Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్‌ ఔరయా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 24 మంది వలస కార్మికులు మృతి

ఉత్తరప్రదేశ్‌ ఔరయా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 24 మంది వలస కార్మికులు మృతి
, శనివారం, 16 మే 2020 (11:13 IST)
ఉత్తరప్రదేశ్ ఔరయా జిల్లాలో శనివారం తెల్లవారుజామున రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది కార్మికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ కార్మికులందరూ రాజస్థాన్ నుంచి వస్తున్నారు. ఘటనాస్థలానికి వెళ్లి బాధితులకు అవసరమైన సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగీ జిల్లా అధికారులను ఆదేశించారు.

 
కాన్పూర్ డిప్యూటీ కమిషనర్, ఆ జోన్ ఐజీని తక్షణం ఘటనా స్థలానికి చేరుకోవాలని, సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని యోగీ ఆదేశించారు. కార్మికులలో ఎక్కువ మంది కార్మికులు బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు ఉన్నారని ఔరయా డీఎం అభిషేక్ సింగ్ చెప్పారు.

 
ఘటనాస్థలంలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, గాయపడ్డవారిని సైఫయి మెడికల్ కాలేజీలో చేర్పించామని తెలిపారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున మూడు-మూడున్నర గంటల మధ్య జరిగినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు చెప్పారు. ట్రక్ వెనుక దాదాపు 50 మంది కూలీలు ప్రయాణిస్తున్నారని, వారంతా రాజస్థాన్ నుంచి వస్తున్నారని చెప్పారు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం, వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును, దిల్లీ నుంచి వస్తున్న ఒక డీసీఎస్ వ్యాన్ డీకొంది.

 
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తన ట్విటర్‌లో ఈ ఘటన పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్‌లో "ఔరయా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వలస కార్మికులు/కూలీలు చనిపోవడం దురదృష్టకరం. విషాదంలో ఉన్న మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు అన్నిరకాల సాయం అందించాలని, గాయపడినవారికి తగిన చికిత్స అందించాలని, ప్రమాదంపై వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించాం" అన్నారు.

 
ఈ ప్రమాదంపై యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి ఏఎన్ఐతో మాట్లాడారు. "వలస కార్మికుల కోసం ఆహారం అందించడం నుంచి, రవాణా, బస వరకూ అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిన్ననే చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలను సీరియస్‌గా తీసుకోకపోవడం దురదృష్టకరం" అన్నారు.

 
యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై ట్వీట్ చేశారు. వలస కార్మికుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ బీజేపీ ప్రబుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్ష రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు.

 
లఖ్‌నవూ ఎంపీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్వీట్‌లో "ఉత్తరప్రదేశ్ ఔరయా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది కూలీలు చనిపోయారనే విషయం తెలిసి చాలా బాధ కలిగింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

 
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. "ఔరయాలో రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం. ప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఈ ఘటనలో చనిపోయిన వారి బంధువులకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నాను" అని మోదీ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కష్టాల్లో ఇరుక్కుపోయిన పాక్ మాజీ ప్రధాని.. మరో రెండు కేసులు