Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేణు మాధవ్‌కు ఆ అందమైన అలవాటు ఉండేది: ఎల్బీ శ్రీరాం

Advertiesment
వేణు మాధవ్‌కు ఆ అందమైన అలవాటు ఉండేది: ఎల్బీ శ్రీరాం
, బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:05 IST)
వేణుమాధవ్‌కు ఒక అందమైన అలవాటు ఉండేది. తన షూటింగ్ ఉన్నా లేకపోయినా షూటింగ్ దగ్గరకు వస్తాడు. వచ్చి అందర్నీ నవ్వించి వెళ్తాడు. అదింకా గొప్ప లక్షణం. అసలు అతను ఆ సినిమాలో లేనట్టుండదు. ఆ సినిమాలో అతనూ ఉన్నాడనే అనుకుంటాం. లేకపోయినా వచ్చాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. ఆయన సెట్లో ఉన్నప్పుడు రకరకాల జోకులు వేసుకుంటాం. నవ్వించుకుంటాం.

 
ఎల్బీగారూ అని పిలిచేవాడు. దిల్, మనసున్న మహారాజు, ఎదురులేని మనిషి ఇలా చాలా సినిమాల్లో కలసి పనిచేశాం. ఒక ఏడెనిమిదేళ్ల పాటు కనీసం రెండు మూడు రోజులకొకసారి మా కాంబినేషన్ ఉండేది. సెట్లో ఎప్పుడూ కలిసే ఉండేవాళ్లం. చాలా సినిమాలు కలసి యాక్ట్ చేశాం. భూ కైలాస్‌లో అతను హీరోగా చేశాడు. నేను తండ్రిగా, గీతాంజలి గారు తల్లిగా చేశారు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశాం. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మనకున్న గొప్ప హాస్య నటుల్లో వేణు మాధవ్ గారు ఒకరు.

 
ఒకప్పుడు మనకు గర్వించదగ్గట్టుగా 40 మంది వరకూ కమెడియన్లు ఉండేవారు తెలుగులో. టాలీవుడ్ కామెడీ అంటే అన్‌కంపేరబుల్. ఏ భాషలో, ఏ దేశంలో ఎవరితో పోలిక లేకుండా 40 మంది వరకూ హాస్యనటులూ అందులో 20 మంది వరకూ దిగ్గజాలు, బాగా లీడ్ చేసిన కమెడియన్లు ఉండేవారు. వారందరిదీ ఎవరి బాణీ వారిది. ఎవరి టైమింగ్ వారిది. ఎవరి స్టైల్ వారిది. అలా వారు ఏలారు. అలాంటి వారిలో వేణు మాధవ్ ఒకరు.

 
కమెడియన్స్ ఎంత మంది ఉన్నా, 20 మంది ఉన్నా 40 మంది ఉన్నా, వాళ్లందరి మధ్యా ఇద్దరు చాలా స్పెషల్. అందరి మధ్యా వాళ్లిద్దరూ అలానే కనపడే వారు. అలానే వినపడే వారు. వాళ్లే ఎం.ఎస్. నారాయణ, వేణు మాధవ్. వాళ్లు చుట్టూ ఉన్న వారు అప్పుడున్న మూడ్ మర్చిపోయేలా, వాళ్ల మూడ్‌ని పక్కన పెట్టి ఒక ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి మెయింటెన్ చేసే వారు.

 
సెట్‌లలో ఎంఎస్ నారాయణ, వేణు మాధవ్‌లు ఉన్నారని స్పష్టంగా తమ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకునేవారు. వాళ్లు వేసే వేషం ఏదైనా.. వచ్చిన షూటింగ్ ఏదైనా.. వాళ్ల హడావుడి అలానే ఉండేది. అలా ఉండడం వల్ల అందర్నీ ఆకర్షించగలిగేవారు. షాట్లలోనూ, షాట్ల మధ్య గ్యాప్‌లోనూ, తెరమీద ఒక గాలి దుమారంలా ఉండేవారు. అందులో స్పెషల్‌గా నేను గుర్తించింది వేణు మాధవ్‌ని.

 
ఫలానా డైరెక్టరు హాస్యానికి పెద్ద పీట వేసేవారు అంటారు. ఈవీవీ సత్యనారాయణ గారు హాస్యానికి ఫ్లైటే వేశారు. ఫ్లైట్ నిండా కమెడియన్లను థాయిలాండ్ తీసుకెళ్లి షూటింగ్ చేసేవారు. అందరం నెల రోజులు గడిపి వచ్చే వాళ్లం. అలాంటిది.. అలాంటిదిలా చిక్కిపోయి చిక్కిపోయి అందరూ ఏజ్డ్ కాబట్టి అందరూ ఇలా వెళ్లిపోయారేమన్నట్టుగా చూస్తుండగానే కనుమరుగైపోయారు. మిగిలిన అతి కొద్ది మందిలో వేణు మాధవ్ వెళ్లిపోవడం వెలితిగా కనిపిస్తోంది.

 
అసలు సినిమా పోకడే మారిపోయింది. కామెడీ పోకడ ఇంకా మారిపోయింది. మేం 40 మంది పోయినా ఇంకో 80 మంది వచ్చి ఉండొచ్చు. లోటు ఉండదు కామెడీకి. కానీ, ట్రెండ్స్, స్టైల్స్ మారాయి. అవి మారినప్పుడు ఆడియెన్స్ కూడా ట్యూన్ అవుతున్నారు. కొందరు ట్యూన్ అవడానికి సమయం పడుతుంది. అలాంటి సంధియుగంలో ఉన్న కొందరు పోతున్నప్పుడు ఒకరకమైన బాధ ఉంటుంది.
webdunia

 
నేను రచయిత నుంచి నటుడిగా మారాను. వేణు మాధవ్ మిమిక్రీ నుంచి నటుడిగా మారాడు. ఇవి నటులకు పునాదులు. నేను అనేక పాత్రలకు సంభాషణలు రాశాను. వాళ్లు ఎలా పలకాలి, ఎవరు ఎలా పలుకుతారు అనేది దృష్టిలో పెట్టుకుని రాశాను. రాసేప్పుడు ఒక సౌండ్, ఒక రిథమ్ నా మైండ్‌లో ఉంటుంది. రాసేప్పుడు అది ఫీల్ అవుతాం. నటుడిగా మారిన తరువాత ఆ సౌండ్ల మధ్య నా సౌండ్ ఎలా ఉండాలనేది ఊహించుకోగలను. బాలెన్స్ చేసుకోగలను. పరోక్షంగా అదో బలం అవుతుంది.

 
అలాగే మిమిక్రీ ఆర్టిస్టుగా వేణు మాధవ్ అనేక గొంతులను అనుకరించినప్పుడు వాళ్లందరి సౌండ్స్ మధ్యా తన సౌండ్ ఎలా ఉండాలనేది తను బాలెన్స్ చేసుకోగలరు. డిజైన్ చేసుకోగలడు. వారి మధ్య ఏదో ఒక ఆర్టిస్టును ఇమిటేట్ చేస్తే గొప్ప నటుడు అయ్యుండేవారు కాదు. ఇంతమందిని ఇమిటేట్ చేసి స్క్రీన్ మీదకు వచ్చాక, తను యాక్టర్ అయ్యాక, తనకంటూ ఐడెంటిటీని చూపించుకోవడానికి తను సొంత శైలి డిజైన్ చేసుకోవాలి. ఇమిటేషన్ కుదరదు. అందుకే వేణు పాపులర్ ఆర్టిస్ట్ కావడానికి ముందు మిమిక్రీ చేశాడు కానీ, యాక్టర్ అయిన తరువాత తనదైన బాణీలో చేసుకుంటూ వెళ్లాడు.

 
అతనిదొక కీచుగొంతు. బ్రేక్ అయిన వాయిస్ లాగా పెక్యులర్‌గా ఉంటుది. ఆ గొంతుతోనే చేశాడు. అది పెద్ద ఎసెట్ అయింది. తనదంటూ ఒక వాయిస్ పెర్ఫార్మెన్స్ డిజైన్ చేసుకుని కష్టపడి ఎదిగాడు. ఎన్నో పాత్రలు చేశాడు. ఎంతో మంది కమెడియన్స్‌తో పోటీపడి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

 
వేణు మాధవ్ ఎక్కడున్నా, పైనుంచి కూడా నవ్విస్తూ ఉండగలడు. తన జ్ఞాపకాల ద్వారా, తన సినిమాలో కామెడీ సన్నివేశాల ద్వారా, డిజిటల్ - సోషల్ మీడియా వచ్చాక మనిషి కలకాలం గుర్తుండే సదుపాయాలు వచ్చాయి కాబట్టి, ప్రస్తుతం అతను మన మధ్య లేకపోయినా అతని జ్ఞాపకాలు మన వెంట వస్తాయి. తరువాతి తరాలకు కేరీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి.

 
అందరం టికెట్ కొనుక్కున్న వాళ్లమే.
వేణు మాధవ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని. నువ్వు ఏ రూపంలో, ఏ జన్మ ఎత్తినా నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. వేణు మాధవ్ వదలి వెళ్లిన జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘‘ఇసుక మాఫియా చేతుల్లో చీరాల బందీ.. ప్రశ్నించిన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది’’