Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఆర్టీసీ: "కొలువులల్ల చేర్చుకోండి సారూ... మా బతుకులేం గావాలె"

తెలంగాణ ఆర్టీసీ:
, బుధవారం, 27 నవంబరు 2019 (16:04 IST)
"కొలువులల్ల చేర్చుకోండి సారూ.. మా బతుకులేం గావాలె సారూ" అంటూ తెలంగాణలో ఆర్టీసీ డిపోల వద్ద ఉన్నతాధికారులను కార్మికులు వేడుకున్నారని, వారి కాళ్ల మీద పడుతున్నారు. వివిధ డిపోల వద్ద మహిళా కార్మికులు భోరున ఏడ్చారని చెప్పింది.
 
''మేం సమ్మె విరమించాం. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి'' అంటూ ఆర్టీసీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద క్యూ కట్టారు. మంగళవారం ఉదయం ఐదు గంటలకే డిపోల వద్దకు చేరుకుని డీఎంలకు వినతిపత్రాలు అందజేసేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారుల అనుమతుల్లేవని, చేర్చుకునే సమస్యే లేదని చెప్పడంతో ఆందోళనలకు దిగారు. విధుల్లో చేరుతామని జేఏసీ ప్రకటించడంతో డిపోలు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్‌ విధించారు.
 
కాంట్రాక్టు ఉద్యోగులు రావద్దని ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్ల మీద కనిపించిన ప్రతి ఆర్టీసీ కార్మికుడినీ అదుపులోకి తీసుకున్నారు. సాధారణ దుస్తుల్లో ఉన్నప్పటికీ గుర్తించి అరెస్ట్‌ చేశారు.
 
హైదరాబాద్‌ రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డిపోల వద్ద ఆందోళన చేపట్టినందుకు 15 కేసులు నమోదు చేశారు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మహిళా కార్మికులు కంటతడి పెట్టారు.
 
విధుల్లో చేరేందుకు ఖమ్మం డిపో వద్దకు బయల్దేరిన కార్మికులను అడ్డుకోవడంతో బస్టాండు సమీపంలోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయం పైకి వెళ్లి ధర్నాకు దిగారు. మహిళా కండక్టర్లు.. భవనంపై నుంచి దూకుతామని హెచ్చరించడంతో పోలీసులు వలలు తెప్పించారు. దాదాపు ఐదు గంటలపాటు కార్మికులు భవనంపైనే ఉండి నిరసన తెలిపారు. సత్తుపల్లిలో మహిళా కండక్టర్‌ స్పృహ తప్పి పడిపోయారు.
 
కామారెడ్డి జిల్లాలో కార్మికుల ఇళ్లకు వెళ్లి మరీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తమను లోపలకు వెళ్లనివ్వాలంటూ కార్మికులు డిపోల వద్ద పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. కార్మికులను, వారికి మద్దతిచ్చిన రాజకీయ, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదగిరిగుట్టలో జరిగిన తోపులాటలో కార్మికుడి కాలు విరిగింది. 
 
పిల్లల చదువుల్లోకి ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకురావద్దు: పవన్ కల్యాణ్ 
"ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థిని చంపేసినట్లు భాషను నిర్మూలించడానికి, భాష రాత్రికి రాత్రి పుట్టింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వారసత్వంగా భాషాసంపద వస్తోంది. చిరస్థాయిగా ఉంటుంది" అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. "ఎంత మంది శత్రువులనైనా ఎదిరిస్తా. ఎంత మంది శత్రువులు కలిసివచ్చినా తట్టుకుంటా. ఇంగ్లిష్‌పై తప్పుగా మాట్లాడేవారిని మీరు నిలదీయండి" అని ఈ నెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడారని, భాషా సంస్కృతులను ఎలా రక్షించుకోవాలో తమకు తెలుసని పవన్ వ్యాఖ్యానించారు.
webdunia
 
"దయచేసి పిల్లల చదువుల్లోకి ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకురాకండి. తెలుగు, ఇంగ్లిషు అనే భేదం తీసుకొచ్చి రెండు వర్గాలుగా చేయొద్దు. మాతృభాష నేర్పమంటే దుర్భాషలాడతారా? తెలుగు భాష, సంస్కృతిపై మీ దాడిని ప్రజలు బలంగా ఎదుర్కొంటారు" అని ఆయన చెప్పారు. 
 
అమాంతం పెరిగిన ఉల్లి ధర 
ఉల్లి ధర ఘాటెక్కిస్తోందని, హైదరాబాద్‌లో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80 నుంచి 100 వరకూ పలుకుతోందని నవ తెలంగాణ తెలిపింది. హోల్‌‌‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు అత్యధికంగా రూ.11 వేలకు చేరింది. గత కొద్ది రోజుల వరకూ క్వింటాలు రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకూ ఉండగా, రిటైల్‌లో కిలో రూ. 60 - 80 వరకూ పలికింది. కానీ, గత రెండు రోజులనుంచి ధరలు అమాంతం పెరిగాయి.
 
క్వింటాల్‌ రూ.11 వేలకు చేరటంతో.. రిటైల్‌ ధరలు రూ.100కు చేరుకున్నాయి. గతంలో ఐదు కిలోలు కొనేవారు.. ప్రస్తుతం ఆర్థిక మందగమనం , నెలాఖరు కావటంతో.. అరకిలో ఉల్లిపాయలను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. అలాగే కృత్రిమ కొరత సృష్టించి వ్యాపారులు ధరలను మరింత పెంచేస్తున్నట్టు ఆరోపణలూ ఉన్నాయి.
webdunia
 
దక్షిణ కోస్తా రైల్వేలోనే వాల్తేరు జోన్‌ 
దక్షిణ కోస్తా రైల్వేలోనే వాల్తేరు డివిజన్‌ను కొనసాగించే అంశంపై రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి మంగళవారం దిల్లీలో రైల్‌ భవన్‌లో రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వేలో వాల్తేరు డివిజన్‌ను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గత నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ గురించి విజయసాయి రెడ్డి ప్రస్తావించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. వాల్తేరు డివిజన్‌ కొనసాగింపుపై బోర్డు సానుకూలంగా వ్యవహరిస్తుందని చైర్మన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైళ్ళను ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం బోర్డు పరిశీలనలో ఉన్నట్లు యాదవ్‌ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆలయ భూములను ఏపీ ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం