ఉత్తర్ ప్రదేశ్ రాయ్‌బరేలీలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఉన్నావ్ అత్యాచార కేసులో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంపై ఎలాంటి కేసూ నమోదవలేదు. అయితే తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె వకీలుకు కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం రాయ్‌బరేలీలోని గురుబక్ష్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు పోలీసులు చెప్పారు.
ఉన్నావ్ అత్యాచార కేసులో బాధితురాలు, ఆమె ఇద్దరు బంధువులు, వకీలు వెళ్తున్న కారును ఒక ట్రక్కు ఢీకొన్నట్లు తమకు సమాచారం అందిందని ఉన్నావ్ ఎస్పీ మాధవేంద్ర ప్రసాద్ వర్మ బీబీసీకి చెప్పారు. "ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. వారిలో బాధితురాలి పిన్ని, ఆమె చెల్లెలు ఉన్నారు. బాధితురాలి వకీల్ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు లఖ్‌నవూ ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఉన్నావ్ పోలీసులు బాధితురాలి తల్లిని తీసుకుని లఖ్‌నవూ చేరుకున్నారు" అని చెప్పారు.
ప్రమాదం జరగ్గానే పారిపోయిన ట్రక్ డ్రైవరును అరెస్టు చేశామని, అతడిని విచారిస్తున్నామని గురుబక్ష్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ రాకేశ్ సింగ్ చెప్పారు. "బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఢీకొన్న ట్రక్ నంబర్ ప్లేటుపై నల్ల రంగు పూసి ఉంది" అని స్థానిక జర్నలిస్ట్ అనుభవ్ స్వరూప్ యాదవ్ చెప్పారు. రాయ్‌బరేలీ ఎస్పీ సునీల్ సింగ్‌ను వివరాలు కోరితే ఆయన "దానిపై ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. బాధితురాలి కుటుంబం ఎలా కోరుకుంటే అలా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడతాం" అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ ఆరోపణలు
"ఈ ప్రమాదం రాయ్‌బరేలీలో జరిగింది. గాయపడ్డవారిని అక్కడి పోలీసులే లఖ్‌నవూ తీసుకొచ్చారు" అని ఎస్పీ మాధవేంద్ర ప్రసాద్ చెప్పారు. అయితే రాయ్‌బరేలీ పోలీసులు ఈ విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడంలేదు. ఉన్నావ్ అత్యాచారం ఆరోపణలతో బాంగర్‌మౌ ఎమ్మెల్యే, బీజేపీ నేత కులదీప్ సింగ్ సెంగర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కులదీప్ సెంగర్‌పై ఆయన స్వగ్రామం మాఖీలో ఇంటి దగ్గరే ఉంటున్న ఒక బాలిక అత్యాచార ఆరోపణలు చేసింది. ఇప్పుడు అదే బాలిక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
సీబీఐ విచారణ
ఈ అత్యాచార ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గత ఏడాది ఏప్రిల్లో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగర్‌ను అరెస్టు చేశారు. గత ఏడాది ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకోవడంతో, "దోషులు ఎవరైనా వదిలిపెట్టం" అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సీతాపూర్ జిల్లా జైల్లో ఉన్న కులదీప్ సెంగర్‌ను 2019 జూన్‌లో బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కలవడంతో ఈ కేసు మరింత వివాదాస్పదమైంది.
ఆయనను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సాక్షి మహరాజ్.. "మా ప్రాంతంలో చాలా ప్రముఖులైన ఎమ్మెల్యే కులదీప్ సెంగర్ చాలా రోజుల్నుంచి ఇక్కడ ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆయనకు ధన్యవాదాలు చెబితే బాగుంటుందని అనిపించింది. అందుకే ఆయన్ను కలవడానికి వచ్చాను" అన్నారు.
అసలు కేసేంటి
2017 జూన్‌లో బాలికపై అత్యాచారం చేశారని ఎమ్మెల్యే కులదీప్ సెంగర్‌పై ఆరోపణలు వచ్చాయి. బంధువుతో కలిసి ఉద్యోగం అడగడానికి ఆయన ఇంటికి వెళ్లినపుడు కులదీప్ తనపై అత్యాచారం చేశారని బాలిక ఆరోపించింది. ఈ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో తర్వాత బాధితురాలు కుటుంబ సభ్యులతో కోర్టు కెక్కింది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని బాలిక ఆరోపించింది.
పోలీసుల అదుపులో తండ్రి మృతి
ఇదే క్రమంలో ఏప్రిల్ 3న ఎమ్మెల్యే సోదరుడు, బాధితురాలి తండ్రి మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పోలీసుల అదుపులో ఉన్న ఆమె తండ్రి మృతిచెందారు.బాలిక తండ్రి చనిపోవడానికి ముందు ఒక వీడియో వైరల్ అయ్యింది. అందులో ఎమ్మెల్యే సోదరుడు, మరికొందరు కలసి పోలీసుల ముందే తన తండ్రిని కొట్టారని బాధితురాలు ఆరోపించింది.
పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే గూండాయిజానికి పాల్పడుతున్నారంటూ సీఎం నివాసం బయట కిరోసిన్ పోసుకుని బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో ఈ కేసు పతాక శీర్షికల్లో నిలిచింది. ఉన్నావ్ మాఖీ పోలీస్ స్టేషన్లో కులదీప్ సెంగర్‌పై అత్యాచారం, పోస్కో యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది. తర్వాత సీబీఐ కులదీప్ సెంగర్‌ను అరెస్టు చేసింది. ఈ కేసులో విచారణ ఆలస్యం కావడంపై అలహాబాద్ హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది.