Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖపట్నం: సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లింది, తిరిగి ముందుకు రాదా?

Vizag Beach

బిబిసి

, శనివారం, 31 ఆగస్టు 2024 (17:34 IST)
ఆగస్టు 28న ఆర్కే బీచ్‌కి వెళ్లి కాళీమాత గుడి ఎదురుగా ఉన్న గట్టుపై కూర్చుని చూస్తుంటే తీరం నుంచి సాగరం దూరం జరిగినట్టనిపించింది. అందువల్లే అనుకుంటా.. అప్పటి వరకు అక్కడక్కడ కనిపించే రాళ్లు... ఆరోజు ఎక్కువగా కనిపించాయి. సముద్ర గర్భం నుంచి బయటపడిన ఆ రాళ్లపై సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆర్కే బీచ్‌లో చిన్న ఎరలతో చేపలు పట్టే మత్స్యకారుడు నల్లబాబు కనిపించారు. రాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయేంటని నల్లబాబుని అడిగితే, ‘‘బీచ్ వెనక్కి వెళ్ళిపోయిందన్నా, నాలుగురోజులుగా ఇలాగే ఉంది’’ అని చెప్పారు.
 
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టు ఆర్కే బీచ్ వద్ద సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది? తుపాన్లు, సునామీలు కూడా లేని ఈ సమయంలోనూ సముద్రం వెనక్కి వెళ్లిపోవడానికి కారణాలు ఏంటి? వెనక్కి వెళ్లిన సముద్రం అక్కడే ఉండిపోతుందా? మళ్లీ ముందుకు వస్తుందా? వార్తా సేకరణ విధుల్లో భాగంగా బీబీసీ టీం ఆగస్టు 6న, ఆగస్టు 10న ఆర్కే బీచ్‌కి వెళ్లినప్పుడు సముద్రం మామూలుగానే ఉంది. అప్పుడు బీచ్‌లో దాదాపు ఒక గంట సేపు ఉన్నా తీరంలో ఏ చిన్న మార్పు తెలియలేదు. “తీరంలోని ఆటుపోట్లు, అలల ఎత్తు పల్లాలు, వేగంలో తేడా ఇలాంటి మార్పులు ఏవైనా గమనించాలంటే, సముద్రాన్ని కనీసం ఆరు గంటల పాటు పరిశీలిస్తేనే తేడాను కనిపెట్టగలం” అని ఆంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ బి. సీతారాములు రెడ్డి బీబీసీతో చెప్పారు.
 
“సముద్రం వెనక్కి వెళ్లడం, ముందుకు రావడం రోజూ రెండు సార్లు జరుగుతుంది. అయితే మనం గమనించే స్థాయిలో అది ఉండదు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్లింది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఉంది. పైగా రాళ్లు పైకి తేలాయి” అని అన్నారు. ‘‘వారం రోజులనుంచి సముద్రం వెనక్కి వెళ్లినట్టే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా ఇవే దృశ్యాలు కనిపిస్తుండటం కొత్తగానే ఉంది. సముద్రం ఏదో ఒక సమయంలో 200 మీటర్ల వరకు వెనక్కి వెళ్లి ఉండవచ్చు. కానీ వార్తల్లో వస్తున్నట్లుగా 400 మీటర్లు అనేది తప్పు’’ అని సీతారాములు రెడ్డి బీబీసీకి వివరించారు.
 
కారణాలేంటి?
సునామీ, తుపాన్లు, సముద్ర ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, సముద్రపు ప్రవాహాలు (కరెంట్స్) ఒక దిశ నుంచి మరో దిశకు మారే క్రమంలో సముద్రం వెనక్కి వెళ్లడం లాంటివి జరుగుతూ ఉంటాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఈస్ట్ కోస్ట్) చీఫ్ సైంటిస్ట్ వీవీఎస్ఎస్ శర్మ చెప్పారు. కానీ, ప్రస్తుతం విశాఖ తీరం పొడవునా ఇలాంటి పరిస్థితులేమీ కనపడటం లేదు. మరి సముద్రం వెనక్కి వెళ్లడానికి ఏ వాతావరణ పరిస్థితులు కారణమయ్యాయో రిటైర్డ్ ప్రొఫెసర్ సీతారాములు రెడ్డి వివరించారు. “ఆగస్టు, సెప్టెంబర్‌లలో సముద్రపు గాలులు ఎక్కువగా ఉంటాయి. ఈ గాలులు బలంగా తీరానికి సమాంతరంగా వెళ్లినప్పుడు సముద్ర ఉపరితలంపై ఉండే నీటిని స్థానభ్రంశం చెందిస్తూ తీరం నుంచి వెనక్కి తీసుకువెళతాయి.మళ్లీ బలమైన గాలులు వ్యతిరేక దిశలో వస్తే నీరు ముందుకు వస్తుంది. ఇది వెంటనే జరగవచ్చు, కొన్ని గంటలు, రోజులు సమయం పట్టవచ్చు. ఇది స్థానిక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది” అని తెలిపారు. విశాఖలో సముద్రం వెనక్కి వెళ్లడమనేది సముద్ర ఉపరితలం మీదుగా వీచిన గాలులే కారణమని ప్రస్తుతం తమ వద్ద ఉన్న ‘ఇన్‌కాయిస్ విండ్ డేటా’ (INCOIS Wind Data) చెబుతోందని ఆయన తెలిపారు.
 
సందర్శకుల తాకిడి
సముద్రం వెనక్కు వెళ్ళి రాళ్లు బయటపడటంతో, వాటిపైకి ఎక్కి ఫోటోలు తీసుకోవడానికి ఆర్కేబీచ్‌లో సందర్శకులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో ఫోటోగ్రాఫర్లు అందరూ ఆర్కే బీచ్‌లో తేలిన రాళ్ల వద్దే కనిపిస్తున్నారు. “ఇప్పుడు సెల్‌ఫోన్లు, సొంత కెమెరాలు పెరిగిపోయి బీచ్‌లో మాతో ఎవరు పెద్దగా ఫోటోలు తీయించుకోవడం లేదు. ఈ రాళ్లు తేలిన నాలుగు రోజుల నుంచి, ఇలాంటి దృశ్యాలు మళ్లీ కనపడవని, మంచి ఫోటోలు రావాలని మాతో ఫోటోలు తీయించుకుంటున్నారు. అందుకే అందరం ఇక్కడే ఉంటున్నాం” అని బీచ్ ఫోటోగ్రాఫర్ రవి బీబీసీతో చెప్పారు. ‘‘వారానికి ఒకటి, రెండు సార్లు బీచ్‌కి వస్తుంటాను. కానీ, ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఇలాంటి రాళ్లు, వాటిపై నాచు, సముద్రం వెనక్కి వెళ్లడం చూడలేదు’’ అని సందర్శకురాలు నీరజ చెప్పారు.
 
ఇతర తీరాల సంగతేంటి?
సముద్రం వెనక్కి వెళ్లడం విశాఖలో మాత్రమే కనిపిస్తోందా, ఇతర తీర ప్రాంతాల్లోనూ కనిపిస్తుందా? అనే విషయాన్ని రిటైర్డ్ ప్రొఫెసర్ సీతారాములు రెడ్డిని బీబీసీ అడిగింది. “ఇది విశాఖ తీరం పొడవునా ఆర్కే బీచ్, సబ్ మెరైన్ పక్కనున్న కోక్ పార్క్, రుషికొండ, భీమిలి ఇలా అక్కడక్కడ కనిపించవచ్చు. కానీ, ఇతర తీర ప్రాంతాల్లో ఇలా ఉండేందుకు అవకాశం లేదు. సముద్రం వెనక్కి వెళ్లడం అనేది భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు వాటి తీవ్రత ఉన్న తీర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖలో సముద్రం వెనక్కు వెళ్లడానికి స్థానిక వాతావరణ పరిస్థితులే పూర్తికారణమని స్పష్టంగా తెలుస్తోంది” అని ఆయన చెప్పారు.
 
మత్స్యకారులేమన్నారంటే...
సముద్రం వెనక్కి వెళ్లిందనే విషయాన్ని నిత్యం అక్కడే ఉండే మత్స్యకారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ సముద్రం వెనక్కి వెళ్లడం నిజమేనని మత్స్యకారులు నల్లబాబు, ధనరాజు అన్నారు. ఇంత వెనక్కి వెళ్లడం ఎప్పుడు జరగలేదా? అని అడిగితే, ‘ఈ మధ్య ఎప్పుడూ వెళ్లలేదు’ అని నల్లబాబు చెప్పారు. కిందటి శివరాత్రి సమయంలో ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం చూశానని, మళ్లీ ఇప్పుడే చూస్తున్నానని చెప్పారు. సముద్రం 400 మీటర్లు వెనక్కి వెళ్లిపోవడం నిజమేనా? అని ధనరాజుని అడిగితే.. అంత వెనక్కి వెళ్లలేదని, అలా చెబుతున్నారని అన్నారు.
 
జాగ్రత్తలు అవసరం
ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో విశాఖ తీరానికి వచ్చేవారు.. అలల తీవ్రతను, తీరం పరిస్థితులను గమనిస్తూ ఉండటం లేదా సమాచారం అడిగి తెలుసుకోవడం మంచిదని సీతారామలు రెడ్డి చెప్పారు. ‘‘తీరం ఎప్పుడూ ఇంతే దూరంలో ఉంటుందని భావించి, సముద్రం వైపు వెళ్తే సముద్రం తన స్థానానికి అకస్మాత్తుగా వస్తే ప్రమాదాలు జరుగుతాయి. బయటకు తేలిన రాళ్ళకు విపరీతంగా నాచు పట్టి ఉంటుంది. అక్కడ ఫోటోలు తీసుకునే సందడిలో జారి కిందపడే ప్రమాదం ఉంది’’ అని ఆయన తెలిపారు. జీవీఎంసీ అధికారులు తీరం వద్ద లైఫ్ గార్డులను పెట్టారు. సందర్శకులను లోపలకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ నంబరుకే ట్రాఫిక్ చలాన్లు : ఈ- చలాన్ దిశగా తమిళనాడు పోలీస్