తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. కార్మికులను విధుల్లోకి తీసుకొనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో పాల్గొన్నవారంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, బస్టాండ్‌లు, ప్రధాన కూడల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు.
హయత్ నగర్ 1,2 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. తమని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ డిపో ముందు బైటాయించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని కార్మికులు హెచ్చరించారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.
మరోవైపు ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులకో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం అఖిపక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలు మరోసారి సమావేశంకానున్నారు.
అదేసమయంలో ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతభత్యాల సోమవారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. 48 వేల 190 మంది కార్మికులకు సెప్టెంబరు నెల జీతభత్యాలు ఇవ్వాలని మజ్దూర్ యూనియన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.