ఐక్యరాజ్యసమితిలో ముఖ్యమైన సమాచారాన్ని హిందీ సహా అధికార, అనధికార భాషల్లో అందించటాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ ఆమోదించింది. భారతదేశం ప్రతిపాదించిన ఈ తీర్మానంలో తొలిసారిగా హిందీ భాషను ప్రస్తావించారు.
మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఈ తీర్మానంలో హిందీ భాష ప్రస్తావన వచ్చింది. బంగ్లా, ఉర్దూ భాషల ప్రస్తావన కూడా ఈ తీర్మానంలోకి తొలిసారిగా వచ్చింది. ఈ చేర్పులను మేం ఆహ్వానిస్తున్నాం అని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టి.ఎస్.త్రిమూర్తి తెలిపారు.
బహుభాషా విధానం ఐరాస కీలక విలువల్లో ఒకటి అని ఆయన చెప్పారు. దీనికి ప్రాధాన్యం ఇచ్చినందుకు ఐరాస సెక్రటరీ జనరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. యూఎన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ (డీజీసీ)తో భారతదేశం 2018 నుంచి భాగస్వామ్యంతో పనిచేస్తోంది. వార్తలు, మల్టీమీడియా సమాచారాన్ని హిందీ భాషలో క్రోడీకరించటానికి అదనపు బడ్జెట్‌ను అందిస్తోంది అని త్రిమూర్తి వివరించారు.
ఇందులో భాగంగా 2018లో Hindi @ UN ప్రాజెక్టును ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితిని హిందీ భాషలో ప్రజల దగ్గరకు తీసుకెళ్లటం, హిందీ మాట్లాడే కోట్లాది మందిలో ప్రపంచ అంశాలపై అవగాహన పెంపొందించటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలు ఐక్యరాజ్యసమితి ఆరు అధికారిక భాషలుగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ కార్యనిర్వాహక భాషలుగా ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలు కొనసాగుతున్నాయి.