బహుశా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందేమో. స్కాట్లాండ్‌పై విజయంతో పాటూ మంచి రన్ రేట్ కూడా సాధించిన భారత్ అభిమానుల్లో సెమీస్ ఆశలను సజీవంగా నిలిపింది. అఫ్గానిస్తాన్‌పై 210 పరుగుల భారీ స్కోరు చేసి, 66 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు, ఇప్పుడు స్కాట్లాండ్ మీద విజయంతో రన్ రేట్ మరింత మెరుగు పరుచుకుంది.
8 పాయింట్లతో గ్రూప్ 2 పట్టికలో టాప్‌లో ఉన్న పాకిస్తాన్ కంటే కూడా భారత్ రన్ రేటే ఎక్కువ. స్కాట్లాండ్‌ను 85 పరుగులకు కట్టడి చేయడంతోపాటూ ఏడు ఓవర్లలోపే లక్ష్యాన్ని అందుకున్న భారత్ 1.679 రన్ రేట్ సాధించింది.
మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో భారత్ తన సెమీస్ అవకాశాలు మెరుగు పరుచుకోవాలంటే మిగిలిన మ్యాచుల్లో భారీ తేడాతో విజయం సాధించాలి అనేది అభిమానులు మర్చిపోలేదు.
అందుకే, అఫ్గానిస్తాన్‌తో విజయం సాధించినా, అది సాధ్యమేనా అని అభిమానుల మనసుల్లో ఎక్కడో ఒక మూల సందేహం అలాగే ఉండిపోయింది. ఇప్పుడు వరుసగా స్కాట్లాండ్ మీద విజయంతో, అది కూడా 81 బంతుల తేడాతో గెలవడంతో భారత్‌లో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. స్కాట్లాండ్ చిన్న జట్టే అయినా ఈ మ్యాచ్ కీలకం కావడంతో భారత్ ముందే పక్కా లెక్కలతో రంగంలోకి దింగింది. టాస్ గెలవడమే ఆలస్యం బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును 85 పరుగులకు కట్టడి చేసింది.
వెంటనే భారత్ రన్ రేట్ మెరుగు పరుచుకోవాలంటే భారత్ ఏ గేమ్ ప్లాన్‌తో ఆడాల్సుంటుందో బీసీసీఐ భారత బ్యాటింగ్‌కు ముందు ట్వీట్ చేసింది. విరాట్ జట్టు ఈ లక్ష్యాన్ని 8.5 ఓవర్లలో చేజ్ చేస్తే న్యూజీలాండ్ రన్ రేట్ దాటవచ్చని, 7.1 ఓవర్ లోపు చేజ్ చేస్తే అఫ్గానిస్తాన్ రన్ రేటును కూడా దాటేయచ్చని చెప్పింది. బీసీసీఐ లెక్కలు వేసినట్లే ఏడో ఓవర్లోనే విజయ లక్ష్యాన్ని అందుకున్న టీమిండియా సెమీస్ చేరుకునే అవకాశాలను సజీవంగా నిలిపింది.
తాము దాదాపు 100-120 పరుగులకు స్కాట్లాండ్‌ను కట్టడి చేయాలనుకున్నట్టు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా చెప్పాడు. 85 పరుగుల లక్ష్యాన్ని 8-10 ఓవర్లలోనే చేజ్ చేయగలం అనుకున్నామని, కానీ ఆలోపే అది చేయగలిగినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇక ఇప్పుడు భారత్ మాత్రమే కాదు.. క్రికెట్ ప్రపంచం కళ్లన్నీ రేపు(నవంబర్ 7న) జరగబోయే అఫ్గానిస్తాన్- న్యూజీలాండ్ మ్యాచ్ మీదే ఉన్నాయి. మొన్నటివరకూ భారత పేలవ ప్రదర్శనకు ఆగ్రహించిన భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు అఫ్గానిస్తాన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు.
సమీకరణాలు ఎలా?
ఇప్పుడు మూడు జట్ల సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయనేదానిపై ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో ఒక సమీకరణం ఇచ్చింది.
భారత్
రెండు విజయాలతో 4 పాయింట్లు సాధించిన భారత్ 1.169 రన్ రేట్ సాధించింది. ఇక భారత్ ఒక్క నమీబియాతో ఆడాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం తర్వాత మైనస్ నుంచి 1.069కి చేరిన భారత రన్ రేట్ ఇప్పుడు 1.619కు చేరింది. భారత్ సెమీస్‌కు వెళ్లాలంటే న్యూజీలాండ్ కచ్చితంగా అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోవాలి. అదే జరిగితే రన్ రేట్ ద్వారా సెమీస్‌కు చేరడానికి భారత్‌కు మంచి అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు అఫ్గానిస్తాన్ 160 పరుగులు చేసి న్యూజీలాండ్‌ను 30 పరుగుల తేడాతో ఓడిస్తే, భారత్ రన్ రేటులో అఫ్గానిస్తాన్ కంటే పైనుండడానికి నమీబియాను 21 పరుగుల తేడాతో ఓడించాల్సుంటుంది. అఫ్గానిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్ తర్వాత రోజు భారత్ చివరి మ్యాచ్ ఆడబోతుండడంతో తాము ఎన్ని పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్‌కు క్వాలిఫై కావచ్చో భారత్‌కు ఒక స్పష్టమైన లెక్క కూడా ఉంటుంది. కానీ, ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిస్తే, భారత సెమీస్ ఆశలకు తెరపడుతుంది. తర్వాత రోజు నమీబియాతో ఆడే మ్యాచ్ లాంఛనమే అవుతుంది.
అఫ్గానిస్తాన్
అఫ్గానిస్తాన్ కూడా రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించింది. దాని రన్ రేట్ 1.481. అది న్యూజీలాండ్‌తో మాత్రమే ఆడాల్సి ఉంది. స్కాట్లాండ్ మీద భారత్ విజయంతో అఫ్గానిస్తాన్ క్వాలిఫై అవకాశాలకు దెబ్బపడింది. పైన చెప్పినట్లు అది న్యూజీలాండ్‌ను 30 పరుగుల తేడాతో ఓడించినా రన్ రేట్‌లో ముందుండడానికి భారత్ ఎదుట సాదాసీదా విజయ లక్ష్యం ఉంటుంది.
అందుకే, పోటీలో నిలవాలంటే అఫ్గానిస్తాన్ ఈ మ్యాచ్‌లో భారీ విజయం అందుకోవాల్సి ఉంటుంది. అది 160 పరుగులు చేసి 60 పరుగుల తేడాతో గెలిస్తే, భారత్ విన్నింగ్ మార్జిన్ 48 పరుగుల తేడాలోపే ఉండాలని అది కోరుకోవాలి. కానీ, భారత్ ఈ గ్రూప్‌లో చివరి మ్యాచ్ ఆడడం కూడా అఫ్గానిస్తాన్‌కు సమస్యగా మారవచ్చు. అయితే, సాదాసీదా విజయం సెమీస్‌కు చేరడానికి సరిపోదని ముందే తెలిసిన అఫ్గాన్ తన చివరి మ్యాచ్‌లో దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది.
న్యూజీలాండ్
ఇప్పటివరకూ 3 విజయాలతో 6 పాయింట్లు సాధించిన న్యూజీలాండ్ రన్ రేట్ 1.277 ఉంది. అది అఫ్గానిస్తాన్‌తో చివరి మ్యాచ్ ఆడుతుంది. న్యూజీలాండ్‌కు రన్ రేట్ పెద్దగా ఆందోళన కలిగించే అంశం కాదు. కానీ, అది ఓడితే అఫ్గానిస్తాన్ కంటే తక్కువ రన్ రేట్ ఉండడంతో కచ్చితంగా సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. కానీ గెలిస్తే.. ఆ జట్టుకు 8 పాయింట్లు వస్తాయి. అది నేరుగా సెమీస్ చేరుకుంటుంది.
ఐదు రోజుల్లో మూడు మైదానాల్లో మూడు మ్యాచ్‌లు ఆడడం కూడా ఈ జట్టుకు సవాలుగా ఉండబోతోంది. ఇటు, అఫ్గానిస్తాన్ విషయానికి వస్తే అది గత రెండు మ్యాచ్‌లు అబుధాబిలో ఆడింది. ఇప్పుడు న్యూజీలాండ్‌ను కూడా అది అక్కడే ఎదుర్కుంటుంది. ఇది దానికి కచ్చితంగా ప్లస్ అవుతుంది.
సోషల్ మీడియాలో ఆశలు
భారత్ స్కాట్లాండ్ మ్యాచ్‌కు ముందు నుంచే INDvsSCOT ట్రెండ్ అవడం మొదలైంది. ఇండియా తను చేయాల్సింది చేసిందని, ఇక అందరి కళ్లూ అఫ్గానిస్తాన్-న్యూజీలాండ్ మ్యాచ్ మీదే ఉన్నాయని మ్యాచ్ తర్వాత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ట్వీట్ చేశాడు. రజనీష్ గుప్తా లాంటి ట్విటర్ యూజర్లు న్యూజీలాండ్ అఫ్గానిస్తాన్ మధ్య మ్యాచ్ ఫలితం భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా వివరించారు..
సెమీ ఫైనల్లో స్థానం పొందడం సింపుల్ అన్న ఆయన న్యూజీలాండ్ అఫ్గానిస్తాన్‌ను ఓడిస్తే భారత సెమీస్ ఆశలకు తెరపడుతుందని, ఒకవేళ అఫ్గానిస్తాన్ 150 పరుగులు చేసి న్యూజీలాండ్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించినా భారత్ నమీబియాను ఓడిస్తే చాలు.. సెమీస్ చేరుకోవచ్చు అని అన్నారు. అఫ్గానిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్, మిగతా స్పిన్నర్లు గట్టిగా పోరాడి న్యూజీలాండ్‌ను 140 పరుగుల లోపు కట్టడి చేయగలిగితే, ఏదైనా సాధ్యమే అని జ్ఞానేష్ బోరా అనే ట్విటర్ యూజర్ అన్నాడు.
కొంతమంది అభిమానులు భారత జట్టు నెట్ రన్ రేట్ లెక్కలు చేస్తున్నట్లు ఒక ఫొటో కూడా పోస్ట్ చేశారు. కానీ, విశాల్ అగర్వాల్ లాంటి ట్విటర్ యూజర్లు భారత ప్రదర్శనపై ఇంకా కోపంగానే ఉన్నారు. "వాళ్లు చేయాల్సింది చేసుంటే.. ఇప్పుడు సెమీస్ చేరడానికి మిగతా జట్లపై నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదుగా" అన్నాడు..
అఫ్గాన్-న్యూజీలాండ్‌కు ఒక రోజు ముందే AFGvsNZ కూడా ట్రెండ్ అవడం మొదలైంది. భారతీయులందరూ అఫ్గానిస్తాన్ విజయం కోసం ప్రార్థిస్తారని నయన్ మణి మజుందార్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో అఫ్గాన్-న్యూజీలాండ్ మ్యాచ్ మీద భారత్ ఎన్ని ఆశలు పెట్టుకుంది అనేదానిపై రకరకాల మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
టీ20 గ్రూప్‌లో ఈరోజు(నవంబర్ 6) గ్రూప్ 1లో సెమీ ఫైనల్ బరిలో ఉన్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాకు కీలకం అయిన మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌తో తలపడుతుంటే, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌ను ఢీకొంటోంది. ఇవి కూడా కీలకమైన మ్యాచ్‌లే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఏది ఓడినా ఇంకొకటి సులభంగా సెమీస్‌కు చేరుకుంటుంది.
కానీ ప్రపంచం అంతా రేపు జరగబోయే అఫ్గానిస్తాన్- న్యూజీలాండ్ మ్యాచ్ ఫలితం కోసమే ఎదురుచూస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా సెమీస్ చేరుకోడానికి కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇప్పటివరకూ తాను చేయగలిగినవన్నీ చేసింది. ఇక జరగాల్సింది మాత్రం జట్టు చేతుల్లో లేదు. అఫ్గానిస్తాన్ న్యూజీలాండ్ చేతిలో ఓడితే, ఆ ఓటమితో భారత్ కూడా సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది.