Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్: పర్యావరణానికి ముప్పు తెస్తున్న ఆ ఉత్పత్తుల జాబితా ఇదే

webdunia
గురువారం, 3 అక్టోబరు 2019 (13:31 IST)
ప్లాస్టిక్‌ కాలుష్యంలో 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌' అంటే కేవలం ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్‌దే అగ్రస్థానం. ఇప్పటికే దీన్ని 60కి పైగా దేశాలు నిషేధించాయి. భారత్‌లోనూ కొన్ని రాష్ట్రాల్లో దీనిపై ఆంక్షలున్నాయి. ఒకసారి ఉపయోగించిన తరువాత వీటిని రీసైకిల్ చేస్తారు. లేదా వ్యర్థంగా పడేస్తారు. ప్లాస్టిక్ బ్యాగ్‌లు, నీళ్ల సీసాలు, సోడా సీసాలు, స్ట్రాలు, ప్లేట్లు, కప్పులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు ఈ జాబితాలోకి వస్తాయి.

 
50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌గా యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్వచించింది. ఈ ప్రమాణాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. నిషేధం విధించే సమయంలో ప్రభుత్వం వీటిని నిర్వచిస్తుంది.

 
ఉత్పత్తి ఎలా జరుగుతోంది?
1950 నుంచీ ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. నేడు మిగతా పదార్థాలన్నింటినీ ప్లాస్టిక్ దాటుకుపోయింది. ఈ ఉత్పత్తి ప్రధానంగా శిలాజ హైడ్రోకార్బన్లపై ఆధారపడుతుంది. ఇవి పునరుద్ధరించలేని ఇంధన వనరులు. ఉత్పత్తి ఇలానే కొనసాగితే.. 2050 నాటికి ప్రపంచ చమురు వినియోగంలో 20 శాతం ప్లాస్టిక్ పరిశ్రమలకే మళ్లించాల్సి ఉంటుందని ఐరాస వెల్లడించింది.

 
వ్యర్థాల్లో ఎవరి వాటా ఎంత?
2015లో ప్రపంచ ప్లాస్టిక్ వ్యర్థాల్లో 47 శాతం ప్యాకేజీ ప్లాస్టికే ఉన్నట్లు ఐరాస నివేదికలో తేలిపింది. దానిలోని వివరాల ప్రకారం.. వ్యర్థాల్లో సగం ఆసియాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. దేశాల వారీగా చూస్తే ప్యాకేజీ ప్లాస్టిక్ వ్యర్థాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్‌ ప్యాకేజీ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి ఏడాదికి ఐదు మిలియన్ టన్నులకుపైనే ఉంది. నగరాలవారీగా చూస్తే దిల్లీలో రోజుకు 690 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. తర్వాత స్థానాల్లో చెన్నై (429 టన్నులు), కోల్‌కతా (426 టన్నులు ), ముంబయి (408) ఉన్నాయని కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.

 
ఇప్పటికే నిషేధం విధించిన రాష్ట్రాలు
పాలిథీన్ సంచులపై 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చాయి. వీటిని కట్టుదిట్టంగా అమలు చేయట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ నివేదికలో తెలిపింది. కర్నాటక, పంజాబ్‌లలో 2016లోనే నిషేధం అమలులోకి వచ్చిందని, అయితే ఇప్పటికీ అక్కడ సంచులు విచ్చలవిడిగా అమ్ముతున్నారని వివరించింది.

 
అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లలో అవగాహన కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పింది. మరోవైపు రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో క్రమంగా ఫలితాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దిల్లీ, తమిళనాడు, నాగాలాండ్, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్, మహారాష్ట్రల్లోనూ నిషేధం అమలులో ఉంది.

 
పర్యావరణంపై ప్రభావమెంత?
వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటిపై జరుగుతున్న చర్చల్లో ప్లాస్టిక్ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు ట్రిలియన్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఒక గంటలో ఉపయోగించిన ప్లాస్టిక్‌ను తాడులా కడితే మన భూమిని ఏడుసార్లు చుట్టొచ్చు. వీటిని కుప్పగాపోస్తే ఫ్రాన్స్ విస్తీర్ణంలో రెండింతల భూభాగం కావాలి.

 
ప్లాస్టిక్ బ్యాగులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు పర్యావరణంలో కలిసేందుకు ఒక్కోసారి వెయ్యేళ్ల వరకు పడుతుంది. ప్లాస్టిక్ పదార్థాల్లో స్టైరీన్, బెంజీన్ లాంటి విషపూరిత రసాయనాలుంటాయి. ఇవి కాన్సర్ ముప్పును పెంచుతాయి. నాడీవ్యాధులు, శ్వాసకోస, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతలకు దారితీస్తాయి. నేల, నీటిలో కలిసే సమయంలో ఇవి కొన్ని హానికర రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో పండించే పంటలతోపాటు జల వనరులూ కాలుష్యం అవుతాయి. జలచరాల ప్రాణాలకూ ఇవి ముప్పు తెచ్చిపెడతాయి.

 
నిర్మూలన ఎలా?
రీసైకిల్ చేయడం, తగలబెట్టడం, నేలలో పాతిపెట్టడం, చెత్తకుప్పలుగా పోయడం లాంటి విధానాల్లో ఈ ప్లాస్టిక్‌ను నిర్మూలిస్తారు. అయితే చాలాసార్లు నేరుగా పర్యావరణంలోకి వదిలేస్తుంటారు. మొత్తం ప్లాస్టిక్‌లో కేవలం తొమ్మిది శాతాన్నే రీ-సైకిల్ చేస్తున్నట్లు ఐరాస తెలిపింది.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

సైరా నరసింహారెడ్డి రివ్యూ: దేశభక్తి, చిరంజీవి కాంబినేషన్ పనిచేసినట్లే