ్రిటిష్ అధికారులు దృష్టి పెట్టారు. 'ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే' పేరుతో 1888లో ఒక కంపెనీని ప్రారంభించారు.

 
ఈ 1890లో విశాఖలోని వాల్తేరు ప్రాంతంలో పనులు ప్రారంభించింది. 1893, జూలై 15న గూడ్స్ ట్రైన్, ఆగస్టు 21న ప్యాసింజర్ ట్రైన్‌ను తొలిసారి వాల్తేరు స్టేషన్ మీదుగా నడిపింది. అలా మొదలైన వాల్తేరు డివిజన్ 127 ఏళ్లు పూర్తి చేసుకుంది. "వాల్తేరు రైల్వే డివిజన్ రద్దు కాబోతోంది. దాని స్థానంలో రాయగడ రైల్వే డివిజన్ రానుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనతో వాల్తేరు రైల్వే డివిజన్ చరిత్రలో కలిసిపోనుంది అనే విషయం స్పష్టమైంది. బీజేపీకి ఏపీ అంటే ఏదో కోపం ఉన్నట్లుంది. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మరోవైపు వాల్తేరు డివిజన్ తీసేయడం చాలా అన్యాయం. స్టీల్ ప్లాంట్, వాల్తేరు ఇలాంటివి ప్రజలకు సెంటిమెంట్. వీటితో విడదీయరాని బంధం ఉంటుంది. ప్రజల భావాలను పట్టించుకోకుండా బీజెపీ ప్రవర్తించడం, దానికి వైసీపీ ప్రభుత్వం వంత పాడటం చూస్తుంటే త్వరలోనే రాష్ట్రం ప్రైవేటీకరణ అయిపోతుందనిపిస్తుంది" అని టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

 
ఆదాయం ఒడిశాకి...పేరు విశాఖకి
తూర్పు కోస్తా రైల్వేకి ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందులో సగానికి సగం వాల్తేరు రైల్వే డివిజన్ నుంచే వస్తుంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకి రూ.25 లక్షలు వస్తుంది. తూర్పు కోస్తా ప్రధాన కేంద్రమైన భువనేశ్వర్‌లో రోజుకి రూ.12 లక్షల రూపాయలే వస్తుంది. వాల్తేరు డివిజన్‌కి ప్రధాన ఆదాయం కేకే లైన్‌లో జరిగే ఐరెన్ ఓర్ రవాణా ద్వారానే వస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా రాయగడ డివిజన్‌కి వెళ్లిపోనుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ప్రతినిధి బీడీ రావు చెప్పారు.

 
"ఏడాదికి సగటున రూ.7,200 కోట్ల ఆదాయం వాల్తేరు డివిజన్‌కు వస్తోంది. ఛత్తీస్‌గడ్, ఒడిశా నుంచి బొగ్గు, ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్‌కి తీసుకుని వచ్చేవి వాల్తేరు డివిజన్‌కి చెందిన గూడ్స్ రైళ్లే. అలాగే స్టీల్‌ప్లాంట్‌లో తయారయ్యే ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేవి కూడా వాల్తేరు డివిజన్‌కు చెందిన రైళ్లే. అయితే ఇప్పటివరకూ వాల్తేరు డివిజన్ మీద వస్తున్న ఆదాయమంతా ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా రైల్వేకే దక్కుతుంది. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేసి ఉత్తరాంధ్ర వాసులుగా దక్షిణ కోస్తా రైల్వే సాధించుకున్నాం. అయితే జోన్ ఇచ్చినట్లే ఇచ్చి ఆదాయానికి కేంద్రమైన వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న ప్రాంతాలను కలిపి రాయగడ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీని వలన ఉత్తరాంధ్ర వాసులు మరింత నష్టపోతారు. ఆదాయమంతా ఒడిశాకి ఇచ్చేసి, పేరుకి జోన్ ఇచ్చామని కేంద్రం చెప్పుకోవడం అన్యాయం. దీనిపై ఉద్యమిస్తాం" అని బీడీ రావు తెలిపారు.

 
‘ఉత్తరాంధ్ర ఉనికి’
‘‘ద‌క్షిణ మ‌ధ్య రైల్వేలో ఉన్న గుంత‌క‌ల్, విజ‌య‌వాడ‌, గుంటూరు డివిజ‌న్ల‌ను మాత్ర‌మే క‌లుపుతూ ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయ‌డం స‌రికాదు. ఎంతో చ‌రిత్ర ఉన్న తూర్పుకోస్తా రైల్వేలో ఉన్న వాల్తేరు డివిజ‌న్‌ను య‌థావిధిగా కొన‌సాగిస్తూ దక్షిణ కోస్తా రైల్వో జోన్ పనులు వెంటనే ప్రారంభించాలి’’ అని విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటాలు చేసిన సంఘాలు కోరుతున్నాయి. "సాధారణ ఎన్నికలకు ముందు వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ (సౌత్ కోస్ట్ రైల్వే జోన్)ను బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే జోన్ పనులు ముందుకు తీసుకెళ్లలేదు. పైగా వాల్తేరు డివిజన్‌ను తీసేస్తున్నామని, దాని స్థానంలో రాయగడ రైల్వే జోన్ వస్తుందని చెప్పడం దారుణం. బీజేపీ దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు’’ అని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జెవీ సత్యనారాయణ అన్నారు.

 
‘‘సుమారు 127 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు పేరుతో చరిత్రలో కలిపేస్తున్నారు. ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం వాల్తేరు డివిజన్‌ను విభజించి అధిక ఆదాయం లభించే ప్రాంతాలను ఒడిశాకు అప్పగిస్తోంది. అంటే విశాఖకు జోన్ వచ్చినా వాల్తేరు డివిజన్ ద్వారా వచ్చినంత ఆదాయం మాత్రం రాదు. వాల్తేరు డివిజన్ కోసం మరో ఉద్యమం చేపడతాం. వాల్తేరు ఎక్కువ ఆదాయం ఇచ్చే డివిజన్ మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర వాసుల ఉనికికి సంబంధించిన అంశం" అని ఆయన అందోళన వ్యక్తం చేశారు.

 
‘ఇంజను లేని రైలు’
సాధారణంగా కేంద్రం నిధులు ఇచ్చేప్పుడు జోన్ పేరిట ఇవ్వదు. డివిజన్ పేరిట ఇస్తుంది. దీంతో వాల్తేరు డివిజన్ రద్దు చేసి జోన్‌ ఇస్తే లాభమేంటని, అలాగే ఈ బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేకి కేటాయింపులు లేకుండా జోన్ ఎలా వస్తుందని రైల్వే ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ‘‘వాల్తేరుకి చరిత్ర ఉంది. ఆదాయం ఉంది. ఇంత ఆదాయం వస్తున్న డివిజన్‌ను ఒడిశా రాష్ట్రానికి ఇవ్వడం సరికాదు. కేంద్రం రాజకీయాల కోసం ఒడిశాకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుంది. దీనిని మేమంతా మళ్లీ ఉద్యమం చేసి అడ్డుకుంటాం’’ అని రైల్వే మజూర్ద్ సంఘం అధ్యక్షులు గాంధీ చెప్పారు.

 
"వాల్తేరు డివిజన్‌ని జోన్‌గా మారిస్తే అంతా ఆనందపడ్డాం. ఎందుకంటే నిధులు వస్తాయి. డివిజన్ పేరుతోనే నిధులిస్తారు. జోన్ పేరుతో నిధులు రావు. అందుకే దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్ ఆమోదం పొందితే వాల్తేరు డివిజన్‌కు భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా వాల్తేరు డివిజనే ఉండదనే అధికారిక ప్రకటన రావడం బాధాకరం’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని వాల్తేరు డివిజన్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

 
‘‘వాల్తేరు డివిజన్ బ్రిటిష్ కాలం నుంచి ఉంది. కరోనా కాలంలో కూడా గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల ద్వారా రూ.5 వేల కోట్లు ఆర్జించిన డివిజన్ వాల్తేరు. అటువంటి వాల్తేరు డివిజన్ పేరు పూర్తిగా రికార్డుల నుంచి మాయమైపోతుందని చెప్పడం మాత్రం బాధాకరం. వాల్తేరు డివిజన్ లేని రైల్వే జోనంటే.. ఇంజన్ లేని రైలులాంటిదే" అని వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయినా ఫోనులో మాట్లాడుతోందని మందలించిన తల్లి... పురుగుల మందుతాగి.. .