Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?

Advertiesment
సెక్స్‌కు ఒకసారి ఒప్పుకుంటే ప్రతిసారీ ఒప్పుకున్నట్లేనా?
, సోమవారం, 22 మార్చి 2021 (13:40 IST)
ముంబయిలోని ప్రముఖ పత్రికలో పని చేస్తున్న వరుణ్ హైర్మాథ్ అనే జర్నలిస్టు దిల్లీలోని ఒక హోటల్లో తనపై అత్యాచారం చేశారని ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆమె మేజిస్ట్రేట్ ముందు తనపై అత్యాచారం జరిగినట్లు చెబుతూ వాంగ్మూలం కూడా ఇచ్చారు.

 
ఈ ఫిర్యాదు ప్రకారం:
బాధితురాలు వరుణ్‌ను ఫిబ్రవరి 20న దిల్లీ ఖాన్ మార్కెట్లో ఒక కెఫెలో కలుసుకున్నారు. తర్వాత ఆయన ఆమెను తనతో పాటు హోటల్‌కు రమ్మని అడిగినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఆమె హోటల్ రూమ్‌కి వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో ఆరోపించారు.

 
ఆమె ఫిర్యాదును ఆధారం చేసుకుని ఐపీసీ 376 (అత్యాచారానికి శిక్ష), 342 (బలవంతంగా బంధించి ఉంచినందుకు శిక్ష), 509 (మాటలతో, చేతలతో, లేదా సైగలతో మహిళను అవమానపరిచేలా ఉండే ప్రవర్తన) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. అయితే, నిందితునిపై అకారణంగా అభియోగాలు మోపారని, ఆయనను కలవడానికే బాధితురాలు పుణె నుంచి వచ్చి హోటల్ రూమ్‌లో కలిశారని, వారిద్దరి మధ్య పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధం చోటుచేసుకుందని పేర్కొంటూ నిందితుని తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కోరారు.

 
కేవలం హోటల్ గదిలోకి కలిసి వెళ్లినంత మాత్రాన లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాధితురాలి తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, ఈ 28 ఏళ్ల నిందితుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తూ బాధితురాలికి గతంలో నిందితునితో ఉన్న లైంగిక సంబంధాలను పరిగణనలోకి తీసుకోవడం జరగదని దిల్లీ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. 

 
అవివాహ లైంగిక సంబంధాలలో సెక్స్‌లో పాల్గొనే ప్రతిసారీ అంగీకారం అవసరం ఉంటుందా? చట్టం ఏమి చెబుతోంది? అసలు కన్సెంట్ లేదా ఒప్పుకోవడం అంటే ఏమిటి?

 
ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా విషయానికి సంబంధించి ఒక పరస్పర ఒప్పందం జరిగినప్పుడు ఇద్దరూ ఒకరికొకరు తెలుపుకునే అంగీకారాన్ని కన్సెంట్ అని అంటారు. ఇదే అర్ధం సెక్సువల్ కన్సెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఒక్కసారి సెక్స్‌కు అంగీకారం తెలిపినంత మాత్రాన ప్రతి సారీ అంగీకారం తెలిపినట్లు కాదని పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజయ్ ఖనగ్వాల్ మార్చి 12న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

 
సంజయ్ ఖనగ్వాల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం “వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలపై ఇద్దరు వ్యక్తులకు మధ్య లైంగిక సంబంధాలను ప్రేరేపించే విధంగా జరిగిన చర్చలు, వారి మధ్య ఉన్న సంబంధాలను పూర్తిగా కొట్టివేయడానికి లేనప్పటికీ ఇండియన్ ఎవిడెన్స్ చట్టం సెక్షన్ 53ఎ ప్రకారం కొన్ని కేసులలో గతంలో ఇద్దరు వ్యక్తులు లైంగిక సంబంధాలను కలిగి ఉండటాన్ని అంగీకారం కింద పరిగణించలేమని పేర్కొన్నారు.

 
ఇదే విషయాన్ని సెక్షన్ 376 కూడా చెబుతోందని పేర్కొన్నారు. ఈ సెక్షన్లను ఉద్దేశించి బాధితురాలు అంగీకారం తెలపని పక్షంలో అది అత్యాచారం కిందకు వస్తుందని కోర్టు చెప్పింది. ఒక వేళ నిందితుని తరపు న్యాయవాది గతంలో వారిద్దరి మధ్య ఉన్న సంబంధం దృష్ట్యా దీనిని అత్యాచారం కింద పరిగణించలేమని చెప్పినప్పటికీ "సెక్స్ చేసిన ప్రతి సారీ అంగీకారం అవసరమే. ఒకసారి అంగీకారం తెలిపినంత మాత్రాన ప్రతిసారీ అది అంగీకారం కింద పరిగణించడానికి లేదు" అని మ్యాట్రిమోనియల్ లాయర్ బిందు జి. నాయుడు అన్నారు.

 
అయితే, బాధితురాలు వేసిన అభియోగాలు నిజమా కావా అనే అంశాన్ని విచారణ దశలో పరిశీలించాలని, బెయిల్ దశలో కాదని హైదరాబాద్‌కి చెందిన న్యాయవాది శ్రీ కాంత్ చింతల అన్నారు. దీని గురించి తుది నిర్ణయాన్ని న్యాయమూర్తులే తీసుకోవల్సి ఉంటుందని అన్నారు. ఇలాంటి కేసులలో సాధారణంగా వ్యక్తుల మధ్య ఉన్న పరిచయం, వారు కలుసుకున్న విధానం, ప్రదేశం లాంటి అంశాలను కోర్టు పరిశీలిస్తుందని అన్నారు.

 
ఈ కేసులో అత్యాచారం జరిగి ఉందని చెప్పడానికి ఎంత ఆస్కారం ఉందో జరిగి ఉండకపోవడానికి కూడా అంతే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. కానీ, విచారణలో నిందితుని ప్రవర్తనను, పాత కేసులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ 53 ప్రకారం వ్యక్తికున్న ప్రతిష్ట, వ్యక్తిగత, సామాజిక ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటారు. “బెయిల్ ఇచ్చే దశలో ఆదేశాలు జారీ చేస్తే అవి భవిష్యత్తులో ఒక ప్రామాణికంగా మారే అవకాశం ఉంది” అని ఆయన అభిప్రాయ పడ్డారు.

 
ఇండియన్ ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం మహిళ కోర్టులో తన అంగీకారం లేకుండా సెక్స్ జరిగిందని చెబితే, కోర్టు దానిని అంగీకారం లేనట్లే భావిస్తుంది. ఇదే విషయాన్ని సంజయ్ ఖణగ్వాల్ స్పష్టం చేశారు. వరుణ్ హైర్మాథ్ కేసులో బాధితురాలి అంగీకారం లేకుండా అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో ప్రస్తావించినందువలన ఈ కేసును అత్యాచారంలాగే పరిగణిస్తామని కోర్టు పేర్కొంది.

 
"నిరూపించుకోవలసిన అవసరం నిందితుని పైనే ఉంటుందని అంటూ ఆ వ్యక్తి ఆమెను ఒత్తిడి చేయలేదు అని నిరూపించగల్గితే అప్పుడు అత్యాచారం కాదని చెప్పవచ్చు" అని బిందు చెప్పారు. “ఒకసారి నిందితుడు అత్యాచారం జరగలేదని ఆధారాలు చూపిన తర్వాత నేరం జరిగినట్లు నిరూపించుకునే బాధ్యత ఫిర్యాదుదారుపై పడుతుందని అన్నారు. కానీ, అత్యాచారాన్ని ప్రతిసారి నిరూపించడం కష్టమే అని అంటున్నారు.

 
ఇందుకోసం డి ఎన్ ఎ పరీక్షలు, లేదా ఆమె శరీరం పైన అయిన గాయాలను చూపించవలసి ఉంటుంది. ఏ మహిళా అనవసరంగా తనపై అత్యాచారం కేసును నమోదు చేయదు"అని ఆమె అన్నారు. అయితే, విచారణ దశలో నిందితుడు, బాధితురాలు కోర్టుకు నివేదించిన ఆధారాల ఆధారంగా కోర్టు తీర్పును వెలువరిస్తుందని అంటూ నేరం జరిగిన పక్షంలో బాధితురాలికి న్యాయం చేకూరడం సమంజసమే కానీ ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకోవడానికి అభియోగాలు మోపితే నిజమైన బాధితులు సమస్యలను ఎదుర్కొనే ముప్పు ఉందని శ్రీకాంత్ అన్నారు. మోసం చేయడం వేరు, అత్యాచారం వేరంటూ ఒక ఉదాహరణ చెప్పారు.

 
సారిక గత పదేళ్లుగా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికీ శారీరక సంబంధం కూడా ఉంది. కానీ, ఆ వ్యక్తికి కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగం రావడంతో కట్నం వస్తుందనే ఆశతో ఈమెను వదిలిపెట్టారు. ఆయన మరో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడటంతో సారికకు ఏమి చేయాలో తోచలేదు. దీంతో, ఆమె పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఆయనపై అత్యాచార అభియోగం నమోదు చేస్తూ కేసు వేశారు.

 
దీనిని కోర్టు అత్యాచారం కింద పరిగణిస్తుందా?
అయితే, ఇది మోసగించడం పరిధిలోకి వస్తుందని, దీనిని అత్యాచారం అని అనలేమని శ్రీకాంత్ అన్నారు. కానీ, అదే వ్యక్తి అంగీకారం లేకుండా లైంగిక దాడి చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన తిలక్ రాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ కేసును ప్రస్తావించారు. ఈ కేసులో ఒక మహిళ ఒక వ్యక్తితో రెండేళ్ల పాటు లైంగిక సంబంధం కొనసాగించిన తర్వాత ఒక రోజు ఆమెపై సదరు వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు. నిందితుడు బాధితురాలిని వివాహం చేసుకుంటానని మోసగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కోర్టు ఈ కేసును విచారించిన తర్వాత దీనిని అత్యాచారం కాదని తేల్చింది.

 
ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరిస్తూ వారిద్దరూ రెండేళ్ల నుంచి సంబంధంలో ఉన్నారని, ఆమె అంగీకారంతోనే ఆయన ఆమె ఇంటికి వెళ్లారని, రాత్రి పూట ఒక 40 సంవత్సరాల వ్యక్తిని బెడ్రూమ్ లోకి ఆహ్వానిస్తే ఏమి జరుగుతుందో తెలియని వయసులో ఆమె లేరని కోర్టు పేర్కొంది. వారి సంబంధం పరస్పర అంగీకారంతో కూడుకున్నదేనని కోర్టు తీర్పు చెప్పింది. నిందితునిపై వేసిన అభియోగాలను కొట్టివేసింది.

 
“ఒక మహిళ ఒక పురుషునితో కలిసి గదిలోకి వెళ్లినంత మాత్రాన సెక్స్ కోసమే వెళ్లినట్లు తీర్మానించడానికి లేదు. ఏదైనా చర్చ చేయడం కోసం గాని, మాట్లాడటం కోసం గాని గదిలోకి వెళ్లి ఉండవచ్చు అని అన్నారు. ఇలా ఊహించే పాత కాలపు భావాలకు స్వస్తి పలకాలి. ఇలా అనడం మహిళ వ్యక్తిత్వాన్ని కించపర్చడమే” అని అన్నారు. ఒక్కొక్కసారి నిందితునికున్న అధికార హోదా, శారీరక బలాన్ని మహిళ ఎదుర్కోలేకపోయి ఉండవచ్చని బిందు అన్నారు.

 
సెక్షన్ 376 ప్రకారం అత్యాచారానికి 10 సంవత్సరాల నుంచి జీవిత కాలం శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పారు. దేశ వ్యాప్తంగా 2019లో 32,033 అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించిన కేసులు 3944 నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 సంవత్సరానికి 1086 అత్యాచార కేసులు నమోదు కాగా తెలంగాణాలో 873 కేసులు నమోదయ్యాయి.

 
ఆస్ట్రేలియాలో కన్సెంట్ యాప్
మరో వైపు, ఆస్ట్రేలియాలో లైంగిక సంబంధాలకు అంగీకారం తెలిపేందుకు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సెక్సువల్ కన్సెంట్ యాప్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకించారు. ఆస్ట్రేలియాలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, లైంగిక దాడులు, దాడుల గురించి సోమవారం కొన్ని వేల మంది నిరసనలు చేశారు.

 
లైంగిక దాడుల కేసుల్లో అంగీకారాన్ని నిరూపించడం చాలా కష్టంగా ఉంటోందని ఇలా యాప్‌లో తమ అంగీకారాన్ని తెలపడం వలన బాధితులకు సరైన న్యాయ పరిష్కారం దొరుకుతుందని న్యూ సౌత్ వేల్స్ పోలీసు కమీషనర్ మిక్ ఫుల్లర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఇలాంటి యాప్‌లు మరింత ముప్పుకు గురి చేస్తాయని మహిళా హక్కుల ఉద్యమకారులు అంటున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడేవారు బాధితురాలిని ఈ యాప్ వాడమని బలవంతం చేసే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు.

 
"అంగీకారానికి సంబంధించి చట్టాలలో సంస్కరణలు, పరిపూర్ణ విద్య, పురుషులు ఏది కావాలంటే అది పొందే తీరు మారాలి కానీ మాకు యాప్ అవసరం లేదు" అని గ్రీన్స్ పార్లమెంట్ సభ్యురాలు జెన్నీ లియోంగ్ ట్వీట్ చేశారు. అంగీకారం లేకుండా చేసే సెక్స్‌ని క్రిమినల్ నేరాల పరిధిలోకి చేర్చడంతో ఈ ఏడాది మొదట్లో డెన్మార్క్‌లో కూడా ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి యాప్‌నే ప్రవేశపెట్టింది. అయితే, దీనిపై ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదురయ్యాయి. మరోవైపు ఆస్ట్రేలియాలో స్కూలు పాఠ్యాంశాల్లో "సెక్సువల్ కన్సెంట్" గురించి పాఠాలు ప్రవేశపెట్టాలనే డిమాండుతో ప్రచారం కూడా జరుగుతోంది.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంసంగ్ గెలాక్సీ ఏ82.. అందుబాటులోకి 64 మెగాపిక్సెల్ కెమెరా