Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’, అంతు చిక్కని రహస్యాల నిలయం

Advertiesment
భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’, అంతు చిక్కని రహస్యాల నిలయం
, సోమవారం, 1 మార్చి 2021 (12:18 IST)
హిమాలయ పర్వత సానువుల్లోని ఒక మారుమూల మంచు లోయలో ఏర్పడిన సరస్సు వందాలది అస్థిపంజరాల అవశేషాలతో నిండి ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో 'త్రిశూల్' పర్వతం భారతదేశంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఏటవాలుగా ఉండే ఈ పర్వతం దిగువున, సముద్ర మట్టానికి 5,029 మీటర్ల (16,500 అడుగుల) ఎత్తులో ఉన్న 'రూపకుండ్' సరస్సు ప్రాంతంలో అనేక అస్థిపంజరాల అవశేషాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

 
సరస్సులో మంచు కింద ఉన్న ఈ అవశేషాలను 1942లో ఒక బ్రిటిష్ రక్షణ అధికారి కనుగొన్నారు. "అస్థిపంజరాల సరస్సు" (లేక్ ఆఫ్ స్కెలెటన్స్)గా పిలిచే ఈ ప్రాంతంలో దొరికిన అవశేషాలపై అర్ధ శతాబ్దానికి పైగా ఆంత్రపాలజిస్టులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. ఔత్సాహికులైన పరిశోధకులకు, సందర్శకులకు హిమాలయాల్లోని ఈ సరస్సు ఎన్నో ఏళ్లుగా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

 
ఏడాదిలో ఎక్కువ భాగం గడ్డ కట్టుకుపోయి ఉండే ఈ సరస్సు, వాతావరణ మార్పులను అనుసరించి విస్తరిస్తూ, కుంచించుకుపోతూ ఉంటుంది. మంచు కరిగినప్పుడు అస్థిపంజరాలు బయటకు కనిపిస్తుంటాయి. ఇన్నేళ్ల తరువాత కూడా కొన్నింటికి మాంసపు ముద్దలు అతుక్కుని ఉండడం విశేషం. ఇప్పటివరకూ, 600 నుంచీ 800 మంది మనుషుల అస్థిపంజరాల అవశేషాలు ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో టూరిజంను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దీన్ని అంతు చిక్కని "మర్మసరస్సు" (మిస్టరీ లేక్)గా అభివర్ణించడం మొదలుపెట్టింది.

 
అంతు చిక్కని రహస్యం
యాభై ఏళ్లకు పైగా ఈ అవశేషాలను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు ఇదొక అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. వీళ్లంతా ఎవరు? ఎప్పుడు చనిపోయారు? ఎలా చనిపోయారు? ఎక్కడనుంచీ ఇక్కడకు వచ్చారు? ఇలా జవాబులు దొరకని ప్రశ్నలు ఎన్నో. 870 సంవత్సరాల క్రితం ఒక భారతీయ రాజు, రాణి, వారి సేవాగణం ఇక్కడ మంచు తుపానులో చిక్కుకుని మరణించి ఉంటారనే ఒక కథనం గతంలో ప్రచారంలో ఉండేది.

 
ఇక్కడ కనిపించిన కొన్ని అవశేషాలు భారతీయ సైనికులవి అనేది మరో కథనం. 1841లో టిబెట్‌పై దాడి చేసిన భారత సైన్యాన్ని తిప్పి కొట్టడంతో 70 మందికి పైగా సైనికులు హిమాలయాల మీదుగా ఇంటి బాట పట్టారని, కానీ మార్గ మధ్యలో వారంతా మరణించి ఉంటారనేది కొందరి వాదన. ఇది ఒక స్మశానవాటిక కావొచ్చని, ఏదైనా అంటువ్యాధి లేదా మహమ్మారి బారిన పడినవారిని ఇక్కడ పూడ్చిపెట్టి ఉండొచ్చనేది మరొక వాదన. వీటన్నిటికీ తోడు ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లో ఒక చిత్రమైన జానపద గాథ ప్రచారంలో ఉంది.

 
భారతదేశంలోని రెండవ ఎత్తైన పర్వతం నందా దేవిని ఇక్కడి వారంతా దేవతగా కొలుస్తారు. ఒకసారి నందా దేవి పెద్ద వడగళ్ల వాన కుపించిందని, అవి ఇనప రాళ్లంత బలంగా ఉండడంతో ఈ సరస్సు దాటి వెళుతున్నవాళ్ళందరూ ఆ ధాటికి మరణించారని చెప్పుకుంటూ ఉంటారు.

 
ఈ అస్థి పంజరాల అవశేషాలపై జరిపిన మునుపటి అధ్యయనాల్లో వెలుగు చూసిన కొన్ని అంశాలు.. వీరిలో చాలా మంది పొడుగు మనుషులు, "సగటు ఎత్తు కన్నా ఎక్కువ ఉండేవారని" తేలింది. వీరిలో ఎక్కువ భాగం మధ్య వయస్కులు.. 35 నుంచీ 40 ఏళ్ల మధ్యలో ఉన్నవారు. పసివాళ్లుగానీ, చిన్నపిల్లలుగానీ లేరు. కొందరు వృద్ధ మహిళలు ఉన్నారు. అందరూ దాదాపు మంచి ఆరోగ్యవంతులే. వీరంతా ఒకే సమూహానికి చెందిన మనుషులని, 9వ శతాబ్దంలో సంభవించిన ఒక విపత్తు కారణంగానే వీరందరూ మరణించారని అంచనా.

 
తాజా అధ్యయనం ఏం చెబుతోంది?
అయితే, ఈ ఊహలు, అంచనాలు నిజం కాకపోవచ్చని తాజా అధ్యయనంలో బయటపడింది. ఐదేళ్లపాటూ సాగిన ఈ అధ్యయనాన్ని ఇండియా, అమెరికా, జర్మనీల్లోని 16 పరిశోధనా సంస్థలకు చెందిన 28 మంది అధ్యయనకారులు నిర్వహించారు. సరస్సు దగ్గర దొరికిన 38 అస్థిపంజరాల అవశేషాలను శాస్త్రవేత్తలు జన్యుపరంగా విశ్లేషించారు. ఈ 38 మందిలో 15 మంది మహిళలు ఉన్నారు. వీరి అవశేషాలను కార్బన్-డేటింగ్ చేయగా, కొన్ని అవశేషాలు 1,200 సంవత్సరాల నాటివని తేలింది.

 
వీరంతా జన్యుపరంగా విభిన్న సమూహాలకు చెందినవారని, అంతే కాకుండా వీరి మరణాలు వివిధ కాలాల్లో సంభవించినవనీ తేలింది. 1,000 ఏళ్ల వ్యత్యాసంతో సంభవించిన మరణాలు కూడా ఉన్నాయని కనుగొన్నారు. "వీరంతా ఒకే విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారనే వాదనను తాజా అధ్యయనం తిరస్కరిస్తోంది. అయితే, రూపకుండ్ సరస్సు దగ్గర ఏం జరిగుంటుందనేది ఇప్పటికీ అస్పష్టమే. కానీ, వీరంతా ఒకే సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు కాదనేది స్పష్టమైంది" అని ఈ అధ్యయన ప్రధాన పరిశోధకులు, హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టరల్ విద్యార్థి ఎడావోయిన్ హార్నీ తెలిపారు.

 
చనిపోయినవారంతా ఒకే సమూహానికి చెందినవారు కాదన్నది ఈ అధ్యయనంలో తేలిన ఆసక్తికరమైన అంశం. వీరిలో కొందరి జన్యు లక్షణాలు, ప్రస్తుతం దక్షిణ ఆసియాలో నివసిస్తున్న ప్రజల జన్యు లక్షణాలను పోలి ఉన్నాయి. మరి కొందరి జన్యు లక్షణాలు, ప్రస్తుతం యూరోప్‌లో నివసిస్తున్నవారు, ముఖ్యంగా గ్రీకు ద్వీపమైన క్రీట్ ప్రజల జన్యువులకు దగ్గరగా ఉన్నాయి. అలాగే, దక్షిణ ఆసియానుంచి వచ్చినవారు "ఒకే జనభా నుంచి వచ్చినవారుగా కనబడడం లేదు".

 
"కొందరు ఈ ఉపఖండానికి ఉత్తరభాగం నుంచి వచ్చినవారుగానూ, మరి కొందరు దక్షిణ భాగం నుంచి వచ్చిన వారుగానూ కనిపిస్తున్నారు" అని హార్నీ తెలిపారు. అయితే, వీరంతా వివిధ కాలాల్లో ఈ సరస్సు దగ్గరకి వచ్చారా? కొందరు అప్పట్లో సంభవించిన ఏదైనా విపత్తులో చిక్కుకుని మరణించారా? సరస్సు ప్రాంతంలో ఎలాంటి మారణాయుధాలుగానీ, వాణిజ్య వస్తువులుగానీ బయటపడలేదు. ఈ సరస్సు వర్తక మార్గంలో లేదు.

 
ఎలాంటి అంటు వ్యాధిగానీ, మహమ్మారి గానీ, మరణాలకు కారణం కాగలిగే వ్యాధి కారక బ్యాక్టీరియా ఉనికిగానీ జన్యు పరిశోధనలో బయటపడలేదు. ఇక్కడ ఏదైనా తీర్థయాత్ర జరిగేదా, దాని కోసమే ప్రజలు ఈ సరస్సు గుండా ప్రయాణించేవారా అనే సమాచారం కొన్ని చిక్కు ముడులు విప్పవచ్చు. అయితే, 19వ శతాబ్దం చివరి వరకూ ఇక్కడ నమ్మదగిన తీర్థయాత్రలేవీ జరగలేదని అధ్యయనాలు చెబుతున్నాయి.

 
కానీ, స్థానిక దేవాలయాల్లోని శాసనాలు 8వ శతాబ్దం నుంచీ 10వ శతాబ్దం మధ్యలోనివని తేలింది. దీన్ని బట్టి పూర్వకాలంలో ఇక్కడ తీర్థయాత్రలు జరిగేవని, ఈ ఆలయాలను సందర్శించేందుకు జనం వచ్చేవారని చెప్పవచ్చు.

 
వీటన్నిటి బట్టీ, "ఏదైనా తీర్థయాత్ర సందర్భంగా ఇక్కడ సామూహిక మరణాలు సంభవించి ఉండొచ్చన్ని" శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కాగా, తూర్పు మధ్యధరా ప్రాంతపు ప్రజలు భారతదేశంలోని ఎత్తైన పర్వతాలలో ఒక మారుమూల సరస్సు వద్దకు ఎందుకు వచ్చినట్టు?

 
ఐరోపా నుంచీ వచ్చి హిందూ మతానికి సంబంధించిన ఒక తీర్థయాత్రలో పాల్గొనేవారనేది నమ్మశక్యంగా లేదు. లేదా కొన్ని తరాలపాటూ ఇక్కడ తూర్పు మధ్యధరా ప్రాంతపు ప్రజలు నివసించేవారా? "జవాబుల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాం" అని హార్నీ తెలిపారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5జీ ఫోనును ఉపయోగిస్తున్నారా? ఐతే నెట్‌వర్క్ ఆఫ్ చేయాలట