Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘మండి’పోతున్న యూరప్, పోర్చుగల్, స్పెయిన్‌లో వడగాలులతో చనిపోతున్న ప్రజలు

Fire
, మంగళవారం, 19 జులై 2022 (22:41 IST)
ఇటీవల కాలంలో పశ్చిమ యూరప్‌లో ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం స్పెయిన్‌లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. మరొక వైపు బ్రిటన్, ఫ్రాన్స్‌లో వడగాలుల వల్ల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్ దేశాల అడవుల్లో కార్చిచ్చులు చెలరేగడంతో వేల మంది ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. బ్రిటన్, ఫ్రాన్స్‌ల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 
ఫ్రాన్స్‌లోని చాలా ప్రాంతాల్లో ఎన్నడూ చూడని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆ దేశపు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ నగరమైన నాట్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యూరప్‌లోని చాలా దేశాల్లో కార్చిచ్చుల వల్ల 30 వేల మందికిపైగా ప్రజలు ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఒక జంతు ప్రదర్శనశాల వద్ద మంటలు చెలరేగొచ్చనే హెచ్చరికలతో వెయ్యికి పైగా జంతువులను బయటకు తరలించారు. ఫ్రాన్స్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన జెరోంద్‌లో భారీ సంఖ్యలో కార్చిచ్చులు చెలరేగాయి. సుమారు వారం రోజులుగా 17వేల హెక్టార్లలో మంటలు చెలరేగాయి. ఇప్పటికీ ఆ మంటలు అదుపులోకి రాలేదు.

 
ఇక స్పెయిన్‌లోని జమోరా ప్రాంతంలో మంటల వల్ల ఇద్దరు చనిపోయారు. రైలు పట్టాలకు దగ్గర్లో మంటలు చెలరేగడంతో రైళ్ల రాకపోకలు కూడా నిలిచి పోయాయి. పోర్చుగల్‌లో మంటల నుంచి తప్పించుకునే క్రమంలో ఇక వృద్ధ జంట చనిపోయింది. ఈ కార్చిచ్చులను రాకాసులతో పోల్చారు, ఫ్రాన్స్‌లోని జెరోంద్ ప్రావిన్స్ ప్రెసిడెంట్ కువాన్ లుక్ గ్లీజ్. 'అక్టోపస్ మాదిరిగా ఈ రాకాసి మంటలు అన్ని దిశల్లో కమ్ముకు వస్తున్నాయి. ఉష్ణోగ్రతలు, గాలులు, గాలిలో తగినంతగా తేమ లేకపోవడం వంటివి ఇందుకు కారణాలు' అని కువాన్ అన్నారు.

 
సోమవారం జెరోంద్‌లో 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదయ్యాయని, నేడు కాస్త తక్కువగానే ఉన్నాయని బీబీసీ ప్రతినిధి లూసీ విలియమ్సన్ తెలిపారు. అయితే వాతావరణం పొడిగా ఉండి, గాలులు తీవ్రంగా దిశలు మార్చుకుంటున్నంత వరకు పరిస్థితులు అదుపులోకి రావని వెల్లడించారు. బ్రిటన్‌లో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు ఇంగ్లండ్‌లోని సఫాల్క్‌లో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. మంగళవారం ఇది మరింత పెరగొచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంగ్లండ్‌లోని అన్ని ప్రాంతాల్లో వడగాలుల హెచ్చరికలు జారీ చేశారు.

 
వేడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు చాలా మంది నదులు, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిలో మునిగి సుమారు నలుగురు చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల లండన్‌లో రైళ్లు, విమానాల సర్వీసులు రద్దు చేశారు. నెదర్లాండ్‌లో సోమవారం అత్యంత వేడైన రోజుగా నమోదైంది. ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు పెరిగాయి. రానున్న రోజుల్లో బెల్జియం, జర్మనీలలో 40 డిగ్రీల వరకు పెరగొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో పోర్చుగల్, స్పెయిన్‌లలో వడగాలుల వల్ల వెయ్యి మందికిపైగా ప్రజలు చనిపోయారు.

 
గత గురువారం పోర్చుగల్‌లో టెంపరేచర్ 47 డిగ్రీలకు చేరింది. కార్చిచ్చు వల్ల ముహసా నుంచి సుమారు 300 మందిని తరలించారు. 2017లో మంటల వల్ల 66 మంది చనిపోయారు. అందువల్ల ఈ సారి ఆ ప్రమాదం జరగకూడదని అధికారులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. స్పెయిన్‌లో సుమారు 20 ప్రాంతాల్లో మంటలు అదుపులోకి రావడం లేదు. పోర్చుగల్-స్పెయిన్ సరిహద్దుల్లో ఒక రైలును ఆపేశారు. పర్యావరణ మార్పుల వల్లే ఎన్నడూ లేనంతగా గాలులు వేడి ఎక్కుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి ఇప్పటికి భూమి ఉష్ణోగ్రత 1.1 డిగ్రీలు పెరిగింది. కర్బన ఉద్గారాలను తగ్గించకుంటే భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరగొచ్చని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఆగని రాజకీయ రక్త చరిత్ర... వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం