Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సున్నం రాజయ్య కరోనాతో మృతి : మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నిరాడంబరుడు

Advertiesment
సున్నం రాజయ్య కరోనాతో మృతి : మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగే నిరాడంబరుడు
, మంగళవారం, 4 ఆగస్టు 2020 (13:40 IST)
భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యేగా మూడుసార్లు పనిచేసిన సున్నం రాజయ్య మరణించారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను ఇటీవల స్వగ్రామం నుంచి విజయవాడలోని కోవిడ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు. రాజయ్య గత పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. సోమవారం పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయిందని కుటుంబీకులు తెలిపారు. 
 
మూడు సార్లు ఎమ్మెల్యే.. నిరాడంబరుడు
సీపీఎంకు చెందిన ఆయన 1999, 2004, 2014లో భద్రాచలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నిరాడంబరుడిగా, ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన నిత్యం ద్విచక్రవాహనం, ఆర్టీసీ బస్సుల్లోనే తిరిగేవారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 
రాష్ట్ర విభజన తరువాత
ఆంధ్రప్రదేశ్ పునర్‌విభజన అనంతరం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిశాయి. రాజయ్య అంతవరకు ప్రాతినిధ్యం వహించిన భద్రాచలం నియోజకవర్గంలోని అత్యధిక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లోని రంపచోడవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చాయి.
 
భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు.. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వారావు పేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. వీటిలో కొన్ని మండలాలు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా ఏపీలో కలిశాయి.
 
వీటిలో భద్రాచలం నియోజకవర్గం నుంచి వేరయిన నాలుగు మండలాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో.. పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని మండలాలను పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. ఈ ఏడు మండలాల్లోని 211 గ్రామాల బదలాయింపునకు సంబంధించి కేంద్రం చట్టం కూడా చేసింది. దీంతో అప్పటివరకు భద్రాచల నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నవారిలో అత్యధికులు రంపచోడవరం నియోజకవర్గ ఓటర్లుగా మారారు. మరికొందరు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చారు. దాంతో రాజయ్య 2019 ఎన్నికల్లో రంపచోడవరం నుంచి పోటీ చేశారు.
 
ప్రజాపోరాటాలలోనే..
సున్నం రాజయ్య ఓ సందర్భంలో నియోజకవర్గ ప్రజల సమస్యలపై హైదరాబాద్‌లోని సచివాలయానికి వెళ్లినప్పుడు చిత్రమైన అనుభవం ఎదుర్కొన్నారు. వెంట గన్‌మేన్ లేకపోవడం, ఆయన ఆటోలో సచివాలయానికి రావడంతో ఎమ్మెల్యేగా గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను గేట్ వద్ద అడ్డుకున్నారు. ఆ తర్వాత తాను ఎమ్మెల్యేనని ఐడీ కార్డ్ చూపించిన తర్వాత మాత్రమే సున్నం రాజయ్యని సెక్రటేరియేట్ లోకి అనుమతించారు.
 
2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఆందోళనలో ఆమరణ దీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కూడా ప్రజాసమస్యలపై ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. సున్నం రాజయ్య పోలవరం నిర్వాసితుల పక్షాన పోరాటం చేశారు. ఈ సందర్భంగా వివిధ కేసులను కూడా ఎదుర్కొన్నారు. బాధితులకు పునరావాసం కోసం గత నెలలో కూడా ఆయన నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపా నేత విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి.. ఏంటదో తెలుసా?