ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు పెరిగిపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తెలిపింది. ఇందుకు కారణాలు అనేకం.
బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేసే వారు మెచ్యూరిటీ తీరిన తరువాత కూడా వాటిని విత్‌డ్రా చేసుకోవడం లేదు. మరికొందరు సేవింగ్ లేదా కరెంట్ అకౌంట్స్‌ను వాడకుండా వదిలేస్తున్నారు. తద్వారా అవి ఇనాపరేటివ్ అయిపోతున్నాయి. ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్‌ను క్లోజ్ చేయడానికి కస్టమర్లు ముందుకు రావడం లేదు. కొందరు చనిపోవడం వల్ల వారి డిపాజిట్లు అలాగే ఖాతాల్లో ఉండిపోతున్నాయి.
కొన్నిసార్లు చనిపోయిన వారి నామినీలు డిపాజిట్లు క్లెయిమ్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. మరికొన్నిసార్లు నామినీలు పెట్టకపోవడం కూడా సమస్యగా మారుతోంది. డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల డిపాజిట్లు పేరుకుపోతున్నాయి. 2022 మార్చి నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల విలువ రూ.48,262 కోట్లకు చేరింది. తెలంగాణ, ఏపీలతో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరిగిపోతున్నాయని ఆర్‌బీఐ చెప్పుకొచ్చింది.
ఒక్క ఏడాదిలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు దేశవ్యాప్తంగా రూ.8,998 కోట్లు పెరిగాయి. 2020-21లో రూ.39,264 కోట్లుగా ఉన్న ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ 2021-22 నాటికి రూ.48,262 కోట్లకు చేరాయి. ఇలా ఎవరూ పట్టించుకోకుండా ఉండిపోతున్న డిపాజిట్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఆర్‌బీఐ ఆందోళనవ్యక్తం చేసింది. మెచ్యూరిటీ అయిన తరువాత కూడా క్లెయిమ్ చేయని డిపాజిట్లకు బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఆర్‌బీఐ ప్రారంభించింది.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ అంటే?
మెచ్యూరిటీ దాటిన 10 సంవత్సరాలలోపు క్లెయిమ్ చేయని టర్మ్ డిపాజిట్లను క్లెయిమ్ చేయని డిపాజిట్లుగా పరిగణిస్తారు. ఉదాహరణకు A అనే వ్యక్తి 2005లో 5 ఏళ్ల కాలానికి రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. 2010 నాటికి ఆ డిపాజిట్ మెచ్యూర్ అయింది. కానీ A ఆ డబ్బులు తీసుకోలేదు. 2020 నాటికి మెచ్యూర్ అయ్యి 10 ఏళ్లు కావడంతో దాన్ని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా పరిగణిస్తారు.
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్‌గా మారితే ఏమవుతుంది?
ఒక బ్యాంకు బ్రాంచ్‌లో ఉండే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆ బ్యాంకు హెడ్ ఆఫీసుకు పంపిస్తారు. ఆ తరువాత ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(డీఈఏఎఫ్)'కు తరలిస్తారు. యాక్టివ్‌గా లేని టర్మ్ డిపాజిట్లతోపాటు 10 ఏళ్లుగా క్లెయిమ్ చేయని ఖాతాలు ఇందులో ఉంటాయి. ఇనాక్టివ్ అయిన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను డీఈఏ ఫండ్‌కు ప్రతి నెలా బ్యాంకులు తరలించాల్సి ఉంటుంది. అన్‌క్లెయిమ్డ్ కేటగిరిలో ఉన్నా లేక డీఈఏ ఫండ్‌లో ఉన్నా డిపాజిట్ల మీద వడ్డీ అయితే లభిస్తుంది. 2021 మే నుంచి ఏడాదికి 3శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
ఎలాంటివి అన్‌క్లెయిమ్డ్‌గా మారతాయి?
సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్
ఫిక్స్‌డ్ డిపాజిట్స్
టర్మ్ డిపాజిట్స్
రికరింగ్ డిపాజిట్స్
డీడీలు
మనీ ఆర్డర్లు
బ్యాంకు ఖాతా అన్‌క్లెయిమ్డ్/ఇనాపరేటివ్ అయిందని ఎలా తెలుసుకోవాలి?
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అన్‌క్లెయిమ్డ్ టర్మ్ డిపాజిట్స్, ఇనాపరేటివ్ ఖాతాల సమాచారాన్ని బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లో ఉంచుతాయి. ఖాతాదారుల పేర్లు, చిరునామాలు అందులో ఉంటాయి. పాన్ కార్డ్, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్లు కూడా కొన్ని బ్యాంకులు ఉంచుతాయి. ఇనాపరేటివ్ అకౌంట్స్ తెలుసుకునేందుకు కొన్ని బ్యాంకుల వెబ్‌సైట్స్ ఇక్కడ ఇచ్చాం.
ఎస్‌బీఐ: https://sbi.co.in/web/customer-care/inoperative-accounts
యూనియన్ బ్యాంక్: https://eremit.unionbankofindia.co.in/udeposit/GUIs/CustomerList.aspx
బ్యాంక్ ఆఫ్ బరోడా: https://smepaisa.bankofbaroda.co.in/inopacc/
కెనరా బ్యాంక్: https://canarabank.com/Unclaimed-Deposit.aspx
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: https://online.hdfc.com/depositsapps/UnclaimedDepositEnq.aspx
ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలోకి వెళ్లిన తరువాత ఖాతాదారుల పేరు, చిరునామా ఎంటర్ చేయడం ద్వారా ఖాతాల వివరాలు తెలుసుకోవచ్చు.
ఏ బ్యాంకు ఖాతాదారులైనా ఆ బ్యాంకు పేరుతో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్/ఇనాపరేటివ్ అకౌంట్స్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు.
ఉదాహరణకు కర్నాటక బ్యాంక్ ఖాతాదారులైతే... Karnataka Bank unclaimed deposits అని గూగుల్‌లో టైప్ చేయాలి.
అప్పుడు ఈ లింక్ వస్తుంది... https://karnatakabank.com/unclaimed-deposits
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
ఖాతాదారు, నామినీ, చట్టపరమైన వారసులు ఈ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి క్లెయిమ్ ఫాం నింపాలి.
పాస్‌బుక్
అకౌంట్ స్టేట్‌మెంట్స్
టర్మ్ డిపాజిట్ రశీదు
స్పెషల్ టర్మ్ డిపాజిట్ రశీదు
వీటిలో అందుబాటులో ఉన్నవి బ్యాంక్‌కు సమర్పించాలి.
తప్పకుండా కావాల్సినవి
ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ ఫొటోలు
ఐడీ ప్రూఫ్ పత్రాలు(ఉదా: ఆధార్, పాన్, పాస్‌పోర్ట్)
అడ్రెస్ ప్రూఫ్ పత్రాలు(ఉదా: టెలిఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను)
నో యువర్ కస్టమర్(కేవైసీ) కోసం ఈ పత్రాలు సమర్పించాలి.
ఖాతాదారు చనిపోతే?
ఖాతాదారు చనిపోతే నామిని లేదా చట్టపరమైన వారసులు డబ్బులను క్లెయిమ్ చేసుకోవచ్చు.
సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి క్లెయిమ్ ఫాం సమర్పించడంతోపాటు ఖాతాదారు డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి.
అలాగే క్లెయిమ్ చేసే వ్యక్తి, కేవైసీ కింద ఐడెంటీ ప్రూఫ్, అడ్రెస్ ప్రూఫ్ సమర్పించాలి.
చట్టపరమైన వారసులైతే దాన్ని ధ్రువీకరించే పత్రాలను ఇవ్వాలి.
నాన్-ఇండివిడ్యువల్ ఖాతాలు అయితే?
హిందూ అవిభాజ్య కుటుంబాలు, ప్రొపయటర్‌షిప్ ఖాతాల విషయంలో కంపెనీ లెటర్ హెడ్ ద్వారా క్లెయిమ్ ఫాం సమర్పించాలి. అధికారిక సంతకాలు కూడా ఉండాలి.
ఇనాపరేటివ్ అకౌంట్ అంటే?
రెండు సంవత్సరాలకుపైగా వాడని సేవింగ్, కరెంటు ఖాతాలను ఇనాపరేటివ్ అకౌంట్స్‌గా పరిగణిస్తారు.
ఇనాపరేటివ్ అకౌంట్‌ను మళ్లీ యాక్టివేట్ ఎలా చేయాలి?
ఇలాంటి బ్యాంకు ఖాతాలను మళ్లీ వాడాలనుకుంటే వాటిని ఆపరేషనలైజ్ చేయాలి. ఇందుకు వ్యక్తులు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
తమ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయాల్సిందిగా బ్యాంక్‌కు లెటర్ ఇవ్వాలి. అలాగే గతంలో అకౌంట్ ఎందుకు వాడకుండా వదిలేశారో కారణం చెప్పాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్
పాస్‌బుక్
ఇటీవల దిగిన పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు
ఐడెంటిటీ ప్రూఫ్
అడ్రెస్ ప్రూఫ్
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(డీఈఏఎఫ్) అంటే?
క్లెయిమ్ చేయని డిపాజిట్లు పెరిగిపోతున్న తరుణంలో ఖాతాదారుల్లో అవగాహన కల్పించేందుకు 2014లో డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్(డీఈఏఎఫ్)ను తీసుకొచ్చారు. దీనికొక కమిటీ ఉంటుంది.
కమిటీ ముఖ్యవిధులు:
ఖాతాదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడం
డీఈఏఎఫ్‌లోని నిధులను ఎలా ఖర్చు చేయాలో నిర్ణయించడం
అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను బ్యాంకుల నుంచి డీఈఏఎఫ్‌కు బదిలీ చేసేలా చూడటం