Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Andhra Pradesh: 10th పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఇంతగా తగ్గిపోవడానికి కారణం ఎవరు?

Advertiesment
Students
, బుధవారం, 8 జూన్ 2022 (17:54 IST)
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఫలితాల కోసం 6.2 లక్షల మంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూశారు. జూన్ 6న వెలువడిన 2022 ఫలితాల్లో 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంత తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదవ్వడం రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై చర్చతో పాటు రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 66.06 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు.. అంటే 20 ఏళ్ల తర్వాత అంత తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా గత 2019-2020, 2020-2021 విద్యా సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించకుండా 'ఆల్ పాస్' విధానంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులందరూ ఉత్తీర్ణులైయ్యారు. ఈ ఏడాదే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరీక్షలు రాశారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన తొలి పరీక్షలు కూడా ఇవే. అనకాపల్లి జిల్లా, పెందుర్తి మండలం అప్పన్నపాలెంకు చెందిన పదోతరగతి విద్యార్థి సాయి ఫెయిల్ కావడంతో, తల్లి మందలించారు. దాంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కొందరు విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ నేపథ్యంలో ఈ ఫలితాల సరళి, విశ్లేషణ విషయమై విద్యాశాఖ అధికారులు, టీచర్ల యూనియన్లు, విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు మానసిక వైద్య నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

 
'కోవిడ్ కదా...పాస్ చేసేస్తారమ్మా, డోన్ట్ వర్రీ'
కోవిడ్ కారణంగా గత రెండు విద్యాసంవత్సాల్లో పరీక్షలు లేకుండానే విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా రెండు సంవత్సరాలు 'ఆల్ పాస్' విధనాంలో అందర్ని ఉత్తీర్ణుల్ని చేశారు. కోవిడ్ వార్తలు ఇంకా వినిపిస్తున్నందున ఇప్పుడు కూడా అందర్నీ ఉత్తీర్ణులు చేస్తారని విద్యార్థులు భావించారని, తమ పిల్లలు కూడా పదే పదే అదే మాట అనేవారని కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు.

 
"మా అమ్మాయి 8, 9 పరీక్షలు రాయకుండానే 10వ తరగతికి వచ్చేసింది. ఈ రెండేళ్లు కోవిడ్ కారణంగా ఇంటిలోనే ఉన్నారు. పైగా, ఆన్ లైన్ క్లాసులకంటూ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు కొనిపించుకున్నారు. ఆ ఫోన్‌తో క్లాసులు ఏం విన్నారో కానీ, పూర్తిగా ఫోన్‌కు అలవాటైపోయారు. చదవమంటే కోవిడ్ కదా... ఈ సంవత్సరం కూడా అందర్నీ పాస్ చేసేస్తారమ్మా, నువ్వు కంగారు పడకు అని చెప్పేది." అని విశాఖపట్నంలోని ద్వారకానగర్‌కు చెందిన విమల బీబీసీతో చెప్పారు.

 
మా అమ్మాయి పదో తరగతి పాసైయ్యింది. కానీ ఇంటర్, ఆ తర్వాత చదువులు ఎలా పూర్తి చేస్తుందోననే అందోళన ఉంది. కోవిడ్ పేరుతో చదివినా, చదవకున్నా అందర్ని పాస్ చేయడం విద్యార్థులకు నష్టం కలిగిస్తుందని తాను నమ్ముతున్నానని విమల చెప్పారు. విమల ఆందోళన సంగతి పక్కన పెడితే, పరీక్షల్లో పాస్ అవడంతో ఆమె కుమార్తె శ్రావణి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 
2019తో పోల్చితే ఈసారి 27.62 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 2020, 2021 సంవత్సరాల్లో పరీక్షలు పెట్టకుండానే అందర్నీ పాస్ చేసిన ప్రభుత్వానికి, ఈ ఏడాది పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాల వెల్లడి వరకు అంతా సంక్లిష్టంగానే మారింది. పరీక్షలు ప్రారంభమవ్వగానే మాస్ కాపీయింగ్ విమర్శలు, పేపర్ లీక్ ఆరోపణలతో గందరగోళం ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో పరీక్షలు రద్దవుతాయేమోననే ఆందోళన కూడా చాలా మందిలో కనిపించింది. మొదటి మూడు రోజులు జరిగిన తెలుగు, హిందీ, ఆంగ్ల భాష పరీక్షల్లో ఎక్కువ మంది పాస్ కాగా, ఆ తర్వాత జరిగిన గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రం పరీక్షల్లో ఎక్కువ మంది ఫెయిలయ్యారు.

 
"కోవిడ్ కారణంగా రెండేళ్లుగా విద్యార్థులకు పరీక్షలు లేవు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాదే పరీక్షలు రాశారు. ఇప్పుడు పది పరీక్షలు రాసిన విద్యార్థులు గత రెండేళ్లు 9, 8 తరగతులు పరీక్షలు రాసుండాలి. కానీ ఆ పరీక్షలు జరగలేదు. అంటే వారు ఏడో తరగతి పరీక్ష రాసిన తర్వాత నేరుగా ఇప్పుడు పదో తరగతి పరీక్షలే రాశారు. పైగా 8,9 తరగతుల్లో ఆన్‌లైన్ క్లాసులు విన్న విద్యార్థులు చాలా వరకు వాటిని అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంటర్నెట్ సమస్యతో పాఠాలు వినడం, అర్థం చేసుకోవడం కష్టంగా మారింది. ఇవన్నీ కూడా పదో తరగతి రాసిన విద్యార్థులపై ప్రభావం చూపాయి. ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా ఉంది." అని విజయనగరం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎం.మోహన్ చెప్పారు.

 
మూల్యాంకన సూత్రాలను కఠినంగా పాటించడం వల్లేనా?
పేపర్ కరెక్షన్ మూల్యాంకన సూత్రాలు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్) ఫాలో అవుతూ స్ట్రిక్ట్‌గా చేశారని, ఇది కూడా ఫలితాల శాతం తగ్గుదలకు కారణమై ఉంటుందని కొందరు ఉపాధ్యాయులు చెప్పారు. పేపర్లను దిద్దేటప్పుడు మూల్యాంకన సూత్రాలు ప్రకారం చేస్తారు. అంటే విద్యార్థుల జవాబు పత్రాలు దిద్దేటప్పుడు టెక్ట్స్ పుస్తకాల్లో ఉన్న విధంగానే ఉండాలి. ఆ టెక్స్ట్ పుస్తకాల్లో ఎలా ఉన్నాయో అలాంటి కాపీలనే పేపర్లు దిద్దేవారికి ఇస్తారు, దీని ప్రకారమే పేపర్ కరెక్షన్ చేస్తారు. టెస్ట్ పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్లు రాస్తే పూర్తి మార్కులు ఇస్తారు. తప్పు జవాబైతే దానికి అసలు మార్కులివ్వరు.
 
 
కానీ టెస్ట్ బుక్స్‌లో ఉన్న సమాధానానికి దగ్గర రాసినా మార్కులు ఇస్తారు. ఈ సారి దీనిని చాలా స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వడంతో టెస్ట్ బుక్‌లో ఉన్న సమాధానం ఉంటే పూర్తి మార్కులు, దగ్గరగా ఉంటే పావు మార్కులు ఇచ్చారు" అని అనకాపల్లి జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, హైస్కూల్ ఉపాధ్యాయుడు గొంది చిన్నబ్బాయి బీబీసీతో చెప్పారు. "అంటే 5 మార్కుల ప్రశ్నకు కరెక్టుగా రాస్తే ఐదుకు ఐదు వేశారు. అదే జవాబు దాదాపుగా కరెక్టుగా రాస్తే గతంలో ఐదు 4 వేసేవారు. ఇప్పుడు ఒకటి, ఒకటిన్నర వేశారు. ఇదే ప్రిన్సిపాల్ ఆఫ్ ఎవల్యూషన్‌ని కచ్చితంగా ఫాలో అవ్వడమంటే" అని చినబ్బాయి వివరించారు.

 
'11 పేపర్లు, 7కు తగ్గాయి...ఒత్తిడి పెరిగింది'
రాష్ట్రంలో 71 బడుల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూల్స్ 31, ఎయిడెడ్‌ 18, గవర్నమెంట్ స్కూల్స్ 22 ఉన్నాయి. 2018లో 17 బడుల్లో సున్నా ఉత్తీర్ణత ఉండగా, 2019లో కేవలం మూడు పాఠశాలల్లోనే సున్నా ఉత్తీర్ణత నమోదైంది. అందులో ప్రైవేటు స్కూల్స్ 2, ఎయిడెడ్‌ స్కూల్ ఒకటి ఉన్నాయి. ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా లేదు. కానీ 2022లో 22 ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది.

 
"పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో సుమారు 10 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇది బోధనపై ప్రభావం చూపింది. పేపర్ల విధానంలో కూడా మార్పులు తెచ్చారు. గతంలో 2019 వరకు 11 పేపర్లు ఉండగా.. వాటిని ఏడు పేపర్లకు తగ్గించారు. ఒకే సబ్జెక్టుని 50 మార్కుల చొప్పున రెండు సార్లు రాస్తే...ఇప్పుడు వంద మార్కులకు ఒకేసారి రాయాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇక గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతంలోని విద్యార్థులు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఫోన్లు లేక, ఉన్నా సిగ్నల్ లేక నష్టపోయారు" అని లంబసింగికి చెందిన ఉపాధ్యాయులు ఆనందరావు చెప్పారు.

 
"ముఖ్యంగా విద్యా సంవత్సరం, పరీక్షల తేదీల మార్పు కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. మార్చి మూడో వారానికి ముగియాల్సిన పదో తరగతి పరీక్షలు మంచి ఎండల్లో ఏప్రిల్ చివరి వారంలో మొదలై మే మొదటి వారం వరకు కొనసాగాయి. ఇంత ఎండల్లో ప్రిపేర్ కావడం, పరీక్షలు రాయడం కూడా విద్యార్థులపై ప్రభావం చూపింది" అని ఆనందరావు అన్నారు.

 
'కంపార్టుమెంటల్ పాసైనా రెగ్యులర్ కిందే లెక్క'
విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి సారించింది. సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ కాబోయే విద్యార్థులను కూడా ఇప్పుడు పాసైన విద్యార్థులతో సమానంగానే పరిగణిస్తామని ప్రకటించింది. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరై, పాసైనా, వారికి సర్టిఫికెట్‌లో కంపార్టుమెంటల్ అని రావాలి. ఈసారి అలా రాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగానే డివిజన్లు కేటాయిస్తామని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవేందర్ రెడ్డి చెప్పారు. ఇది ఆ విద్యార్థులకు కాస్త ఊరట ఇచ్చే అంశమే.

 
"ఇప్పుడు సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు ఎన్ని మార్కులు వచ్చినా వారిని కంపార్టుమెంటల్‌ పాస్‌ కింద చూడరు. ఇలా పాసైన విద్యార్థులకు వచ్చే మార్కులను యథాతథంగా పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్‌ పరీక్షల మాదిరిగానే వారికి కూడా డివిజన్‌లను కేటాయిస్తారు. దీంతో వారికి కంపార్టుమెంట్ పాస్ అనే మాట వారి సర్టిఫికేట్స్‌లో ఉండదు. అలాగే వారికి వచ్చిన మార్కుల ఆధారంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్ అని రెగ్యులర్ విద్యార్థులతో సమానంగానే పరిగణిస్తారు." అని డి. దేవేందర్ రెడ్డి వివరించారు.

 
ప్రభుత్వాలు ఏం చేసినా విద్యా సంవత్సరాన్నిడిస్ట్రబ్ చేయకూడదని, అది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆంధ్రా యూనివర్సిటీ సైకాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ఆన్ లైన్ క్లాసుల ప్రభావం కూడా ఉందన్నారు. "కోవిడ్ వలన విద్యార్థులు ఎక్కువగా ఇంట్లో ఉండటం వలన టీవీలకు, సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయారు, పరీక్షల ప్రిపరేషన్ అనేది లేక కాంపిటేటివ్ డెవలప్ మెంట్ తగ్గిపోయింది. పట్టుదల, ఏకాగ్రత తగ్గిపోయాయి.

 
ఆన్ లైన్ క్లాసులతో టీచర్ స్టూడెంట్ రిలేషన్ తగ్గిపోయింది. ఇదే అన్నింటికంటే ఎక్కువ ప్రభావం చూపింది. టీచర్ తన మాట, రాత ద్వారా పాఠం చెప్పడం (వెర్బల్ విధానం) వలన 35%, అతని హావభావాలు 7% ప్రభావం చూపితే, టీచర్ నడవడిక, పాఠాన్ని చెప్పే విధానం, పిల్లల్ని పాఠంలో లీనం చేసేందుకు వాడే టెక్నిక్స్ (నాన్ వెర్బల్) వంటి అంశాలు 58% ప్రభావం చూపుతాయి. ఆన్లైన్ క్లాసులతో మనం నాన్ వెర్బల్ టీచింగ్ మిస్ అవుతాం. పరీక్షలు రాయకుండా పాసవడం, పాఠశాలలు, కాలేజీలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం వంటి వాటి నుంచి సైకాలజీకల్‌గా బయపడాలంటే కనీసం ఏడాదైనా పడుతుంది. అది కూడా సరైన గైడెన్స్, కౌన్సిలింగ్ తోనే" అని ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు అభిప్రాయపడ్డారు.

 
టెన్త్ ఫలితాలపై పెద్దయెత్తున రాజకీయ విమర్శలు వస్తున్నాయి. రెండు లక్షల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులను పదో తరగతి ఫెయిల్ చేశారని, అదంతా పథకాలను ఎగ్గొట్టేందుకు పన్నిన కుట్ర అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆరోపిస్తోంది. పదోతరగతి ఎక్కువ మంది పాసైతే ఇంట‌ర్‌, పాలిటెక్నిక్‌లో ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇవ్వాల్సి వ‌స్తుంద‌నే కుట్ర‌తోనే ఎక్కువ‌ మందిని ఫెయిల్ చేశార‌ని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఆరోపించారు. నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ప్రచారానికి, పదో తరగతి ఫలితాలకు సంబంధమే లేదని విమర్శించారు.

 
టీడీపీ ఆరోపణలను వైసీపీ కొట్టిపారేసింది.
కోవిడ్ కారణంగా చదువుకు చాలా మంది విద్యార్థులు కొంత దూరమయ్యారని, ప్రస్తుత ఫలితాలకు అదొక కారణమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో చెప్పారు. 2015లో 91.42 శాతం, 2016లో 93.26 శాతం, 2017లో 91.92 శాతం, 2018 లో 94.48 శాతం, 2019లో 94.88 శాతం.. వరుసగా ఇలాంటి ఫలితాలను చూసిన రాష్ట్రం ఇప్పుడు పదోతరగతి ఫలితాలను ఏ స్థాయిలో సాధించిందో చూస్తే ఆందోళనగా ఉందని మాజీ విద్యాశాఖ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మేల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పాటిస్తున్న విద్యా విధానాలను ఒకసారి సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ