సైరా నరసింహారెడ్డి రివ్యూ: దేశభక్తి, చిరంజీవి కాంబినేషన్ పనిచేసినట్లే

గురువారం, 3 అక్టోబరు 2019 (12:38 IST)
ఏ భాషలో తీసిన సినిమాకైనా దేశభక్తి అనేది మాంచి అమ్మకం సరుకు. అందుకే, మన దేశభక్తి సినిమాలలో ఎక్కువ భాగం హిట్‌లే. సైరా నరసింహారెడ్డి- దేశభక్తి సినిమా కాబట్టి బాగుండకపోవడానికి పెద్దగా కారణాలుండవు. అలా అని చాలా బాగుండడానికీ ఏం లేదు, అంతా తెలిసిన మూస దేశభక్తే కనుక.

 
ఇప్పుడు అదో రకమైన దేశభక్తి ఫీవర్ ఉంది కాబట్టి సైరా సరైన సీజన్‌లో విడుదలైనట్టే. దేశభక్తికి చిరంజీవి క్రేజ్, జానపద కథా ధోరణి తోడవడం- నయనతార, తమన్నా జగపతి బాబు వంటి తారాగణంతో పాటు వేల స్క్రీన్ల మార్కెటింగ్ కలిస్తే ఇంకేముంది బాక్సాఫీస్ బద్దలే. యుద్ధం, దేశభక్తి ఆధారిత సినిమాలలో చరిత్రలో నమోదు కాని ఒక చిన్న ఘట్టాన్ని తీసుకుని తిరుగుబాటు పోరాటాలుగానో, వీరగాథలుగానో చెప్పిన కథలు చాలా ఉంటాయి.

ఓ రెజిమెంట్లో వీర సైనికుడి కథ, ఓ గ్రామంలో ఓ విప్లవకారుడి ధీరత్వం అన్నీ స్వతంత్ర పోరాట గాథలే. వీటిలో కాల్పనికత కొంత ఎక్కువగానే ఉన్నాస్వేచ్చా వాయువుల కోసం తపించే భావోద్వేగాలు ఆ ఎక్కువను మన్నించేస్తాయి. సైరాలోనూ అదే కనిపించింది. సైరా మానవాతీతంగా పోరాడాడు అనిపించినప్పటికీ దేశభక్తి ఉద్వేగం ఆ అతీత లక్షణాన్ని దాచేస్తుంది. సైరా కథను ఝాన్సీ లక్ష్మీభాయి చేత చెప్పించడం ఆ అతీతంలో భాగమే.

 
'ఎంత బాగుందంటే!'
సైరా సినిమా ఎంత బాగుందంటే? సొంత నేలను పరాయివాడు దోచుకుంటుంటే మన తరఫున ఎవరో పోరాడుతున్నప్పుడు కలిగే ఉద్వేగమంత బాగుంది. మన సంపదను, ఆత్మాభిమానాన్నికొల్లగొడుతున్నవాడి పీచమణిచే స్వీయగౌరవ పోరాటమంత బాగుంది.

 
మెగాస్టార్ స్క్రీన్ స్టామినా విశ్వరూపమంత అనిపించేంత బాగుంది. అన్ని భాషల ప్రధాన తారలంతా జాతర కట్టిన మల్టీ స్టారరంత బాగుంది.
 
సినిమా ఎంత బాగుందంటే- సినిమాటోగ్రఫీ కళ్లు తిప్పుకోనివ్వనంత. సైరా పాత్రను 'లార్జర్ దేన్ లైఫ్'గానే ప్రదర్శించినా చిరు అంతకంటే పైన మెగా సైజ్‌లో నిలబడ్డంత. 

 
బాగా లేనిదేంటంటే ?
బాగా లేనివీ ఉన్నాయి. అమితాబ్, అనుష్క, సేతుపతి వంటి నటులను తీసుకున్నా వారిని సరిగ్గా వాడుకోలేదు. పాటల్లో ఒక్కటి కూడా నిలిచేలా లేదు. వీఎఫ్ఎక్స్ షాట్ల మధ్య చిరంజీవిని అక్కడక్కడా ఇరికించినట్లనిపించింది. సెకండ్ హాఫ్‌లో సాగదీత ఎక్కువైంది. పైగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అని ఓ వైపు చెబుతూనే మరోవైపు అంతా కల్పితమే అని చెప్పడం కూడా బాగులేదు.

 
భారీతనం బాగానే ఉన్నట్టనిపించినా అక్కడక్కడ భారంగా కూడా అనిపిస్తుంది. బహుశా నరసింహారెడ్డి చేసే దాడులు, చంపే ఆంగ్ల ముష్కరుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు. తమన్నాకు మంచి పాత్ర దొరికింది.. అమితాబ్‌ను వినియోగించుకోలేదు. చిరంజీవి మాత్రం ఎక్కడా తన ఇమేజీకి తగ్గకుండానే నటించారు. తమన్నాకు చాలా మంచి పాత్ర దొరికింది. బాహుబలితో పోలిస్తే ఆమెకిది గౌరవప్రదమైన పాత్ర. తమన్నా చనిపోయే సన్నివేశం అద్భుతంగా పండింది. అమితాబ్‌ను పూర్తిగా వినియోగించుకోలేదు. అంతోటి పాత్రకు అమితాబే అక్కరలేదు.
సురేందర్ రెడ్డి తన అన్ని సినిమాలలో చేసే తప్పే ఇక్కడా చేశారు. ఆయన టేకింగ్‌లో ఏ ఫ్రేముకా ఫ్రేము బాగుంటాయి. కానీ సమగ్రత ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ సంగీతం పట్ల తీసుకున్న శ్రద్ద పాటల విషయంలో తీసుకోలేదు. నాలుగు పాటలూ వినసొంపుగా లేవు. ''అతని పుట్టుకలోనే యుద్ధం ఉంది. ఆ యుద్ధం పుట్టుకలోనే మరణించింది'', ''ఎందుకు బతకాలో తెలుసుకుంటే ఎందుకు మరణించాలో తెలుస్తుంది'' లాంటి కొన్ని సందర్భాలలో బుర్రా సాయి మాధవ్ తన శైలిలో సంభాషణలు పలికించారు.

 
సెకండ్ హాఫ్‌ను కొంత ట్రిమ్ చేసుంటే సినిమా మరింత బిగువుగా ఉండేది. అయినప్పటికీ చిరు అభిమానులకు, వారాంతంలో ఎంటర్టైన్‌మెంట్ కావాలనుకునే సినిమాభిమానులకు సైరా సంబరమే.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్... ఉద్యోగం మానేస్తే జీతం వెనక్కి ఇవ్వాల్సిందే...